"అలా అని కాదు...." తర్వాత అంతకన్నా ఏం చెప్పాలో తెలీక నేనూ నవ్వేశాను.
"పోనీ ఏం తీసుకుంటావు చెప్పు. కొంచెం డ్రింక్ రుచి చూడు. జిన్ లెమన్ టీ కలిపిస్తాను. నువ్వు తప్పకుండా లైక్ చేస్తావు."
"వొద్దులెండి."
"పోనీ ఏం తీసుకుంటావు? క్యాజూ, చికెన్, జింజెర్, చికెన్, ప్రాన్స్ పకోడి.... ఫిష్."
"నేను శాకాహారిని."
"పోనీ ఎగ్."
"అది కూడా తినను"
"అయితే కూల్ డ్రింక్ తీసుకుంటూ ఉండు. వెజిటేరియన్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. సుకుమార్ తో చెబుతాను. అతన్నీకు కంపెనీ ఇస్తాడు."
అయిదు నిమిషాల తర్వాత రెండు గోల్డ్ స్పాట్ బాటిల్స్ తీసుకుని సుకుమార్ వచ్చాడు.
ఒకటి నాకిచ్చి రెండోది చేతిలో ఉంచుకుని నాకెదురుగా కూర్చున్నాడు.
"ఏం? మీరు డ్రింక్స్ తీసుకోరా?" అనడిగాను.
అతనేమీ మాట్లాడలేదు.
"బహుశా మేడమ్ ఉందని గౌరవమనుకుంటాను."
"కాదు. నాకు డ్రింక్స్ అలవాటు లేదు. ఒకవేళ నేను తీసుకుంటే మేడం అభ్యంతరం చెప్పదు. ఆవిడకలాంటి ఫార్మాలిటీస్ ఏమీలేవు. ఒకరకంగా ఆవిడ చాలా గొప్ప వ్యక్తి."
ఇద్దరం కొంచెం కొంచెం కూల్ డ్రింక్స్ త్రాగుతూ మాట్లాడుతున్నాం.
"మీ మేడం అంత గొప్పదా?"
"చాలా. ఆవిడ్లో చాలా విశిష్ట లక్షణాలున్నాయి. తలుచుకుంటే ఏ పనయినా చెయ్యగల శక్తి సామర్ధ్యాలున్నాయి. తన కనుసన్నలతో ఈ ప్రపంచాన్ని శాసించగలదు."
సప్లయర్ రకరకాల శాకాహార పదార్థాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. "తీసుకోండి" అన్నాడు.
"నిజానికి నాకు చాలా ఆకలిగా ఉంది. కూల్ డ్రింక్ బాటిల్ తో బాటూ, మొహమాటాన్ని కూడా ప్రక్కకి పెట్టి ఖాళీ ప్లేట్ చేతిలోకి తీసుకుని, ఐటెమ్స్ కొంచెం కొంచెం వడ్డించుకుని తినసాగాను.
మొదట్నుంచి నాది ఆకలికి ఆగలేని శరీరతత్వం. ఆకలివేసినప్పుడు వెంటనే ఏమన్నా తినకపోతే, వొంట్లోకి ఏదో ఆవిరి ప్రవహించినట్లుండటం, పరిసరాల్లో నిస్సత్తువ, ఇంకా తలనొప్పి.... హైడ్రోగ్లయిస్ మియా అంటారే ఆ లక్షణాలన్నీ నిర్దాక్షిణ్యంగా దాడిచేస్తాయి.
నేను తినటం అతనాసక్తికరంగా గమనిస్తున్నాడన్న సంగతి తెలుస్తోంది. నేను చాలా అందంగా, ముచ్చటగా తింటానని కూడా తెలుసు. అది కొంతమందికే వరించే కళ.
"ఇది ఓ డ్యూటీగా భావించి సిన్సియర్ గా చేస్తున్నాను కాని.... ఈ విపరీత ధోరణికల మనుషులూ, ఈ వాతావరణం నాకు నచ్చదు" అన్నాడు సుకుమార్.
"ఇందులో తప్పేముంది?" అన్నాను.
ఉలిక్కిపడినట్లు కనిపించాడు.
"అంటే.... ఇంత సున్నితంగా, సుకుమారంగా కనిపించే మీరు ఈ వాతావరణాన్ని ఇష్టపడుతున్నారా?"
"ఇక్కడ రెండు పాయింట్లు"
ప్రశ్నార్థకంగా చూశాడు.
"ఒకటి మీరనుకుంటూన్నట్లు నేను సున్నితమైన దాన్ని, సుకుమారమైన దాన్ని కాదు. బహుశా అంత మృదు స్వభావిని కూడా కాదు.
అతను ఇబ్బందిగా ఫీలవటం గమనించాను. అప్పుడతని ముఖంలో కనిపించిన హావభావాలు నాకు ముద్దనిపించాయి.
"మన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో అనేక వాతావరణాలుంటాయి. ఎందుకంటే అది చాలా విశాలమైనది. భిన్నత్వం గలది. ఇష్టం లేకపోతే అందులో లీనం కానక్కర్లేదు కాని విముఖంగా ఉండనవసరం లేదు."
అతని కళ్ళలో ఆశ్చర్యం ప్రతి ఫలిస్తోంది.
"మీరు చాలా లోతైన వారు."
"అవునా?" అన్నాను చిలిపిగా.
చుట్టూ ఉన్న మనుషుల్లో కోలాహలం ఎక్కువయింది. బ్యాచ్ లు బ్యాచ్ లుగా విడిపోయారు. కొందరు గట్టిగా నవ్వుతున్నారు. కొందరు గట్టిగా వాదించుకుంటున్నారు. కొందరు మాత్రం నిలకడగా ఉన్నారు. కొందరు డబ్బెట్టి పేకాడుతున్నారు. త్రాగే వాళ్ళలో, పేకాడే వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సుకుమార్ తో మాట్లాడుతూనే మధ్య మధ్య వాళ్ళని కుతూహలంగా గమనిస్తున్నాను.
శమంతకమణి ఎందుకో సుకుమార్ ని పిలిచింది. "ఇప్పుడే వస్తాను" అంటూ నాతో చెప్పి అటుకేసి వెళ్ళాడు.
ప్లేటులోని ఫ్రైడ్ రైస్ కొంచెం కొంచెం తింటూ ఒక్క నిమిషం పరధ్యాసగా ఉన్నాను.
ప్రక్కన ఎవరో నిలబడినట్లు తోచేసరికి తల త్రిప్పి చూశాను.
వేదవ్యాస్ గారు.
ఏం చెయ్యాలో తెలీక చేతిని కదలకుండా ఉంచేసి నిశ్శబ్దంగా మిగిలిపోయాను.
ఆయనకు నలభై అయిదేళ్ళు ఉంటాయి. పంచా, లాల్చీ వేసుకున్నాడు. మంచి ఎత్తూ, ఎత్తుకు తగిన శరీర దారుఢ్యం. పసిమి రంగు. నుదురున తిరుచూర్ణం లాంటి బొట్టేదో ఉంది.
"అమ్మాయ్! ఒక్కదానివే ఉండిపోయావే" అన్నారు.
"కూచోండి" అన్నాను మర్యాదగా.
నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూచున్నారు.
"శమంతకమణి నన్ను జ్యోతిష్కునిలా పరిచయం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ వాతావరణంలోకి నాలాంటి మనిషేమిరా అని ఆశ్చర్యపోతున్నావా?"
"నేనాశ్చర్యపోవటం లేదు."