Previous Page Next Page 
ఉషోదయం పేజి 19

    తనని 'మీరు' నించి 'నీవు' లోకి పిలుపు మార్చడం ఏదో దగ్గరితనంలా అనిపించి చనువు పెరిగింది. "ష్యూర్ సార్, మీలాంటి పెద్ద లాయర్ కి సెక్రటరీగా వుండాలంటే ఆ మాత్రం హంగు వుండాల్సిందే" అంది నవ్వి.
    ప్రకాష్ ని పెద్దలాయరు అంటూ చెప్పకనే చెప్పడంతో అతను మనసులో ఆనందంగా, గర్వంగా ఫీలయ్యాడు.అతని హావభావాలు పసిగట్టి గురుడు దార్లోకి వస్తున్నాడు అని నవ్వుకుంటూ తన సీటుదగ్గిరకి వెళ్ళింది సుప్రియ.
    శారదతో ఎందుకో మనసువిప్పి మాట్లాడలేకపోతున్నాడు. వారిద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ చాలా పెరిగిందీ మధ్య. పని ఒత్తిడి మధ్య ఎప్పుడైనా ఓరోజు కాస్త విశ్రాంతి దొరికి ఇద్దరిమధ్యా సయోధ్య కరువై తనంతట తాను లొంగిపోవటానికి మేల్ ఇగో ఇబ్బంది వస్తోంది. ఏదో మాటా మాటా పెరిగి మొహాలు ముడుచుకుని వారం పదిరోజులు ఎడమొహం పెడమొహం అవడం, అది మర్చిపోయి కాస్తంత మనసు తేలికపడే వేళకి మళ్ళీ ఏదో గొడవ వస్తోంది. దాంతో శారద తన భార్య అన్నది కూడా మర్చిపోయినట్లయింది. అతని పరిస్థితి.
    ఈరోజు పనిమీద మనసు లగ్నం చెయ్యలేకపోయాడు. దృష్టి సుప్రియమీదకి లాగింది. అతని చూపులలో తేడా గుర్తించలేని చిన్నది కాదు, అమాయకురాలూ కాదు సుప్రియ... 'బాస్, నీ పొగరు అణచడం నా చేతిలో పని' అనుకుంది గర్వంగా.
                                            * * *
    "నీకు వార్నింగ్ ఇచ్చినా బుద్ధి రాలేదా! నీవు, నీ పేపరు బతికి బట్టకట్టాలని లేదా? ఇదంతా ఉత్తి బెదిరింపనుకోకు. నీవేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో అగ్రస్థానం సంపాదించుకోవాలనుకుంటున్నావు గాబోలు... ఈ రాతలు ఆపకపోతే అసలు పత్రికే మిగలదు. దాన్ని నడపడానికి నీవూ మిగలవు. ఇదే నీకు ఆఖరి వార్నింగ్..." రెండురోజులకి మళ్ళీ ఒక ఫోను వచ్చింది.
    "మిస్టర్... ఇదివరకే చెప్పాను ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛని ఎవరూ అరికట్టలేరని. నిజాలని నిర్భయంగా వెల్లడించడమే పత్రికల బాధ్యత. ఆ బాధ్యతని నేను మర్చిపోతే పత్రికని నడపనవసమే లేదు. మీ బెదిరింపులకి లొంగిపోయేంత పిరికివాడిని కాదు... మరోసారి ఇలాంటి ఫోనుచేస్తే పోలీసు కంప్లైంట్ ఇవ్వాల్సి వుంటుంది."
    "అయితే నీ ఖర్మ... అనుభవిస్తావు" కర్కశంగా పలికింది ఆ గొంతు.
    పైకి నిబ్బరంగా మాట్లాడినా ఈసారి కాస్త కలవరపడ్డారు నారాయణమూర్తిగారు. ఇవి ఉత్తుత్తి బెదిరింపులు కావేమో... ఈనాడు కోపంవస్తే మనిషిని చీమనో, దోమనో చంపినంత సులువుగా కిరాయి రౌడీలకి డబ్బిచ్చి చంపేస్తున్నారు. ఎన్నివార్తలు చదవడంలేదు, ఎన్ని సినిమాల్లో ఇలాంటి రౌడీయిజం చూడలేదు!
    సాక్ష్యాధారాలతో సహా ఒక్కొక్కరు ఎన్ని కోట్లు అప్పులు తీసుకున్నారో, ఎవరెవరికి ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో, ఎవరెంత విలాసవంతంగా జీవితాలు గడుపుతూ అభాగ్యుల రక్తమాంసాలతో విందులు చేసుకుంటున్నారో పేర్లతో సహా అప్పులు పట్టిక, ఆస్తుల పట్టిక పత్రికలో రావడంతో సంఘంలో పెద్దమనుషులు కక్కలేక మింగలేక ముఖం ఎత్తుకోలేని పరిస్థితిలో పడ్డారు. అలాంటి పెద్దమనుషులందరూ పేపరుమీద కత్తిగట్టారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. సానుభూతి చూపుకున్నారు. జరగవలసిన కార్యాచరణం గురించి చర్చించుకున్నారు.
