Previous Page Next Page 
నేను పేజి 18


    నా మనసంగీకరించింది. చాలామందిలా డ్రెస్ చేసుకోటానికి ఎక్కువకాలం వృధా చేసే అలవాటు లేదు నాకు. పావుగంట తెమిలిపోయాను.


    బయల్దేరేముందు అద్దంలో నా రూపం చూసుకుని మురిసిపోకుండా ఉండలేకపోయాను.


    ఆ రూపంతో, కారులో ఎక్కుతూంటే ఇరుగూ పొరుగూ ఆసక్తితో చూడటం గమనిస్తూనే ఉన్నాను.


    శమంతకమణి ఇంటికి చేరేసరికి పడి నిమిషాలు పట్టింది.


    బయట చాలా కార్లాగి ఉన్నాయి.


    అబ్బో! చాలా పెద్ద మేడ. ముందు విశాలమైన ఖాళీ ప్రదేశం. అటూ ఇటూ సిల్క్ లా భ్రమింపచేస్తూ ముచ్చట గొలుపుతూ ఆకుపచ్చరంగుతో అలలారుతోన్న లాన్. ఆ రోజు ఫంక్షన్ కోసం ప్రత్యేకమైన విద్యుదీకరణ ఏమీ చెయ్యలేదు గానీ, ప్రతి గదిలోనూ లైట్లు వెలుగుతూ కనుల పండువుగా కనిపిస్తోంది.


    డ్రైవర్ వెంట లోపలికి వెళ్ళాను.


    మేడమీదున్న విశాలమైన హాల్లోకి అడుగు పెట్టాను. శమంతకమణి ఎదురుగా వచ్చి చెయ్యి పట్టుకుని 'రా' అంటూ ఆప్యాయంగా లోపలకు తీసుకెళ్ళింది.    


    చాలా విశాలమైన హాలు. అప్పటికే నలభై యాభై మంది దాకా చేరి ఉన్నారు. ఓ ఇరవై మంది స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ ఖరీదైన అలంకరణలతో విలాసవంతంగా వెలిగిపోతున్నారు. ఆ ధగధగలలో శరీరకాంతులు వింత వింత వయ్యారాలతో ఎగసిపడుతున్నాయి.


    శమంతకమణి నా వంక నఖశిఖ పర్యంతం చూస్తూ "ఫెంటాస్టిక్" అంది. సిగ్గుపడ్డాను. అక్కడున్న వారందరి కళ్ళు నాపైనే ఉండటం కూడా గమనించాను.   


    "రా అందర్నీ పరిచయం చేస్తాను" అంటూ అలా చెయ్యి పట్టుకునే ఒక్కొక్కరి దగ్గరకూ తీసికెళ్ళింది.  


    "ఈయన వినోద్ కుమార్. ప్రముఖ పారిశ్రామికవేత్త...."


    "ఈయన మహేష్ బాబు. అసిస్టెంట్ లేబర్. కమీషనర్."


    "ఈయన అనంతమూర్తి. పి.సి. కమర్షియర్ టాక్సెస్."      


    "ఈయన అచ్యుతానంద ముఖర్జీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇక్కడ కాదు. యు.సి."  


    "ఈయన ప్రకాష్ బాబు. ప్రముఖ సినీ నిర్మాత."


    ఈయన సూర్య నారాయణ్.... బ్యాంక్ జనరల్ మేనేజర్. కొద్ది రోజుల్లో చైర్మన్ అవుతారు.


    ఈయన వేదవ్యాన్. విశ్వవిఖ్యాత జ్యోతిష్కుడు. ఎస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ, ఫేస్ రీడింగ్.... రాజకీయ నాయకులు గాని, మంత్రులు గానీ, సినిమా తారలు గాని, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు గానీ ఈయన చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాల్సిందే.


    అలా వరుసగా పరిచయం చేస్తోంది. ఆడవాళ్ళని కూడా పరిచయం చేసింది. వారిలో ఎక్కువగా అక్కడున్న వారి భార్యలు, ఇద్దరు ముగ్గురు మాత్రం సహజంగా ఉన్నతస్థానంలో ఉన్నవాళ్ళు.      


