ఆమె మాటలకు మధ్యలోనే అడ్డొచ్చేశాడు శ్రీధర్.
"నీకు వాలెంటైన్ మీద వున్న ఆరాధన గురించి తర్వాతెప్పుడైనా సావధానంగా చెబుదూగానీ, ప్రస్తుతం చెబుతున్నది ఆపకు ప్లీజ్..." అన్నాడు.
"ప్రేమపట్ల జ్ఞానోదయం పొందాలనుకుంటున్న నీ ఆతృత, ఆరాటం ప్రశంసించదగ్గదే. కొన్నాళ్ళకి ప్రేమకు దేవుడైన వాలెంటైన్ ని, క్లాడియస్-2 సైన్యం బంధించి చెరసాలలో వేసింది. ఈ సంఘటన మూడో శతాబ్దపు చివరి రోజుల్లో జరిగింది. సుమారుగా ఇది క్రీస్తుశకం 297లో జరిగిందని చరిత్రకారుల అంచనా.
జైల్లో వున్నప్పటికీ వాలెంటైన్ దృష్టంతా ప్రేమ మీదే వుంది. జైలు ప్రాంగణంలో నల్లకలువ వంటి పుష్పాలు కలిగిన చెట్టు ఒకటి వుండేది. ఆ చెట్టు పేరు తెలియదు. దాని ఆకులు మనిషి గుండె ఆకారంలో వుండేవట. వాలెంటైన్ ఆ చెట్టు ఆకులను తుంచి, వాటి మీద 'వాలెంటైన్ ని గుర్తుంచుకోండి. ప్రేమ విశ్వవ్యాప్తమైనది. ప్రేమే ప్రపంచాన్ని బ్రతికిస్తోంది. ప్రేమించలేనివాళ్ళు-ప్రేమింపబడనివాళ్ళు నా దృష్టిలోనే కాదు భగవంతుని దృష్టిలోనూ నేరస్తులతో సమానం' అనే స్లోగన్స్ రాసి జైలు గోడల అవతలికి విసిరేసేవాడట.
అందుకే ప్రేమకు చిహ్నంగా మానవ హృదయాకారంలో కనిపించే ఆటీన్ గుర్తు బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతేతప్ప ఎంతోమంది అనుకుంటున్నట్టుగా ప్రేమ హృదయంలోంచి పుడుతుంది కనుక ఆ గుర్తు వచ్చిందని అనుకోవడం తప్పు.
ప్రేమకు చిహ్నమైన ఆటీన్ గుర్తులోంచి దూసుకెళ్ళే బాణానికర్థం ప్రేమను జయించడం.
ప్రేమకు చిహ్నమైన ఆటీన్ గుర్తుకు లింగభేదం లేదు. ప్రేమకు వాడే హృదయాకారపు ఆటీన్ గుర్తు వాలెంటైన్ సృష్టే.
జైల్లోంచి వాలెంటైన్ వదిలిన ఆకులను జైలు అధికారి కూతురైన ఆస్టేరి యాస్ ఆసక్తికొద్దీ సేకరించేది.
ఆస్టేరియాస్సే వాలెంటైన్ ప్రేమ ప్రచారానికి ఊపిరి పోసింది.
కొన్నాళ్ళకి వాలెంటైన్ మీద క్లాడియస్-2 విచారణ జరిపి రాజ ద్రోహం క్రింద అతనికి మరణశిక్ష విధించాడు. అతనికి శిరచ్చేదనం జరగబోయే ముందురోజు కూడా నల్లకలువల్లాంటి పుష్పాలు కలిగిన ఆ చెట్టు ఆకులు మొత్తాన్ని తుంచి, వాటి మీద-
రాజు తాత్కాలికం-రాజ్యకాంక్ష తాత్కాలికం- అధికారం తాత్కాలికం- అణచివేత తాత్కాలికం- క్లాడియస్-2 అంతకంటే తాత్కాలికం- ప్రేమ శాశ్వతం. ప్రేమకు పుట్టుకే తప్ప చావు లేదు. మృత్యుదేవతని ఓడించగలిగే ఏకైక శక్తి ప్రేమ. ఆత్మ, ప్రేమ- అక్కాచెల్లెళ్ళు. వాటిపై శాసనాధికారం ఆ భగవంతుడిక్కూడా లేదు. ప్రేమను చంపితే భగవంతుడే చచ్చిపోతాడు. ప్రేమను చంపి భగవంతుడు తన చావును తనే కొని తెచ్చుకోలేడు. ఎందుకంటే భగవంతుడు తెలివికలవాడు కనుక.
