చిరంజీవి విరగబడి నవ్వాడు.
"నీకు మరీ మందెక్కువయిపోయింది. అవి రెండు సోఫాలయితే ఆరు కుర్చీలంటావేమిటి?" మాట్లాడుతుండగానే మగత కమ్ముకొచ్చేస్తోందతనికి.
పెద్దగా నవ్వులు. మరింత భయంకర శబ్దంతో వెస్టర్న్ మ్యూజిక్ ప్రారంభమయ్యింది.
"కమాన్ ఇటీజ్ డాన్స్ 'టైమ్' అరిచారెవరో.
చిరంజీవి తిరిగి డాన్స్ చేయడానికి ప్రయత్నించాడు.
ఆ తరువాతేం జరిగిందో అతనికి తెలీదు.
తిరిగి మెలకువ వచ్చేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడినుంచో ఓ గోడ గడియారం పెండ్యులమ్ కొట్టుకుంటున్న చప్పుడు వినిపిస్తోంది.
కళ్ళు మరికొంత తెరిచి చూడ్డానికి ప్రయత్నించాడు గానీ అవి మూసుకుపోడానికి ప్రయత్నిస్తున్నాయి. లైట్ డిమ్ గా ఉంది. ఏ.సి. చల్లదనం గదంతా పరుచుకుని వుంది. తనెవరసలు? ఎక్కడున్నాడు? తనెవరు గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాడు కానీ ఏమీ గుర్తుకురావటం లేదు. మగతగా వుంది. మళ్ళీ గాఢనిద్రలోకి జారిపోవాలని ఉంది.
ఊహు! ఇక లాభం లేదు. ఒక్కొక్క ప్రశ్నా వేసుకుంటూ వెళ్తే మొత్తం వివరాలన్నీ దొరుకుతాయి.
"తన పేరేమిటి?" సమాధానం చటుక్కున దొరికింది.
తన పేరు చిరంజీవి అవును! తను చిరంజీవి అనబడే కుర్రాడు.
తన తండ్రి పేరేమిటి?
ఒక్క క్షణంలో గుర్తుకొచ్చేసింది.
ఈశ్వరరావు.
వెరీగుడ్! చాల ఇంప్రూవ్ మెంట్ వుంది.
తన వృత్తేమిటి?
ఏమీలేదు. అహహ వుంది. తండ్రి వ్యాపారాలన్నీ తనవే.
"తనకెవరెవరున్నారు?"
జానకి, రాములు, సీతాపతి, గబ్బర్ సింగ్. ఛట్ అంతా వట్టిదే. ఆ పేర్లు తనకు తెల్సినవి కావు.
అతను నెత్తిమీద కొట్టుకున్నాడు.
అప్పుడు బ్రెయిన్ కొంచెం పనిచేసింది.
తనకెవరూ లేరు తండ్రి తప్ప.
తల్లి లేదా?
లేదు. అహహ! ఉంది ఉంది. తండ్రికి రెండో భార్య తన పిన్ని.
తనెక్కడ పడుకున్నాడు? బహుశా తన గదే అయ్యుంటుంది. కాదా?
కళ్ళు కొంచెం తెరిచి చూశాడు. ఏమీ అర్థం కావటం లేదు.
సీలింగ్ కి ఓ అందమైన షాండ్లర్ వేలాడుతోంది. ఊహు! ఇది తన గది కాదు. సన్నగా ఎయిర్ కండీషనర్ శబ్దం కూడా వినబడుతోందిప్పుడు. ఇది హోటల్ రూమ్ అయ్యుండాలి.
వళ్ళంతా వెచ్చగా వుంది. రూమ్ హీటర్ పక్కనే ఉన్నట్లు. మళ్ళీ కళ్ళు మూతలుపడిపోయినాయి.
ఉచ్చ్వాస నిశ్వాసలు స్పష్టంగా వినబడుతున్నాయి కొంచెం భారంగా. గుండెల మీద ఏదో బరువుగా ఉన్నట్లనిపిస్తోంది.
అవును. తన చెయ్యి ఇలా తన మెడ మీదే వాలిపోయినట్లు పడిందేమిటి?
రెండు చేతులూ కదిపాడు. అయినా ఆ చేయి అలానే వుంది.
చిరంజీవికి ఆశ్చర్యం కలిగింది. అదేమిటి మనిషికి వుండేది రెండు చేతులే కదా!
రెండు కదిపినా మెడ మీద చెయ్యి అలానే ఉందేమిటి?
కళ్ళు బలవంతంగా తెరిచాడతను.
మెడ వేపుకి కళ్ళు వంచి చూశాడు.
ఆ చెయ్యి నాజుగ్గా, ఎర్రగా, ఓ గాజుతో వుంది.
చిరంజీవికేమీ పాలుపోవటం లేదు. తను చేతికి గాజులేసుకుంటాడా? మగాళ్ళసలు గాజులు వేసుకుంటారా?
అయినా తనకు మూడు చేతులుండటమేమిటి?
తనూరికే పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు గాని మనుషులకు మూడు చేతులుంటాయేమో? ఉంటాయా? పక్కనే ఉన్న ఫోన్ అందుకున్నాడతను.
"గుడీవినింగ్ సర్. రిసెప్షన్!"
"గుడీవినింగా?"
"అవున్సార్."
"గుడీవినింగ్"
"యస్సార్"
"ఓ.కే. నాకో చిన్న ఇన్ ఫర్మేషన్ ఇవ్వగలరా?"
"యస్సర్"
"మామూలుగా మనకు ఎన్ని చేతులుంటాయి? ఐమీన్ మనకంటే మామూలు మనుషులకు."
"చేతులా సార్!"
"అవును"
"రెండు సార్!"
"మూడు కాదా?"
"కొంతమంది అంగవైకల్యంతో పుట్టినవారికి మూడు కూడా ఉండవచ్చు సార్. కానీ జనరల్ గా రెండే వుంటాయి సార్"
"నాకు ఈ హోటల్లోకొచ్చేటప్పుడు ఎన్ని చేతులున్నాయో మీరెవరైనా లెక్కబెట్టారా?"
"సాధారణంగా చేహ్తులు మేము లెక్కపెట్టం సార్. అది సెక్యూరిటీ వాళ్ళు కౌంట్ చేస్తారు."
"ఓ! సెక్యూరిటీ ఇన్ ఛార్జిని పిలిపిస్తారా?"
కొద్దిక్షణాల్లో సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ ఫోన్లో కొచ్చాడు.
"గుడ్ మార్నింగ్ సర్."
"గుడ్ మార్నింగ్! నేను హోటల్లో కొచ్చినప్పుడు ఎన్ని చేతుల్తో వచ్చానో ఎవరైనా నోట్ చేశారా?"
"యస్సార్."
"ఎన్ని?"
"రెండు సార్."
"ఆర్ యూ షూర్?"
"యస్సార్."
"ఎలా గుర్తుంది నీకు?"