Previous Page Next Page 
నేను పేజి 20


    ఆయన్లో చిన్న ఉలికిపాటు లాంటిది గమనించాను. అంతలోనే నిలద్రొక్కేసుకోటం తెలుస్తోంది.    


    మళ్ళీ నేనే అన్నాను. "ఇది సొసైటీ. పాటించవల్సిన ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. దానికి మన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు."  


    "నువ్వు చాలా తెలివైనదానివి."


    నవ్వి ఊరుకున్నాను.


    "నాకు చాదస్తాలు లేవు. నువ్వన్నట్లు ఫార్మాలిటీ కోసం ఎక్కడికైనా వెళతాను. ఎవరితోనైనా మిక్సవుతాను. కాని నా నియమాలు తప్పను. ఇప్పుడింటికి వెళ్ళాక పూజా తతంగమదీ చాలా ఉంటుంది."   


    "మీరు పెద్దలు. ఎప్పుడేం చెయ్యాలో అన్నీ తెలిసే ఉంటుంది." అన్నాను వినయంగా.


    "తినటం ఆపేశావేమమ్మాయ్. తిను"


    "ఫర్వాలేదు లెండి."


    "అలా కాదు. తింటూ మాట్లాడితేనే బావుంటుంది."


    కాసేపాయన తన దగ్గరకొచ్చే ప్రముఖుల గురించీ, వాళ్ళకు తాను చెప్పిన భవిష్యత్ వాని ఏయే ఉచ్ఛదశలకు తీసుకెళ్ళిందో ఏకరువు పెట్టాడు.  


    "చూడమ్మాయ్. నువ్వు నన్నడగకపోయినా ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. ముందు ముందు నువ్వో అద్భుతమైన వ్యక్తిగా రూపొందుతావు. కాకపోతే కొన్ని మలుపులుంటాయి."


    తలఎత్తి ఆయన ముఖంలోకి చూశాను.


    "క్షమించండి. నాకు జాతకాలూ, గ్రహ ప్రభావాలూ.... వేటిమీద నమ్మకం లేదు" అన్నాను.


    ఆ మాటలకాయనకు  కోపమొస్తుందేమో అనుకున్నాను. నవ్వాడు. ఆ నవ్వులో జీవితానుభవం తొణికిసలాడుతోంది.      


    జీవితంలో 'సక్సెస్' చూస్తున్నవాళ్ళ పెదవుల మీద ఎలాంటి పరిస్థితిలో కూడా ఆ నవ్వు చెరుపుకోరు.


    "పెద్ద పెద్ద వాళ్ళే ఈ జాతకాలమీద వ్యామోహాలు చంపుకోలేరు. నువ్వింత ధీమాగా ఎలా చెప్పగలిగావు?"   


    దాన్ని గురించి కొంతవరకూ వివరంగా చెప్పగలను. కాని ఆ సమయంలో వాదన పెంచుకోవడం వృధా ప్రసంగమనిపించింది.


    "ఏమో నాకు నమ్మకం లేదు" అన్నాను.


    మళ్ళీ నవ్వాడు "ఏ సందర్భంలో ఏం  మాట్లాడాలో నీకు బాగా తెలుసు."


    నేనేం మాట్లాడలేదు.


    "నీకో మంచి పాయింటు చెప్పనా?" అన్నాడు.     


    ప్రశ్నార్థకంగా చూశాను.


    "మొగాడికి అందం, పర్సనాలిటీ ఉన్నా పైకి రావటానికి యింకా ఎన్నో అర్హతలు కావాలి. స్త్రీకి మహత్తరమైన సౌందర్యముంటే చాలు. ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది".... సామాన్య స్థితిలో నుండి కూడా."


    "ఒక్క అందముంటే చాలదనుకుంటాను. పదునైన మనసు కూడా...."


    "చిత్రమేమంటే అంత అందమున్నవారికి పదునైన మనసు కూడా ఆటోమేటిక్ గా అమరి ఉంటుంది. స్త్రీల విషయంలో.


    ఇది ఓ తమాషా అయిన పరిశీలనే అనిపించింది.


    "కొంతమంది బయటకు కదలకుండానే, తన ఇంట్లో కూర్చునే సర్వ ప్రపంచాన్ని శాసించగలరు. అది కూడా స్త్రీల విషయంలోనే ఎక్కువగా సాధ్యమవుతుంది."


    "ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు?"


    "బహుశా మనుషుల్ని చూడగానే వాళ్ళ జీవిత చరిత్రలు గురించి వాగటం అలవాటయిపోతుందేమో.... నీ మొహం చూసి ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను."


    ఈ మాదిరి మనుషులు అవతలి వాళ్ళకు ఆసక్తి లేకపోయినా దూసుకొచ్చి ఆసక్తి కలిగేలా చేస్తారని తెలుసు.


    "ఇంకో చిత్రం చెప్పనా?"


    "మీరెన్ని చిత్రాలు చెబుతారేమిటి?"


    నవ్వాను. ఒక్క నిమిషమాగి.


    "కొంతమంది జీవితాలు నెమ్మదిగా కదుల్తున్నట్లుంటాయి. కాని వాళ్ళకు తెలీకుండానే వేగంగా పరిభ్రమిస్తూ ఉంటాయి" అని నా కళ్ళలోకి చూశాడు.    


    కళ్లు దించుకోక నేనూ సూటిగానే చూశాను.


    "నీకెలాంటి జీవితం కావాలనుంది?"


    "గుర్తింపు ఉన్న జీవితం. మామూలుగా బతకటం నాకు చేతకాదు. అలా అని అడ్డుత్రోవలు, వక్రగతులూ ఇష్టంలేదు.     


    "గుర్తింపు కోసం చేసే అన్వేషణలో ఓ దశ దాటిపోయాక వక్రగతిని నిర్వచించలేమేమో."


    నాకేం జవాబు చెప్పాలో తెలీక మౌనంగా ఊరుకున్నాను.


    చుట్టూ ఉన్న వాతావరణంలో కోలాహలం మరీ ఎక్కువయింది.


    ఆడవాళ్ళు విలాసంగా సిగరెట్లు ఊదుతున్నారు. మొగవారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు భుజాలమీద చేతులు వేసి మీద వ్రాలి పోతున్నారు. కొంతమంది ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏవేవో వికారమైన చేష్టలు చేస్తున్నారు. నాగరికత ముసుగులో ఎన్ని అపస్వరాలు, అందమైన ఆత్మవంచనలు చేసుకుంటాయి!


    పరపురుషుడి భార్యతో సంబంధం పెట్టుకోవడం మగాడికి ఎంత ఆనందం. యుగయుగాలనుంచి సంస్కృతికి, నాగరికతకూ, సాంఘిక ధర్మాలను చివరకు ఆధ్యాత్మికతకు కూడా లొంగకుండా బలీయమైన బలహీనతగా విస్తరించిన సహజ రుగ్మత ఇది.


    వేదవ్యాస్ నాతో కబుర్లు చెప్పి "మళ్ళీ కన్పిస్తానమ్మాయి" అంటూ మరో ప్రక్కకి వెళ్ళారు. బహుశా ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు మరో వ్యక్తి నా దగ్గరకొచ్చాడు. గుర్తుపట్టాను. సినిమా నిర్మాతగా నాకు పరిచయం చెయ్యబడిన ప్రకాష్ బాబు. యాభయ్యేళ్ళు దాటి ఉంటాయి. జుట్టుకు రంగేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.


    చొరవగా కుర్చీని నా ప్రక్కకు లాక్కుని ఆనుకుంటూ కూర్చున్నాడు.

 Previous Page Next Page