Previous Page Next Page 
నేను పేజి 21


    "బహుశా నా పేరు విని ఉంటావనుకుంటాను" అన్నాడు.


    "ఇందాక శమంతకమణిగారు పరిచయం చేశారుగా"


    "పెద్ద సినీ నిర్మాతను. ఆవిడ పరిచయం చేసే దాకా నా పేరు తెలీదన్నమాట."


    "మామూలుగా డైరెక్టర్ల పేర్లు తెలుస్తుంటాయి. నిర్మాతల పేర్లు ఫీల్డులో వారికి తప్ప బయటి వారికెక్కువగా తెలీదు. ఓ నలుగురయిదుగురు మాత్రం పాపులర్ గా ఉంటారు."   


    "కొంతవరకూ నువ్వు చెప్పింది నిజమే. చాలా సందర్భాలలో మేము అవమానాలను దిగమ్రింగుకుంటూ ఉంటాము" అన్నాడాయన ఒప్పుకుంటున్నట్లు.


    "మీరేమేం సినిమాలు తీశారు?"


    "ఇది అవమానం కలిగించే మరో ప్రశ్న. చాలా హిట్స్ ఇచ్చాను.అయితే సినిమా ఛాన్స్ ల కోసం ఎగబడేవారు.... యువతీ యువకులు నన్ను కలుసుకోటం కోసం చాలా ఆరాటపడుతుంటారు. నాకోసం తిరుగుతుంటారు. కొత్తవారు నా పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉంటారు."   


    "అలా జరగటం సహజమే."


    "నీ అందం, శరీర సౌష్టవం నన్నాకర్షించాయి. నువ్వు సినిమాల్లో బాగా రాణిస్తావని నమ్మకముంది?"    


    ఓ ప్రముఖ నిర్మాత అలా అంటే ఎవరికి సంతోషంగా ఉండదు? నవ్వి ఊరుకున్నాను.


    "నా విజిటింగ్ కార్డిస్తాను. ఒకసారి నన్నొచ్చి ఆఫీసులో కలుసుకో."


    విజిటింగ్ కార్డిచ్చాడు.


    వాతావరణంలో కోలాహలం మరింత ఎక్కువయింది. ఒకరు విడవగానే ఒకరు దగ్గరకొచ్చి పలకరించి వెళుతున్నారు. మధ్యలో నేను వాష్ బేసిన్ దగ్గర కెళ్ళి చెయ్యి కడుక్కొచ్చాను.       


    కొంతసేపటికి నాకు విసుగనిపించింది. అంతమంది మనుషుల మధ్య ఎక్కువసేపు గడపటం నా ఒంటరి తన మనస్తత్వానికి ఇమడటం లేదు. సుకుమార్ కోసం చూశాను. అతను మళ్ళీ బిజీగా అయిపోవడం వల్ల నన్ను పట్టించుకునే స్థితిలో లేడు. శమంతకమణి ఎక్కడుంది? ఒక్క  నిమిషం కళ్లతో వెదిగాక ఆమె కూడా చేతిలో గ్లాసుతో నలుగురి మగాళ్ళ మధ్య కూర్చుని గట్టిగా నవ్వుతూ మాట్లాడుతూ, తూలిపోతూ కనిపించింది. అసలు నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్లు? కారణం లేకుండా ఏ పనీ జరగదు. ప్రక్కనే బాల్కనీలాంటి ఓ ప్రదేశం కనిపించింది. అక్కడికెళ్ళి బయటకు చూస్తూ నిలబడ్డాను. చాలా రాత్రి గడిచినట్లుంది. ఈ ఇల్లు తప్ప మిగతా ప్రపంచమంతా నిద్రపోతోంది. ఇంటిముందు బారులుగా నిలబడి ఉన్న కార్లు. వాటిలో కొన్నిట్లో కూర్చుని ఉన్న డ్రైవర్లు, స్టీరింగ్ మీదకు వ్రాలో, ప్రక్కకి వ్రాలో కునికిపాట్లు పడుతున్నారు.


    నా వెనక్కి ఎవరో వచ్చి నిలబడినట్లు అలికిడయింది. పెద్ద పారిశ్రామికవేత్తగా పరిచయం చెయ్యబడ్డ వినోద్ కుమార్.


