Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 20


                                                      ఉన్మాది

అలకలన్నీ అట్టకట్టిన,
బొమికలన్నీ ప్రోవుపట్టిన,
కాగితంవలె పలచబారిన
వెర్రివాడా! కుర్రవాడా!

వీధికంతా వెక్కిరింతగ,
ఊరికంతా దిష్టిబొమ్మగ,
తూముప్రక్కన ధూళిలోనే
తూలుతున్నావా!

నీవు చూసే వెకిలిచూపూ,
నీవు తీసే కూనిరాగం,
మాకు తెలియని నీ ప్రపంచపు
మహారణ్యపు చిక్కుదారులు!

వెర్రివాడా! కుర్రవాడా!
నిన్ను చూసీ చూడనట్లె
తెలివిమీరిన పెద్దమనుషులు
తొలగిపోతారు!

వెర్రివాడా! కుర్రవాడా!
క్షమిస్తావా? సహిస్తావా?
బుద్ధిమంతులు నీకు చేసిన
దురన్యాయాన్ని!

అట్లు చూడకు, అట్లు పాడకు,
మమ్ము వేళాకోళ మాడకు!
వెర్రివాడా! కుర్రవాడా!
వేడుకుంటాము
                                                                            - 1935 (?)

                                                        * * *

 Previous Page Next Page