Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 19


    "ఛస్తే ఇవ్వను"
    "ఇవ్వకపోతే పో! ఆ చెత్త కథ తీయాల్సిన అవసరం నాకు లేదు."
    సింహాద్రి షాక్ తిన్నాడు.
    చటుక్కున చిరంజీవి చొక్కా పట్టుకున్నాడు.
    "ఏమిట్రా? నా కథ చెత్త కథా?"
    "పరమ నికృష్టమయిన కథ."
    "మరి ఇందాక అద్భుతమని పొగిడావ్?"
    "అందులో సంగీత వుంటేనే అది అద్భుతమైన కథ."
    "కాదు సంగీత వుంటేనే అది చెత్త కథ అవుతుంది"
    "సింహాద్రీ! ముందు సంగీత గురించి ఆ కామెంట్ విత్ డ్రా చేసుకో. తర్వాత నా చొక్కా వదులు."
    "నేను విత్ డ్రా చేసుకోను. సంగీత నికృష్టమైన నటి. ఆమె మొహం చూస్తేనే జనమంతా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురై పరుగెడతారు. ఆమెను పాకిస్తాన్ బోర్డర్ లోకి తీసుకెళితే చాలు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్స్ వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాంతులు చేసుకుంటూ నదుల్లో దూకేస్తుంది. ఆమె మొహం కనబడితే చాలు జనమంతా యుగాంతం అయిపోతోందన్న ఫీలింగ్ కలిగి గుళ్ళల్లోకెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ప్రాణాలు విడిచేస్తారు."
    సింహాద్రి చెంప చెళ్ళుమంది.
    "స్నేహ ద్రోహి! స్నేహమనే పవిత్రబంధం కారుణ్య క్షీరమపో మహోన్నతీ మష్క శతభి దీనదక్షత భావానికి నువ్వు పనికిరావు గెటౌట్."
    సింహాద్రి అతని చెంప చెళ్ళుమనిపించాడు వెంటనే.
    "నీ తెలుగు ఇంప్రూవ్ చేసుకోవటం కోసమే ఈ చెంపదెబ్బ కొట్టాను." అనేసి కారు దిగి వేగంగా నడిచాడతను.
    చిరంజీవి కోపంగా "హు" అని అరిచి కారు స్టార్ట్ చేశాడు.
    మర్నాడు ఉదయం చిరంజీవి బర్త్ డే పార్టీ మొదలయిపోయింది. ఈశ్వరరావు తాలూకు ఆఫీస్ సిబ్బంది, ఇతర జనం ఇల్లంతా నిండిపోయారు. ప్రెజెంటేషన్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి.
    చిరంజీవి మనసు మాత్రం అక్కడ లేదు.
    సాయంత్రం జరగబోయే పార్టీమీదే వుంది. దానికి తన ఫ్రెండ్సంతా వస్తారు. అదవగానే ఆ ఫ్రెండ్స్ అందరితోపాటు గుడికెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు సంగీతతో పాటు ఇంటికెళ్ళి ఇద్దరూ తెలుగు సినిమా లాగా తండ్రి కాళ్ళమీద పడతారు.
    తండ్రి కాసేపు వివిధ భాషల్లో విన్యాసాలు చేస్తాడు. ఎన్ని భాషలు మాట్లాడినా తను మాత్రం చెక్కు చెదరడు.
    "జీవిత విచిత్ర వినూత్న విస్తృత ఉద్యమై "ఊపిరి డాడీ" అంటాడు.
    తన భాష చూసి తండ్రి ఇంప్రెస్ అయ్యి ఒప్పుకుంటాడు.
    "లోపలకు పదమ్మా" అంటాడు.
    దాంతో అంతా ఓ.కే. అయిపోతుంది. పెళ్లి లీగలైజ్ అయిపోతుంది అఫీషియల్ గా.
    తను జాలీ లైఫ్ క్లబ్ కి రిజైన్ చేస్తాడు.
    మధ్యాహ్నం పెద్ద ఎత్తున డిన్నర్ జరిగింది.
