Previous Page Next Page 
ఉషోదయం పేజి 20

    నాలాంటివాళ్ళు చస్తే ప్రజలలో చైతన్యం వచ్చి తిరగబడతారన్న ఆశ సార్. నన్ను చావనీయండి. నాకు వేరే దారిలేదు. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేదు... తిండికి కూడా వెతుక్కుంటూ దినదినగండం లాంటి బతుకు ఇంకెన్నాళ్లు బతకగలం సార్... నా చావుతోనన్నా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో చూద్దాం" అంటూనే పక్కనున్న అతని చేతిలోని అగ్గిపెట్టె లాక్కుని అందరూ వారించేలోగానే అగ్గిపెట్టె గీసి అంటించుకున్నాడు.
    మంటలు భగ్గున లేచాయి... జనం హాహాకారాలు చేస్తూ వెనక్కి తగ్గారు. కొందరు మట్టి తీసి పొయ్యడానికి ప్రయత్నించారు. పత్రికా ఆఫీసునించి కుండలలో పెట్టిన మంచినీళ్ళు తెచ్చి కొందరు పోసేలోగానే కిరసనాయిలు మంట పూర్తిగా చుట్టబెట్టి అతన్ని మసిబొగ్గుని చేసింది. హాహాకారాలు చేస్తున్న అతని కేకలు ఆగిపోయి కూలిపోయాడు.
    "ఓ గాడ్.. ఎంత ఘోరం... ఇంతమందిమి వుండి అతన్ని ఆపలేక పోయాం. పూల్ ఫెలో..." నారాయణమూర్తిగారు విషాదవదనంతో లోపలికి వెళ్ళారు.
    జరగాల్సింది జరిగాక పోలీసులు వచ్చారు.
    మర్నాడు ప్రముఖంగా దినపత్రికలు ఈ వార్త ప్రచురించాయి. మీడియా అప్పటి కప్పుడు తీసిన టేపులతో కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్తలతో పాటు ప్రజలకోసం నిజానిజాలు బయట పెడుతున్న పత్రిక యాజమాన్యానికి వస్తున్న బెదిరింపుల గురించిన వార్తలు ప్రచురించారు. ఆ రోజు ఆ బ్యాంకు తాలూకు డిపాజిటర్లు వేలమంది రోడ్డున పడి ధర్నాలు, రోడ్డుమీద బైఠాయింపులు, సెక్రటేరియెట్ ముందు కదలకుండా కూర్చున్నారు, ముఖ్యమంత్రిని కలవాల్సిందేనంటూ. పోలీసులు లాఠీచార్జీలు, అరెస్టులు... గందరగోళం సృష్టించగలిగారు... మరో నలుగురు పెట్రోలు డబ్బాలు పట్టుకుని "చావడానికి సిద్ధం మాకు న్యాయం జరగకపోతే" అంటూ అలజడి సృష్టించారు.
    ఆఖరికి బ్యాంక్ తరుపు డైరెక్టర్లతో, బ్యాంక్ వర్కర్ల యూనియన్ సెక్రటరీ ముఖ్యమైన ఆఫీసర్లతో ఆ మధ్యాహ్నం చర్చలు జరపడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. చర్చల తర్వాత డిపాజిటర్లకి న్యాయం చేకూర్చడానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, అప్పులు ఎగవేసిన వారినించి సొమ్ము రాబట్టే యత్నాలు చేస్తుందని, దానికోసం ఓ కమిటీ నియమిస్తుందని ప్రెస్ మీట్ పెట్టి తెలియచేశాడు.
    ఆ, ఇదంతా కంటితుడుపు వ్యవహారం శృతిమించగానే ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం... ఆ కమిటీ ఈ గొడవలు పరిష్కరిస్తాం అంటూ ఏళ్ళతరబడి చర్చలు జరుపుతూ వుంటుంది. సమస్య పాతబడుతుంది. జనం మరిచిపోతారు. ప్రతి విషయంలో జరిగేదింతే... జనం చప్పరించారు. తాత్కాలికంగా ఉద్యోగులు, డిపాజిటర్లు శాంతించారు.
    శాంతించనిది ఎవరన్నా వుంటే, వారు అప్పులెగ్గొట్టినవారు. వారి బండారం మొత్తం పేపర్లకెక్కి పరువుపోయిందని, ప్రభుత్వం దృష్టికీ విషయం వెళ్ళిందనీ, తమని విచారించడానికి ఓ కమిటీ వేసిందని... ఈ గొడవలంతటికీ కారణం అయిన 'ఉషోదయం' ని మాత్రం వాళ్ళు మరిచిపోదలచలేదు.
                                        * * *
    "డాడీ! మనం పిక్నిక్ కి వెళ్ళి ఎన్నిరోజులయింది... ఈరోజు వెళ్దాం డాడీ... ఎక్కడికైనా తీసుకెళ్ళు డాడీ... ఏం డాడీ, వెళదామా" పిల్లలిద్దరూ తండ్రిని కౌగలించుకుని బతిమిలాడసాగారు. రవీంద్ర ఇబ్బందిగా చూశాడు.