    "నువ్వు...." అన్నాడు. బాగా  డోసు ఎక్కువయినట్లుంది. బాగా తూలుతున్నాడు.


    మరీ ఆనుకుని నిలబడితే కొంచెం ప్రక్కకి జరిగాను.


    ఈసారి ఇంకా దగ్గరకొచ్చి నిలబడి భుజంమీద చెయ్యేశాడు.   


    "భుజం మీద చెయ్యి తియ్యండి" అన్నాను కొంచెం కోపంగా. ఈ సభ్య సమాజం నాగరికత పేరుతో ఎటువైపు పరుగులు తీస్తుంది?"  


    "హ హ్హ హ్హ హ్హ" అంటూ నవ్వాడు.


    "భుజంమీద చెయ్యి వేస్తేనే ఉలిక్కిపడేదానివి. ఇలాంటి పార్టీలకేం పనికొస్తావు? ఇంకా కొత్త అనుకుంటా."


    "ఉలిక్కిపడలేదు. వద్దని చెబుతున్నాను"


    "ఎందుకనీ?"


    "ఎందుకనేమిటి? అఖ్కర్లేదు కనుక"


    "నీకు చాలా కావాలి. నీకు గమ్మత్తు చెప్పనా? సైలెంటుగా కూర్చున్నా ఈ రోజు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ నువ్వే అనుకో. అబ్బో! ఏమి అందం! ఏమి అందం! ఎవరి గొడవల్లో వాళ్ళున్నట్లు కనిపిస్తోన్నా అందరి కళ్ళూ నీ మీదే ఉన్నాయి. ఆడాళ్ళు అసూయతో చచ్చిపోతున్నారు."


    "బాగానే ఉంది గాని మీరు నా భుజం మీద చెయ్యి తియ్యటం లేదు."


    "తియ్యను అంతేకాక నా రెండో చేతిని కూడా వేస్తాను" అంటూ ఎదురుగా వచ్చి చెప్పినట్లే చేశాడు.


    వెనక్కి జరగబోయాను. అతని రెండు చేతులూ నన్ను గట్టిగా పట్టుకుని ఉన్నాయి.


    "ఇప్పుడో గమ్మత్తు చేస్తాను"


    "ఏమిటది?"


    "నిన్ను రెండు పెదాల మీదా గట్టిగా ముద్దెట్టుకుంటాను"


    "అలా జరగదుగా"


    "ఎందుకని"


    "నాకిష్టం లేదు కాబట్టి"


    "నువ్వు కూడా డ్రింక్ తీసుకుంటే ఈ మాట అని ఉండేదానివి కాదు."


    "కావచ్చు"


    "కాని నేను ఉండలేకపోతున్నానే. ఈ కోరిక అనేది ఎంత బలమైనదో తెలుసా?"


    తెలుసు. చేతులు తీసెయ్యండి. విసుగ్గా ఉంది."


    "ఒక్కసారి...." అంటూ ముందుకు వంగి నా పెదవుల మీద తన నోటిని చేర్చబోతున్నాడు. గభాల్న ముఖం ప్రక్కకి త్రిప్పుకుని చేతులు అతని ఛాతీమీద వేసి బలంగా నెట్టాను. ఇలా జరుగుతుందని ఊహించలేదేమో తూలి, బ్యాలెన్స్ తప్పి క్రింద పడిపోతున్నాడు. పాపం దెబ్బ తగులుతుందేమోనన్న జాలితో పడిపోకుండా పట్టుకున్నాను.   


    "థాంక్స్" అని మళ్ళీ సిగ్గు లేకుండా. ముఖం మీద ముఖం చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు.      


    ఈసారి ఒక చెంప దెబ్బ కొట్టాను.


    నవ్వాడు. "ఈ రోజుల్లో ఇష్టం లేకపోతే వద్దని మృదువుగా చెప్పటం, సారీ. కుదరదు అనటం, లేకపోతే అప్పటికి కొంతవరకూ సహించటం ఫ్యాషన్ గాని, ఇలా తిట్టటం, కొట్టటం...."           

 Previous Page Next Page