ఇలాంటి సందేశాలను తన చర్మాంక దశలో సైతం ప్రపంచాని కందించి, ఆ మరుసటిరోజే ప్రపంచ ప్రేమికుల కోసం తన ప్రాణాన్నే తృణప్రాయంగా త్యాగం చేసేశాడు వాలెంటైన్.
ప్రేమను చంపే వాడే కాదు, చంపాలని ప్రయత్నించేవాడు సైతం పతనం కాక తప్పదని రుజువు చేస్తూ రోమన్ సామ్రాజ్యం పతనమై పోయింది.
ఆ తర్వాత క్రైస్తవమతం ఖండమంతా విస్తరించిపోయింది. రోమన్ సామ్రాజ్యం దానికేం అతీతం కాలేదు. మరికొద్దిరోజుల్లోనే రోమన్ సామ్రాజ్య పాలన క్రైస్తవ మతాధిపతియైన పోప్ చేతిలో కెళ్ళిపోయింది. కొన్ని వత్తిడుల మూలంగానో, పరిస్థితుల మూలంగానో మతం మార్చుకున్న రోమన్ ప్రజలు తమ సంస్కృతిని, పండుగలను మాత్రం వదులుకోలేదు.
ప్రేమోత్సవాన్ని ఎప్పటిలాగే ప్రేమదేవత ఫెబ్రూటాను తలుచుకుని జరుపుకునేవారు.
పునరుద్ధరణకు నోచుకున్న ప్రేమోత్సవం క్రైస్తవ మతాధిపతియైన పోప్ ని సహితం భయపెట్టేసింది. ప్రేమోత్సవం మూలంగా క్రైస్తవ మతం ప్రజల్లో స్థిర పడదేమో నన్న భయంతో, ఆ స్థానంలో మరో ఉత్సవాన్ని ఆరంభించాడు పోప్.
ఆ ఉత్సవం నాడు కూడా యువతీ యువకులు ఒకచోట చేరి చీటీలు తీయాలి. అయితే అందులో తమ జోడీ పేరు కాక క్రైస్తవ మతానికి చెందిన సెయింట్స్ పేర్లుండేవి. ఎవరికి ఏ సెయింట్ పేరు వచ్చిందో, వారు ఆ పవిత్ర ఆత్మజీవితాన్ని అనుసరించి ప్రవర్తించాలనేది పోప్ నిబంధన.
అప్పట్లో పోప్ కున్న అధికారానికి భయపడి చీటీలు తీసినా, వాటిని ఎవరు అనుసరించేవాళ్ళు కాదు. క్రమంగా కొన్నాళ్ళకు ప్రేమికుల్లో పోప్ పట్ల అసంతృప్తి ప్రబలి ఆయన నిబంధనను ధిక్కరించి ప్రేమోత్సవం జరుపుకోవడం ఆరంభించారు.
ప్రేమోత్సవాన్ని అణచివేయడం ఆచరణలో సాధ్యం కాదని అతిత్వరలోనే తెలుసుకున్న పోప్ ఆ పండుగను గ్రీకు దేవతల పేర్లు కాక ప్రేమకు ఊపిరి పోసి ప్రేమికుల ఆరాధ్యదైవంగా గుర్తించబడిన వాలెంటైన్ పేరునే ప్రేమోత్సవానికి నామకరణం చేశాడు.
ఇందులో సైతం పోప్ చాలా తెలివిగా ప్రవర్తించాడు. వాలెంటైన్ మొదట్లో క్రైస్తవ మతప్రచారకుడే. ఈ విషయాన్నే హైలెట్ చేస్తూ ప్రేమకు ప్రాణం పోసిన వాలెంటైన్ మా మత ప్రచారకుడే అని ప్రజలకు నమ్మించేందుకు నానా యాతనలు పడ్డాడు. దాంతో యువతీ యువకుల్లో క్రైస్తవ మతం పట్ల, పోప్ పట్ల విపరీతమైన గౌరవం పెరిగిపోయింది.
ఇది గమనించిన పోప్ వాలంటైన్ కి ప్రతిష్టాత్మకమైన సెయింట్ స్థాయినిచ్చి, ప్రేమోత్సవాన్ని సెయింట్ వాలెంటైన్ దినోత్సవంగా జరుపు కోవాలని ఉత్తర్వులిచ్చాడు. దాన్నిబట్టే కులమతాల కన్నా, ఆస్తీ అంతస్తుల కన్నా ప్రేమే గొప్పదని ఆ రోజుల్లోనే రుజువైపోయింది.