    డిన్నర్ కి "జాలీ లైఫ్" క్లబ్ మెంబర్స్ చాలామంది వచ్చారు. అందులో చాలామంది క్లబ్ రూల్స్ కి అనుగుణంగా ఒక్కొక్క లేడి పార్టనర్స్ ని తెచ్చుకున్నారు. సాయంత్రం పార్టీ చాలా కలర్ ఫుల్ గా జరిగింది. స్పెషల్ ప్రోగ్రామ్స్ కొన్ని ప్లాన్ చేశారు అతని మిత్రబృందం.
    ముందు ఆర్కెస్ట్రా ప్రారంభమయ్యింది. ఆ ఆర్కెస్ట్రా తరువాత మిమిక్రీ, మిమిక్రీ తరువాత డాన్స్ ప్రోగ్రాం. ఇంకో గంటలో పెళ్లి.
    సంగీత ఆమె ఫ్రెండ్స్ తో గుడి దగ్గర ఎదురుచూస్తుండి ఉంటుంది. చిరంజీవికి మందు కొంచెం ఎక్కువయినట్లుంది "కమాన్ యార్! నీ బర్త్ డేకి ఎంజాయ్ చేయకపోతే ఎట్లా?"
    గ్లాసు మళ్ళీ నింపేశారు.
    "వద్దు బ్రదర్! ఇప్పటికే నువ్వు ఇద్దరిద్దరుగా కనబడుతున్నావ్" అన్నాడు వాళ్ళతో.
    "ఏడ్చావులే! మేమిక్కడ నిలబడింది ఇద్దరమే" అన్నారు వాళ్ళు.
    "ఆ సంగతి తెలుసు. కాని నలుగురిగా కనబడుతున్నారు."
    "మిగతా వాళ్ళిద్దరూ మా బ్రదర్స్ లే! అంటే కవల పిల్లలన్నమాట. అందుకని నలుగురం ఒకటిగానే కనబడుతున్నాం"
    చిరంజీవికి అంతా అయోమయంగా వుంది.
    "మీరు నలుగురా?"
    "అవును!"
    "అబద్ధం! నేనమ్మను."
    "పోనీ ముగ్గురం అనుకో! ఒకటి కన్సెషన్ ఇస్తాం."
    "నో! నాకు ఫాక్ట్ కావాలి. అసలెంతమంది వున్నారు?"
    "ఇద్దరం"
    "మరి ముగ్గురంటావేమిటి?"
    "కవల బ్రదర్స్ తో కలిపి నలుగురం."
    "ఒకడిని కన్సెషన్ ఇస్తున్నాం."
    "అసలెంతమంది నుంచున్నారక్కడ?"
    "ఎనిమిది మంది!"
    "ఎనిమిది మందా?"
    "అంటే నీకు ఇద్దరిద్దరు కనబడుతున్నారన్నావుగా?"
    "ఆ లెక్కలో ఎనిమిదిమంది కనబడుతున్నారా మీ ఇద్దరికీ?"
    "మేమిద్దరమా?"
    "సారీ! ముగ్గురనుకుంటాను. ఒక కన్ను కొంచెం వీక్ నాకు."
    "నేనొక్కడినే ఇక్కడుంది?"
    అందరూ పగలబడి నవ్వారు.
    "మరీ అంత వెధవలం అనుకోకు. మందెక్కువయినంత మాత్రాన ఎదురుగా ఎంతమంది ఉన్నదీ తెలీదనుకోకు."
    చిరంజీవి ఆలోచనలో పడ్డాడు.
    "మనలో మనకి గొడవలెందుకు? ఇటువేపు నుంచి ఒకడు ముందుకొస్తాం. మీలో నుంచి ఒకడు ముందుకి రండి. ఇద్దరూ కలిసి ఆ పక్క ఉన్న సోఫాల్లో కూర్చోవాలి."
    "ఆ పక్కన సోఫాలున్నాయా?"
    "అవును. అవేం కనబడటం లేదూ?"
    అతను అటువేపు చూశాడు ఒక్క సోఫా కూడా కనిపించలేదు.
    విరగబడి నవ్వాడు అతను.
    "అసలు అక్కడ ఉన్నది ఆరు కుర్చీలు. దాన్ని సోఫా అంటున్నావా?"

 Previous Page Next Page