    "కుదరదు నాన్నా... ఆఫీసులో చాలా పనివుంది."
    "పో డాడీ! ఎప్పుడూ పని అంటావు. ఇంట్లో వుండడమే మానేశావు... నీవు ఇదివరకులాగా లేవసలు..." బుంగమూతి పెట్టాడు గౌతమ్.
    "నీతో కటీఫ్ డాడీ, నీతో మాట్లాడనంతే... స్వీటీ బెదిరించింది.
    రవీంద్ర ఇద్దరినీ దగ్గిరకు లాక్కున్నాడు. అతని మనసు బాధగా మూలిగింది. పాపం పిల్లలు... పసివాళ్ళు... వాళ్ళకి తమ మధ్య గొడవలు తెలియవు. అమ్మా నాన్న ఇదివరకటిలా లేరని, హ్యాపీగా లేరని మాత్రం అర్థం చేసుకున్నారు. సెలవు వస్తే ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళేవాడు పిల్లలని. మూడు నెలలయింది వాళ్ళనెక్కడికీ తీసుకెళ్ళలేదు. వాళ్ళు చేసిన పాపం ఏమిటి! వాళ్ళనెందుకు అశ్రద్ధ చేయడం... అనిపించింది.
    "ఓ.కె. డన్... అయితే పిక్నిక్ కాదు. సినిమాకి తీసుకెళతా. ఐమాక్స్ లో 'త్రి'డి పిల్లల సినిమావుంది. దానికి వెళదాం... ఒకే. గెట్ రెడీ" అన్నాడు. పిల్లల్నీ ఉత్సాహపరుస్తూ.
    "మమ్మీ..." అరుస్తూ పరిగెత్తింది స్వీటీ తల్లిదగ్గిరకి.
    "మమ్మీ! డాడీ సినిమాకి తీసుకెళతానన్నారు. తొందరగా రెడీ అవమన్నారు. తయారవు మమ్మీ..." సునీత ఇబ్బందిగా చూసింది. లేని నవ్వు తెచ్చుకుని "నేనెందుకు, పిల్లల పిక్చరుగదా మీరు, డాడీ వెళ్ళండి. ఇంకా నా వంట అదీ కాలేదు..." అంది.
    "మమ్మీ... పిక్చరు అయ్యాక హోటలు కెళదాం మమ్మీ... చాలారోజులైంది. ప్లీజ్ మమ్మీ..." అన్నాడు బతిమలాడుతూ. "డాడీ! మమ్మీతో చెప్పండి. మనం డిన్నరు బయట చేద్దామని" గౌతమ్ తండ్రివంక చూస్తూ.
    రవీంద్ర ఇబ్బందిగా సునీతవంక చూశాడు. ఏమనాలో తోచలేదు. సునీత రవీంద్ర ఏంచెబుతాడో చూద్దాం అన్నట్టు ఆగింది.
    "మమ్మీ! ప్లీజ్ రా మమ్మీ, టైమైపోతోంది. టిక్కెట్లు దొరకవు" అన్నాడు గౌతమ్ ఆదుర్దాగా.
    "మనం డిన్నర్ బయట ఎక్కడైనా చేద్దాంలే" అన్నాడు రవీంద్ర.
    "పిల్లల సినిమా... మీరు వెళ్ళండి గౌతమ్..." అంది సునీత ఇబ్బందిగా.
    "ఇదివరకు మనం అందరం ఎన్నిసార్లు పిల్లల సినిమాకి వెళ్ళలేదు మమ్మీ?" నిలేశాడు కొడుకు.
    తప్పదన్నట్టు లేచింది సునీత. పిల్లలకైతే ఎంతో సంతోషంగా వుంది తల్లిదండ్రులతో చాలారోజుల తర్వాత సినిమాకి వెళుతున్నందుకు. రవీంద్ర కారు డ్రైవ్ చేస్తుంటే మామూలుగా అతనిపక్కన కూర్చున్న సునీతకి ఆ రోజు ఆ పరిస్థితి ఎంతో ఇబ్బందిగా వుంది. కారు డ్రైవ్ చేస్తుంటే సెల్ మోగింది. నెంబరు చూసి మాట్లాడకుండా ఆపేశాడు రవీంద్ర. మరోసారి మోగింది. మళ్ళీ ఆపేశాడు.
   అతని మొహంలో కాస్త కోపం, విసుగు, అలజడి అన్నీ కనిపించాయి. ఇంకెవరు ఆ రంజనే ఈ ఫోన్లు చేసేది. ఈయనగారి ముఖకవళికలు మారిపోయాయి హఠాత్తుగా అనుకుంది సునీత. ఫోను చేసిందెవరో సునీతకి తెలుసని రవీంద్రకి తెలుసు. ఇద్దరికిద్దరికి ఈ పరిస్థితి ఇబ్బందిగా వుంది. ఇదేమి తెలియని పిల్లలు వెనకసీటులో దేనికో వాదులాడుకుంటున్నారు. థియేటర్ దగ్గిర టిక్కెట్టు తీసుకుంటుండగా సెల్ మళ్ళీ మోగింది.

 Previous Page Next Page