Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 21


    మనం కాముని పూర్ణిమ ఉత్సవం జరుపుకుంటుంటాం. పౌర్ణమి నాడు యువతీ యువకులంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకుంటారు. ఆ ఉత్సవం సందర్భంగా కలుసుకున్నవారి మధ్య ప్రేమ జనించి దంపతులుగా మారితే, తల్లిదండ్రులు అక్షింతలు వేసి దీవించేవారు పూర్వకాలంలో.

 

    హిందూ పురాణాల్లో కాదు గ్రీకు పురాణాల్లో సైతం మన మన్మథుణ్ణి పోలిన దేవుడున్నాడు అందానికి దేవతయైన వీనస్ కొడుకే ప్రేమ సామ్రాజ్యపు అధినేత. అతని పేరు క్యూపిడ్. మన్మథుడిలాగే క్యూపిడ్ కూడా ప్రేమికులైన యువతీ యువకులపై ప్రేమ బాణాల్ని సంధిస్తూ వుంటాడు.

 

    గ్రీకు సంస్కృతిలో ప్రేమకు దేవుడే కాదు, దేవత కూడా వుంది. ఆమె పేరు జునో ఫెబ్రుటా. యువతీ యువకుల మధ్య ప్రేమని ప్రేరేపించడమే లక్ష్యంగా జునో ఫెబ్రుటా అనే ఆ దేవత ఆకాశంలో విహారం చేస్తుంటుందని గ్రీకుల నమ్మకం. ఆ నమ్మకం ప్రాతిపదికపైన వాళ్ళు ప్రతి సంవత్సరం ఓరోజు ప్రేమ దినోత్సవంగా జరుపుకోవడం ఎప్పుడో ఆరంభమైంది.

 

    ఇటువంటి ఉత్సవాన్నే రోమన్స్ కూడా జరుపుకుంటారు. వాళ్ళ ప్రేమ దేవత కూడా ఫెబ్రుటానే. రోమన్స్ మనలాగా పౌర్ణమి రోజున కాకుండా ప్రతీ సంవత్సరం ఆరంభ దినాన ఈ ఉత్సవాన్ని జరుపుకుంటుండే వారు..." చెప్పడం ఆపిన జయారెడ్డి, కిచెన్ లోకి వెళ్ళి రెండు గాజు గ్లాసుల్ని తెచ్చి టీపాయ్ మీద పెట్టి ఫ్రిజ్ వైపు నడిచింది.

 

    ఆమె అలా మధ్య మధ్యలో చెప్పడం ఆపినప్పుడల్లా అపరిచితురాలు పెట్టిన గడువు గుర్తుకొచ్చి ఉద్వేగానికి లోనైపోతున్నాడు శ్రీధర్.

 

    ఫ్రిజ్ దగ్గరకెళ్ళిన జయారెడ్డి డోరు ఓపెన్ చేసి, ఒక వైన్ బాటిల్, ఐస్ క్యూబ్స్ ట్రేతో వచ్చి శ్రీధర్ కెదురుగా కూర్చుంది.

 

    "ఏంటిలా చేస్తున్నావ్...?" అడిగాడు శ్రీధర్ తనను తాను నిగ్రహించుకుంటూ.

 

    "యూనో...వైన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వైన్ రక్తాన్ని పలుచ చేసి, నెర్వస్ సిస్టాన్ని స్టిమ్యూలేట్ చేస్తుంది. ఫర్ అవర్ హెల్త్ సేక్ లెటజ్ హేవ్" అంటూ వైన్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసింది.

 

    "సారీ... ఇప్పుడు వీలుపడదు. తర్వాతెప్పుడైనా తీసుకుంటా. తమక్యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ..." అన్నాడు శ్రీధర్ సోఫాలో అసహనంగా కదులుతూ.

 

    "మాట తప్పకూడదు. ఇది లేకుండా నేను పడుకోలేను. విత్ యువర్ కైండ్ పర్మిషన్..." అంటూ గ్లాసులోకి వైన్ వంపుకుని, మరో గ్లాస్ లో కోక్ నింపి అతని చేతికిచ్చింది.

 

    "రోమన్స్ ప్రేమదేవత ఫెబ్రుటా సాక్షిగా యువతీ యువకుల పేర్లని చీటీల మీద రాసి లాటరీ తీసేవారు. ఆ లాటరీలో వచ్చిన జంటకు కలిసి తిరిగేందుకు సామాజికపరమైన అనుమతి వుండేది ఆ రోజుల్లో. రెండు నెలల తర్వాత ఆ జంటలలో ఒకరికొకరు నచ్చితే వివాహం చేసుకుని చట్టబద్దంగా సంసారాన్ని కొనసాగించే వారు.

 

    అప్పట్లో రోమన్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి నెలలుండేవి కావు. కనుక రోమన్స్ కొత్త సంవత్సరం మార్చి ఒకటిన మొదలయ్యేది ఆనాడే ప్రేమికుల ఉత్సవం జరిగేది. ఆనాటికది ప్రేమికుల దినోత్సవమే. ఆ తర్వాత చరిత్రలో వచ్చిన మార్పుల కారణంగా రోమన్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి నెలలు చోటు చేసుకున్నాయి. అప్పుడే ప్రేమికుల పండుగను మార్చి ఒకటి నుంచి ఫిబ్రవరి 14కు మార్చారు. అలా ఎందుకు చేశారన్నది తెలియదు.