    వరుసగా మరో నాలుగు రోజులు నాలుగైదు కొత్తగొంతులు ఫోనులో నారాయణ మూర్తిగారిని  బెదిరించాయి. "అంకుల్... ఫోన్ కి కాలర్ ఐ.డి. పెట్టిద్దాం... ఆ నెంబరు గురించి పోలీసు కంప్లైంట్ ఇద్దాం" శ్రీనివాస్ అన్నాడు.
    "గుడ్ ఐడియా... అవును డాడీ అలా అయితే ఈ బెదిరింపులు ఆగుతాయి" ఉత్సాహంగా అంది నీరద.
    నారాయణమూర్తిగారు ఒక్కక్షణం ఆలోచించి తల అడ్డంగా తిప్పారు. "వాళ్ళేం అంత పిచ్చివాళ్లు కాదు అంత తేలిగ్గా దొరికిపోవడానికి. ఇలాంటి బెదిరింపు కాల్స్ సాధారణంగా పబ్లిక్ టెలిఫోన్ బూత్ లనించి చేస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ ట్రేస్ చేయడం అంత సులువు కాదు.."
    "పోలీసు కంప్లైంట్ ఇద్దాం డాడీ... డాడీ, నాకెందుకో కాస్త భయంగా వుంది. ఇవి ఉత్తి బెదిరింపులు కావేమో... పోనీ డాడీ! ఇప్పటికే చాలా వివరాలు, చాలా గుట్లు బయటపెట్టాం కదా. ఇంక ఆపేద్దామా... వీళ్ళ సంగతి అందరికీ తెలిసింది గదా! మన ప్రయత్నం సఫలం అయింది కనుక ఇంక ముగిస్తున్నాం అని చెప్పేద్దామా?"
    "మనం వెంటనే ఆపేస్తే వాళ్ళ బెదిరింపులకి భయపడి మానేశాం అనుకుంటారు."
    "కరెక్ట్... మనం వేయాలనుకున్నవి, సేకరించిన కథలు ఇంకా వున్నాయి. అవి త్వరలో పూర్తిచేసి మానేద్దాం..." నారాయణమూర్తిగారు సాలోచనగా అన్నారు.
    "ఏమిటా గోల? బయట ఏమిటా కేకలు..." నీరద కేకలు విని గబగబా బయటికి వెళ్ళింది.
    ఒక మనిషి కిరసనాయిలు డబ్బా వంపుకుని మీద పోసుకుంటున్నాడు. పత్రికాఫీసులో వాళ్ళు, దారిన పోయేవారు అతన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. చేతిలో డబ్బా లాగేసుకుని అగ్గిపెట్టె లాక్కుంటున్నారు. నీరద, శ్రీనివాస్ గబగబా అక్కడికి వెళ్ళి ఆ గొడవ ఏమిటో అర్థంకాక అడిగారు.
    అంతా ఒక్కుమ్మడిగా "ఈయన బ్యాంక్ లో దాచుకున్న డబ్బంతా పోయిందట... బతకలేక చావాలనుకుని పేపరు ఆఫీసుముండు చచ్చిపోతే వార్తల్లోకి ఎక్కితే అప్పటికయినా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమోనని చస్తానంటున్నాడు. అంతా కలిసి చెప్పిందాని సారాంశం విని "ఏమిటండీ! మీరు చచ్చిపోయినంత మాత్రాన సమస్య
పరిష్కారమైపోతుందనుకుంటున్నారా! అంతా కలిసి పోరాడి సాధించుకోవాలిగాని ఈ పిచ్చిపని వల్ల మీ కుటుంబం నడివీధిన పడుతుందని మరిచిపోకండి" నీరద మందలింపుగా అంది.
    "మా పొట్టకొట్టినవాళ్ళు సర్వనాశనం అవుతారు."
    "శాపనార్థాలకి డబ్బులు రాలవండీ... మీరంతా కలవండి."
    "అంతా కలిశాం, ధర్నాలు చేశాం, నిరాహారదీక్షలు చేశాం. అప్పులు ఎగ్గొట్టిన ఘరానా దొంగలింటికి వెళ్ళి బతిమాలినా కనీసం మొహం చూడనైనా లేదు. కడుపు మండి బ్యాంకులముందు విధ్వంసం చేశాం. పోలీసులు మమ్మల్నే తరిమికొట్టారు తప్ప ఇప్పటివరకు ఈ దివాళాకి కారణమైన వారిని ఏం చేయగలిగారండీ" ఆయన ఆవేశంలో ఏడుస్తూ అరిచాడు
    "అందుకే కదండీ మీలాంటి డిపాజిటర్లకి న్యాయం జరగాలనే మా పేపరులో ఇదొక యజ్ఞంలా ఆరంభించాం" లోపల్నించి వచ్చిన నారాయణమూర్తి అతని భుజంమీద చెయ్యివేసి ఓదార్పుగా అన్నారు.                  

 Previous Page Next Page