    నా గురించి నా పెంపుడు కూతురు. సతిశ్రీ అని మాత్రం చెప్పేది. ఆ రెండు ముక్కల్లోనూ ఆమెకు నేనంటే ఉన్న ఆత్మీయత, మా ఇద్దరి మధ్యా ఉన్న బంధం వ్యక్తమవుతూ ఉంది.  


    కొంతమంది సంవత్సరాల తరబడి స్నేహంగా ఉన్నా ఒకరికొకరు దగ్గర కాలేరు. కొంతమంది చాలా తక్కువ వ్యవధిలోనే చేరువయిపోతూ ఉంటారు.    


    వారందరి మధ్యా తిరుగుతూ, అందరికి మర్యాదలు చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. శమంతకమణి అతన్ని "సుకుమార్ సుకుమార్" అని పిలుస్తూ ఏవేవో పనులు పురమాయిస్తూ ఉండటాన్ని బట్టి అతని పేరూ, ఆమె దగ్గర పని చేసే సాధారణ ఉద్యోగి అని తెలుస్తోంది. ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళుంటాయి. అందంగా, వినయంగా, ముచ్చటగా ఉన్నాడు.


    పార్టీ మొదలయ్యింది.


    ఆ రోజు పార్టీ ఎందుకో తెలీదు. బహుశా శమంతకమణి పుట్టిన రోజేమో అనుకున్నాను.


    అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ, హంగామా చేస్తూ పార్టీలో పాల్గొంటున్నారు. అయిదారుగురు సప్లయిర్స్ అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. అక్కడున్న వాళ్ళంతా, ఒక్క వేదవ్యాస్ తప్ప డ్రింక్ చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా త్రాగుతున్నారు. కొందరు విస్కీ, కొందరు బ్రాందీ, కొందరు జిన్, కొందరు బీర్.... ఎవరి ఇష్టాలను బట్టి వాళ్ళు త్రాగుతున్నారు. లోపల్నుంచి రకరకాల తినుబండారాలు వస్తున్నాయి. చిప్స్, క్యాజూ ఇలాంటి వాటితోబాటు ఎన్నో రకాల నాన్ వెజిటేరియన్ ఐటెమ్స్, కొద్దిగా వెజిటేరియన్ పదార్థాలు వస్తున్నాయి.


     తింటున్నారు. త్రాగుతున్నారు. క్రమక్రమంగా కోలాహలం పెరిగిపోతూన్నది. ఏవేవో జోక్స్, పెద్ద పెట్టున నవ్వులు.


    నాకేం చెయ్యాలో తోచక ఒక ప్రక్కన వొంటరిగా కూర్చున్నాను. ఆ వాతావరణంలోకి వచ్చినందుకు నేనేం బాధపడటం లేదు. అదంతా ఓ సినిమా చూస్తున్నట్లు వింతగా, సరదాగా ఉంది. నేనేం ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీలవటం లేదు. కాని ఒక్కో మనిషిలో ఎన్ని రకాల అల్పజీవిలుంటారో తెలుస్తోంది. ఎన్నోరకాల అల్ప మనస్తత్వాలు కలిస్తేనే ఒక మేధావి తయారవుతాడేమో. మొదట్నుంచి నా ఆలోచన్లు ఇలాగే ఉంటాయి. ఇతరులకి ఎంతవరకూ అర్థమవుతాయో తెలీదు. ఆ మాటకొస్తే అర్థమవాలని ఎక్కడుంది? జీవితాంతం కష్టపడినా ఒక మనిషి తనకే తాను అర్థం కానప్పుడు ఇతరుల్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాడు?    


    శమంతకమణి నేను వొంటరిగా ఉండటం కనిపెట్టి మధ్య మధ్య వచ్చి పలకరిస్తూనే ఉంది. పాపం నా వొంటరితనం పోగొట్టటానికి ప్రయత్నిస్తూనే ఉంది.    


    "ఇలా కూచోకు. ఆ అనంతమూర్తి గారున్నారే, భలే సరదాగా మాట్లాడతారు. ఒక్క నిమిషంలో నీ కొత్త అంతా పోతుంది."


    "ఫరవాలేదు లెండి. నాకిలాగే బావుంది."


    "నీకు వొంటరితనమంటే ఇష్టమనుకుంటాను" అంటూ నవ్వింది.

 Previous Page Next Page