Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 21


    "వెరీ సింపుల్ సర్. మూడు చేతులున్నవాళ్ళెవరొచ్చినా మేం ఆశ్చర్యంగా చూస్తాం గద్సార్! అలాంటిదేమీ జరగలేద్సార్"
    "ఓ.కే. థాంక్యూ"
    మళ్ళీ మూత పడిపోతున్న కళ్ళను ఓ చేత్తో తెరచి పట్టుకున్నాడతను. మందెక్కువయిపోయినట్లుంది. మరీ ఇంత ఎక్కువ ఎందుకు కొట్టినట్లు?
    తన ఫ్రెండ్స్ బలవంతంగా తాగించేసి ఉంటారు.
    ఆ మూడో చేతివంక మరోసారి చూశాడతను.
    ఈ పజిల్ ఎంతకూ వీడటం లేదేమిటి?
    నెమ్మదిగా ఆ చేతిని పట్టుకుని పైకి లేపాడతను. తన చేతిని పట్టుకున్న ఫీలింగే లేదు. అందమైన వేళ్ళు, గోళ్ళకు చక్కని రంగులు, చాలా మృదువుగా మెత్తగా, చేయివంకే కిందవరకూ చూశాడతను.
    భుజాల దగ్గరవరకూ వచ్చేసరికి ఓ దుప్పటి చూపుకి అడ్డం వచ్చేసింది. అంటే ఆ చేయి ఆ దుప్పటిలోనుంచి వచ్చిందన్నమాట.
    ఆ నిద్ర మత్తు కొంచెం కొంచెంగా వదిలిపోతోంది.
    ఇప్పుడు కళ్ళను తెరచి పెట్టుకోవలసిన అవసరం లేకుండానే చూస్తున్నాయి.
    లేచి కూర్చోడానికి ప్రయత్నాలు ప్రారంభించాడతను. కానీ తన నడుము మీద లేవకుండా ఏదో బరువు పెట్టినట్లుంది.
    కొంచెం తల పైకెత్తి చూశాడతను. ఓ కాలు తన నడుము మీద నుంచి ప్రారంభమై తన కాళ్ళతో కలిసిపోయి ఉంది. తన రెండు కాళ్ళు పైకి లేపి చూసుకున్నాడతను.
    అతని నిద్రమత్తు మరికొంత పోయింది. కాళ్ళు కూడా మూడున్నాయి.
    ఏమిటి మిస్టరీ? ఇంకా తాగుడు నిషాలో అలా అనిపిస్తోందా?
    నిజంగా తన కాలు కాదా అది?
    ఆ కాలుమీద చేయి వేసి నిమిరాడతను.
    చాలా మృదువుగా, మెత్తగా అది కూడా దుప్పటిలోనుంచే వచ్చింది. ఆ కాలు పట్టుకుని నెమ్మదిగా పక్కకు తోశాడతను.
    కాని శరవేగంతో వచ్చి మళ్ళీ తన నడుంమీద పడిందది. చిరంజీవికి భయం వేసింది. అది తన కాలు లాగా లేదు. అయినా అలా తన సొంత కాలులా స్ప్రింగ్ యాక్షన్ తో వచ్చి పడిందేమిటి?
    మళ్ళీ నెమ్మదిగా తొలగించబోయాడతను.
    ఇప్పుడు ఆ మూడో చేయి వచ్చి తన చేతిమీద మృదువుగా కొట్టింది.
    "ఛీ! ఏమిటా పని?" చాలా సన్నగా, గుసగుసలాడుతున్న గొంతు.
    అదిరిపడ్డాడతను. ఎవరిదా గొంతు? ఆ దుప్పటిలో నుంచే వస్తుంది.
    హఠాత్తుగా ఆ మూడో చేయి తన మెడను చుట్టేసింది.
    చిరంజీవికి భయం పెరిగిపోయింది. ఇదేదో హారర్ పిక్చర్ లాగుంది. ఆ చేయి తన తలను బలంగా అటువేపు లాగేస్తోంది.
    తను ప్రతిఘటించాలనుకుని కూడా ఏమీ చేయలేకపోతున్నాడు.
    తన తల దుప్పటిలోకి వెళ్ళిపోతోంది.
    కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయతనికి.
    దుప్పటిలో, ఆ చీకట్లో మెరుస్తోన్న మరో రెండు కళ్ళు. చూస్తుండగానే తన తల ఆ కళ్ళను సమీపించేసింది. హఠాత్తుగా తన పెదాలకు మరో జత పెదాలు తగిలాయి.
    మరుక్షణంలో మత్తుగా మెత్తగా తన శరీరమంతా హత్తుకుపోసాగింది శరీరం. అప్పుడర్థమైంది. తన పక్కలో ఓ అమ్మాయ్ ఉంది. తనను గాఢంగా ముద్దు పెట్టుకున్నాక వదిలిందామె.
    "ఇంకా నిద్ర చాల్లేదా?" ఈ సారి గొంతు స్థాయి కొంచెం హెచ్చింది. దాని వెనుకే అందమైన నవ్వు.
    చిరంజీవికి మతి పోయినట్లయింది. తను ఓ అమ్మాయితో నగ్నంగా ఇలా...
    ఆమె కౌగిలి నుంచి చటుక్కున బయటపడి లేచి కూర్చున్నాడతను.
    ఆమె ఆశ్చర్యపోయింది.
    "ఏమిటి? ఏమయింది?" అడిగింది చిరుకోపంతో.
    చిరంజీవి అంతా గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు గానీ, ఏమీ గుర్తురావటం లేదు.
    "నువ్వెవరు?" అడిగాడతను కూడదీసుకుని.
    ఆమె చిరునవ్వు నవ్వింది.
    "సిల్లీ! ఏమిటా ప్రశ్న?" అంటూ అతని చేయి పట్టుకుని మీదకు లాగింది.
    అమాంతం ఆమెమీద పడిపోయాడతను.
    ఆమె స్పర్శా, ఆమె కౌగిలి మత్తూ అతనికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆమె కౌగిలి వదలాలనిపించటం లేదు.
    కానీ అసలీ అమ్మాయి ఎవరు?
    బలవంతంగా ఆమె కౌగిలి వదిలించుకుని లేచి కూర్చున్నాడు మళ్ళీ.
    "చెప్పు. ఎవర్నువ్వు?"
    ఆమెకు నవ్వాగలేదు. "ఎన్నిసార్లడుగుతావీ ప్రశ్న?"
    "అంటే ఇంతకుముందు కూడా అడిగానా?"
    "అది కూడా గుర్తుకు రాలేదా?"
    "లేదు. నాకేమీ గుర్తురావటం లేదు"
    "ఎందుకొస్తుంది? అంతగా తాగేస్తేనూ."
    "పోనీ ఇంకోసారి చెప్పు ఎవర్నువ్వు?"
    "శారద"
    "శారదా?"
    "అవును ఏం? అనుమానంగా ఉందా?"
    "కాదు! ఇలాంటి పేరు ఇంతకు ముందెప్పుడూ నాకు తగ్గల్లేదే"
    "ఇప్పుడు తగిలిందిగా"
    "ఆల్ రైట్! ఎవర్నువ్వు?"
    "ఇప్పుడే చెప్పాను. శారదనని"

 Previous Page Next Page