"ఒరేయ్! నేనెన్ని డ్రామాలు రాశాను గానీ ఎప్పుడూ ఇంత అర్థంకాని తెలుగు మాట్లాడగా చూడలేదురా. దయచేసి నువ్వు మాట్లాడిన మాటలకు అర్థం చెప్పు."
చిరంజీవికి కోపం వచ్చింది.
"అంటే నాకు తెలుగు రాదంటావా?"
"ఆ మాట నేననలేదురా. స్కూల్లో నువ్వు 'స్పెషల్ తెలుగు' సబ్జెక్ట్ తీసుకున్నావనుకుంటాను."
"అవును! అందుకే కొంచెం హైస్టాండర్డ్"
"చాలా ఎక్కువ హై సాన్దార్డ్ కింద లెక్కే"
"తెలీదు"
"రేపే నా పెళ్ళి. పద వెళ్దాం"
"ఇప్పుడా?"
"అవును. మా డాడీకి తెలీకుండా ఏర్పాట్లు చేసేయాలి రాత్రికి రాత్రి"
"ఓ.కే. పద ఇలాంటి పనులకు మనం రడీ"
ఇద్దరూ బయటకు నడిచి కార్లో కూర్చున్నారు.
"రేపు మన ప్రోగ్రాం ఏమిటో తెలుసా? పొద్దున ఇంట్లో బర్త్ డే ఫంక్షన్. డాడీ జాలీలైఫ్ క్లబ్ గ్యాంగ్. అందరూ ఆ ప్రోగ్రాంకి వస్తారన్నమాట. సాయంత్రం మన ఫ్రెండ్ కోసం హాలీడే ఇన్ లో కాక్ టైల్ పార్టీ. అంతా ఫారిన్ స్టఫ్. నదులై ప్రవహించాలన్న మాట. రాత్రి పదిగంటలకు గుళ్ళో పెళ్ళి చాలా సీక్రెట్ గా కేవలం మన క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో జరుగుతుంది. ఎలా వుంది?"
"వండర్ ఫుల్"
"నీకింకో న్యూస్ చెప్పలేదనుకుంటాను"
"ఏమిటది?"
"నీ డ్రామా ను నేను సినిమాగా తీస్తానని ప్రామిస్ చేశాను కదా!"
"అవును. ఆ రోజు తాగిన మూడ్ లో చేశావ్?"
"తాగిన మూడ్ లో చేసినా ప్రామిస్ ప్రామిసే!"
"అంటే నిజంగా సినిమా తీస్తావా?" అడిగాడు సింహాద్రి.
"అవును. వారం రోజుల్లో షూటింగ్ మొదలుపెడతాను."
సింహాద్రి ఆనందంతో పొంగిపోయాడు.
"ఒరేయ్! నువ్వు చాలా గ్రేట్ ఫ్రెండువిరా! అది సినిమా తీశావంటే నిజం చెప్తున్నాను నీకు తెగ డబ్బొస్తుంది. నాకు తెగ పేరొస్తుంది. దాంతో బోలెడు సినిమాలకు పనిచేస్తాను. ఇంకా బోలెడు డబ్బు. ఆ డబ్బుతో ఓ అందమైన ఇల్లు కడతాను. ఆ ఇల్లు శోభకి ప్రెజెంట్ చేస్తాను" కలల్లో తేలిపోతూ అన్నాడు.
"ఏమిటది? ఆ ఇల్లు ఎవరికిస్తావ్?"
"శోభకి!"
"శోభెవరు? ఆ అమ్మాయికి ఇల్లెందుకు?"
"అది ఆ అమ్మాయి కల. ఆ కల నిజం చేయడానికి నేను సహాయం చేస్తానని ప్రామిస్ చేశాను."
"నేనూ సంగీతకు ఓ ప్రామిస్ చేశాను."
"ఏమిటది?"
"సంగీతను మన సినిమాలో హీరోయిన్ చేస్తానని. ఎలాగయినా సంగీతను సినిమా హీరోయిన్ చేయాలి."
సింహాద్రి ఉలిక్కిపడ్డాడు.
"సంగీతను మన సినిమాలో హీరోయిన్ చేస్తావా?"
"అవును" ఆనందంగా అన్నాడు చిరంజీవి.
"నేను చస్తే ఒప్పుకోను."
చిరంజీవి ఆశ్చర్యంగా చూశాడు. ముందు కారాపేశాడు నడిరోడ్డుమీద.
"ఒప్పుకోవా?" సీరియస్ గా అడిగాడు.
"నా కంఠంలో ప్రాణం వుండగా ఆ పిల్ల నా డ్రామాలో లేక నా కథ వున్న సినిమాలో హీరోయిన్ గా వేయడానికి నేనొప్పుకోను."
"ఎందుకని?" వెనుక వినబడుతున్న హారన్స్ పట్టించుకోకుండా అడిగాడు.
"ఆ పిల్లే నా డ్రామాని సర్వనాశనం చేసింది మొన్న..."
"ఆ మాట నేనొప్పుకోను. నాకా డ్రామా అద్భుతంగా వుంది."
"ఎందుకంటే నువ్వా పిల్ల మోజులో పడ్డావు కాబట్టి."
"కాదు"
"అవును"
ఇద్దరూ ఓ నిమిషం సైలెంటయిపోయారు.
"ఒరే సింహాద్రీ?"
"ఎస్!"
"మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్! అవునా?"
"అవును"
"మరి క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య గొడవెలా వస్తుంది"
"అమ్మాయిల వల్ల"
"కానీ ఆ అమ్మాయి అందరి అమ్మాయిల్లాంటిది కాదు."
"తావలచింది రంభ"
"షటప్! సంగీతను నేను సినిమా తారను చేసి తీర్తాను"
"ఆ సినిమాలన్నీ వీర ఫ్లాప్ అవుతాయి"
"అయినా సరే! సినిమాలు సక్సెస్ అయ్యేవరకూ తీస్తూనే వుంటాను."
"కొన్ని సినిమాలు తీశాక బఠానీలమ్ముకునే స్థితికొస్తావు."
"బఠానీల హోల్ సేల్ బిజినెస్ చేసి మళ్ళీ సినిమా తీస్తాను."
"నువ్వేమయినా తీసుకో. నా కథ మాత్రం నువ్వు తియ్యడానికి నేనొప్పుకోను."
"ఓహో! అందాకా వచ్చిందా వ్యవహారం?"
"అవును అందాకా వచ్చింది."
"అయితే నీ కథ నాకియ్యవన్నమాట"