 

    ప్రేమికులు పదిహేను రోజులు కలిసి జీవించాక ఒకరినొకరు నచ్చితే వాళ్ళ పెళ్ళి జరిగే రోజు మాత్రం మార్చి ఒకటి. అందుకోసమే ప్రేమికుల పరిచయం ఉత్సవం ఫిబ్రవరి 14కి మార్చి వుండవచ్చు.

 

    ఈ ప్రేమికుల ఉత్సవాన్ని చూసి రోమన్ చక్రవర్తి క్లాడియస్-2 ఆగ్రహం చెంది దాన్నడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. దానికి కారణం లేకపోలేదు. అప్పట్లో క్లాడియస్-2 తన సామ్రాజ్య విస్తరణ కోసం పెద్ద ఎత్తున సైనిక దళాలు అవసరమయ్యాయి. యువకుల్ని సైన్యంలో చేర్చుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా యువకులు ప్రేమ సంబరాల్లో పడి సైనిక దళంలో చేరేందుకు ఇష్టపడేవారు కాదు.

 

    అప్పటికే పెళ్ళి చేసుకున్న వాళ్ళు భార్యా బిడ్డల్ని వదలి యుద్ధాల్లో పాల్గొనేందుకు అయిష్టం చూపించేవారు.

 

    దాంతో క్లాడియస్-2 తన రాజ్య విస్తరణకు అడ్డుపడుతున్న ప్రేమలను, పెళ్ళిళ్ళను తీవ్రంగా నిరసించి, పెళ్ళిళ్ళకు కారణమవుతున్న ప్రేమని నిర్ధాక్షిణ్యంగా నిషేధించాడు. కొన్నాళ్ళపాటు ఫిబ్రవరి 14న జరగవలసిన ప్రేమోత్సవాలు ఆగిపోయాయి. మొండివాడైన రాజుకు ఎదురు చెప్పే ధైర్యం ప్రజలకు లేక పోయింది. సరిగ్గా ఆ సమయంలోనే యూరప్ కాంటినెంట్ రాజ్యాల్లో క్రైస్తవ మతం క్రమంగా విస్తరించసాగింది. క్రైస్తవ బోధనలను రోమన్ సామ్రాజ్యంలో తొలిసారిగా వాలెంటైన్ అనే యువకుడు ప్రచారం చేయడం ఆరంభించాడు.

 

    క్లాడియస్-2 ఆజ్ఞప్రకారం ప్రేమోత్సవం చట్టబద్ధంగా రద్దయినా, యువతీ యువకుల మధ్య మాత్రం ప్రేమ విలువ చప్పబడిపోలేదు.

 

    రాజుకు భయపడి బయటకు చెప్పకపోయినా, రహస్యంగానే ప్రేమించుకుంటూ పెళ్ళి చేసుకునేందుకు వాలెంటైన్ సహకారం తీసుకునే వాళ్ళు" చెప్పడం ఆపిన జయారెడ్డి మరికొంత వైన్ తన గ్లాసులోకి వంపుకొని, ఐస్ క్యూబ్స్ వేసుకుని, ఖాళీ అయిన శ్రీధర్ గ్లాసులో తిరిగి కోక్ నింపి, వైన్ కొద్దిగా సిప్ చేసి, అదోరకంగా శ్రీధర్ వైపు చూసింది.

 

    ఆమె చూపుని అర్థం చేసుకుని "ప్లీజ్...ప్లీజ్...కంటిన్యూ..." అన్నాడు ఆతృతపడిపోతూ, అపరిచితురాలు పెట్టిన గడువు దగ్గరవు తుండడంతో అతనిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది.

 

    ప్రేమించుకోడాలు, ప్రేమ గురించి గొప్పగా చెప్పుకోడాలు తప్ప ప్రేమ వెనుక ఎంతో గొప్ప చరిత్ర వుందని తెలియని నేటి ప్రేమికుల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఒకసారి నా బెడ్ రూమ్ లోకొచ్చి చూడు... ప్రేమ వీరుడైన వాలెంటైన్ పోట్రెట్ పెయింటింగ్ ఫోటోకాపీ, పటం కట్టి నార్త్ వాల్ కి ఫిక్స్ చేశాను. ఈస్ట్ వాల్ కి మొట్టమొదటి వాలెంటైన్ కార్డుగా చరిత్రలో చోటుచేసుకున్న కార్డ్ బ్లో- ఆప్ కూడా ఫ్రేమ్ కట్టి తగిలించాను. యూనో...దక్షిణంవైపు తలపెట్టి పడుకునే నేను నిద్రలేవగానే కళ్ళుతెరిచి చూసేది వాలెంటైన్ ప్రోట్రైట్ నే. బెడ్ రూంలోంచి హాల్లోకి వస్తూ చూసేది వాలెంటైన్ కార్డ్ ని."

 Previous Page Next Page