ఆమె కళ్ళు ఎప్పుడూ అతనికి స్వాగతం పలుకుతున్నట్టుగా వుంటాయి.
ఒక గంట క్రితమే తలంటు స్నానంచేసిందామె. కురులు విరబోసుకుని వదులుగా వున్న పల్చని ట్రాన్స్ పరెంట్ నైటీ ధరించివుంది.
విశాలమైన హాలు...ఎటువంటి అలికిడి లేదు. జయారెడ్డికి తోడెవ్వరూ లేరు. తనొక్కతే వుంటోంది. బహుశా ఆమెకి ఒంటరితనపు ప్రశాంతత ఇష్టమేమో అనుకున్నాడు శ్రీధర్.
హాల్లోంచి లోపలున్న బెడ్ రూమ్ కనిపిస్తోంది.
సోఫాలో కొంచెం దూరంగా జరిపివున్న రెండు ఎదురెదురు కుషన్ సీట్ల మధ్య వున్న టీపాయ్ మీద కొన్ని స్నాక్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ వున్నాయి.
విండోలోంచి విసురుగా వీచిన చల్లని గాలి జయారెడ్డి తనువును తాకి గిలిగింతలు పెట్టింది.
ఇద్దరి మధ్య ఒక్కక్షణం మౌనం చోటుచేసుకుంది.
శ్రీధర్ చొరవ చేసుకుని అడిగాడు... "ఏంటి జయా...ఏమిటి ఇదంతా..."
"రాక రాక వచ్చిన అతిథికి ఈమాత్రం మర్యాదలు చేసుకోలేకపోతే ఎలా...?" అంది కళ్ళు విచిత్రంగా తిప్పుతూ.
"అది సరే ...నే చెప్పిన పజిల్ విషయమేమిటి?" తొందరపడుతూ ఆమె మూడ్ మార్చడానికి ప్రయత్నిస్తూ అడిగాడు.
"ముందు నేను చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పందే నే చెప్పను..." అంది చిలిపిగా.
అతను చెప్పబోయే సమాధానంతోనైనా అతడ్ని రెచ్చగొట్టొచ్చని ఆమె ఆలోచన.
అపరిచితురాలిచ్చిన టైం దగ్గర పడుతుండడంతో ఆలస్యం చేయకుండా చెప్పడం మొదలెట్టాడు శ్రీధర్- "అనుభవం లేక పోయినా వుందని నిరుద్యోగి ఇంటర్వ్యూ కెళ్ళినప్పుడు చెప్పాలి. పెళ్ళికి ముందు సెక్స్ లో అనుభవం వున్నా ఫస్ట్ నైట్ భార్య అడిగినప్పుడు లేదనే చెప్పాలి" చెప్పడం ఆపి "ఇదేగా నీ ప్రశ్నకు సమాధానం" అన్నాడు శ్రీధర్.
ఆ సమాధానానికి ఆశ్చర్యపోలేదు జయారెడ్డి. ఒక్క క్షణం ఓరగా, అభినందనగా అతని వంక చూసింది. ఆమె చూపుల కర్థం ఇట్టే పసిగట్టిన శ్రీధర్ ఆమె ఆలోచనలను చెదరగొడుతూ... "మరి, ఫిబ్రవరి 14 ప్రాముఖ్యత ఏమిటో చెప్పు..." తొందరపెడుతున్నట్టుగా అడిగాడు.
వెంటనే సమాధానం చెప్పకుండా అతనివేపు అరమోడ్పు కన్నులతో అదోరకంగా చూస్తూ "జ్ఞానోదయం కలిగించే ఈ సందేహం నీకే వచ్చిందా? లేక నీమీద మరెవరైనా ప్రయోగించారా..." కింది పెదవిని పై పంటితో నొక్కిపట్టి కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా శ్రీధర్ కేసి చూసింది.
"ఏదో చిన్న ప్రశ్న అడిగా...దానికి సమాధానం చెప్పడానికి ఏదోలా అయిపోతున్నావేంటి? నీ కనురెప్ప లెందుకలా వాలిపోతున్నాయి? నరాల జబ్బేమో పాపం ...న్యూరో ఫిజీషియన్ కి చూపించుకో... పై పంటితో కింది పెదవిని ఎందుకలా కొరుకుతుంటావ్... సాల్ట్ డెపిషియన్సీ ఏమో...బాడీని ఓసారి టెస్ట్ చేయించుకో. అదోలా మాట్లాడతావ్. ఏం అర్థం కాదు నీ గొడవేంటో. ఇంతకీ నా చిన్న ప్రశ్నకి సమాధానం చెప్తావా...లేదా" చేతి వాచీకేసి చూసుకుంటూ అసహనంగా ప్రశ్నించాడు శ్రీధర్.
