Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 21
స్విన్ బర్న్ కవికి
విషంక్రక్కే భుజంగాలో,
కదంత్రొక్కే తురంగాలో,
మదంపట్టిన మాతంగాలో కవీ! నీ పాటల్?
వలయ విచలద్విహంగాలో,
విలయ సాగరతరంగాలో,
యుద్ధగుంజన్మృదంగాలో కవీ! నీ పాటల్?
షెల్లీకవనపు హల్లీసకమూ,
ఫ్రెంచిగీతుల మంచిరీతులు,
మోహినీ గంధర్వగానం కవీ! నీ పాటల్?
ఎర్రకాంతుల ఇనోదయమూ,
రెక్క విప్పిన రివల్యూషన్,
కడలి వలపూ, వలపు కడలీ కవీ! నీ పాటల్?
కవీ! నీ గళ గళన్మంగళ
కళాకహళ హళాహళిలో
కలసిపోతిని!కరగిపోతిని!
కానరాకే కదలిపోతిని!
- 1936 (?)
* * *
Previous Page
Next Page