ఆమె చిన్నగా నవ్వి, కుదురుగా కూర్చుంది. "All work and no play makes jack a dull boy- అనే సామెత విన్నావా? వినుండవ్... నిద్రించేప్పుడు జీవితాన్ని కలలో అందంగా వూహించుకుని, లేచేసరికి అదే జీవితాన్ని బాధ్యతగా భావించేవాడు ఎప్పటికీ జీవితాన్ని అనుభవించలేడు..."
ఆమె మాటలు విని శ్రీధర్ చిరాకుపడిపోయాడు. ఆ భావనే అతని కళ్ళల్లో ప్రస్ఫుటంగా బయటపడింది.
"నీ మనసులో రేగే భావాలకు నీ కళ్ళు అద్దాల్లాంటివి. సారీ. నువ్వేసిన ప్రశ్న అంత చిన్నదేం కాదు. ఒకవేళ ఆ ప్రశ్న చిన్నదే అనుకున్నా, దాని సమాధానం మాత్రం విశ్వమంత పెద్దది. ప్రేమ ప్రపంచపు ప్రతిష్టాపన కోసం వాలెంటైన్ అనే మహావీరుడు జరిపిన పోరాట ఫలితమే ఫిబ్రవరి 14. దాన్నే వాలెంటైన్స్ డే అంటారు. A celebration of love ప్రేమ సందేశాలు పరస్పరం మార్చుకునే అతి పవిత్రమైన రోజది. ఆ ప్రేమ అనేది కేవలం ప్రేమికుల మధ్య వుండేదే కాదు- స్నేహితుల మధ్య, బంధువుల మధ్య వుండే అనుబంధానికి కూడా అదే ప్రేమ వర్తిస్తుంది.
ప్రేమ కోసం, ప్రేమను బ్రతికించడం కోసం ఆ ప్రేమతో ఈ ప్రపంచం నిస్తేజం కాకుండా చూడడానికి వాలెంటైన్ మహావీరుడు రోమన్ సామ్రాజ్యంతో నిరంతరం పోరాడి ప్రేమ నిత్యం, ప్రేమ సత్యం, ప్రేమకు చావులేదు అని రుజువు చేసి తన ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన మహా ప్రేమికుడతను.
ఈ రోజుల్లో ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటున్నవాళ్ళు- ప్రేమించుకుని, అది విఫలమై, విరహవేదనకు లోనయ్యేవాళ్ళు - ఎంతమంది వాలెంటైన్ చిత్రపటాన్ని తమ డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోగలుగు తున్నారు?" ఆమె కొద్ది క్షణాలు చెప్పడం ఆపింది.
ఆమె చెప్పేది ఆశ్చర్యంగా వింటున్న శ్రీధర్ లో క్రమంగా ఆసక్తి చోటుచేసుకుంది.
"చెప్పు చెప్పు. ఫిబ్రవరి 14 వెనుక ఇంతుంటుందని నేనూహించలేదు. కమాన్, స్పీకవుట్" అన్నాడు శ్రీధర్ సోఫాలోంచి ముందుకు వంగుతూ.
"జీవితంలో ఎప్పుడో ఒకసారైనా ప్రేమించని వాళ్ళు, ప్రేమించబడని వాళ్ళు ఈ భూమ్మీద వుంటారంటే నేన్నమ్మలేను. అలా ఒకవేళ ఎవరైనా వుంటే వాళ్ళంతా వ్యర్థమైన వాళ్ళు మరొకరుండరు. ప్రేమను ప్రేమించలేనివాళ్ళకు చంద్రుడి చల్లదనం, నిట్టూర్పుల వెచ్చదనం, ప్రకృతి పచ్చదనం, సూర్యోదయపు పలకరింపులు, సూర్యాస్తమయపు చిలకింపులు, చిరుజల్లుల జలదరింపులు, చెలిచెక్కిలి పలకరింపు, మరుమల్లెల మధురిమలు, సంపంగిల ఘుమఘుమలు రేయంతా రెప్పవాల్చని నక్షత్రాలు, మత్తుగా నిదరోయే మేలి మబ్బులు, నిండుగా పుడమిపై నవ్వుల పువ్వుల్ని వెదజల్లే వెన్నెల... ఇవేవీ అర్థంకావు. వాళ్ళకసలు అనుభూతులే వుండవు.
హిందూ పురాణాల ప్రకారం ప్రేమకు దేవుడు మన్మథుడు. యువతీ యువకుల్లోనే కాదు-మధ్య వయస్కుల్లో సైతం ప్రేమకు ప్రేరేపించేందుకు మన్మథుడు చెరకు విల్లంబుతో బాణాలు ప్రయోగిస్తుంటాడు. వాటినే మన్మథ బాణాలంటారు.