Previous Page Next Page 
నేను పేజి 17


    "నాలాంటి అమ్మాయి. అంటే నా గురించి కొంత తెలుసుకున్నారా?"


    "కొంతేమిటి? పూర్తిగా తెలుసుకున్నాను."


    "ఎలా?"


    "ఎలాగయితే? ఓ స్థితికొచ్చాక ఏదీ అసాధ్యం కాదు. నా దగ్గర కోట్ల కొద్దీ డబ్బుంది. కావలసినంత పలుకుబడి ఉంది. కనుసైగ చేసినంత మాత్రాన ఏ పనయినా చేసే మనుషులున్నారు. ఇహ తలుచుకుంటే చేయలేనిదేముంది?"


    "నన్ను చూశాక మీ అన్వేషణ పూర్తయిందా?"


    "చూడటం వరకూ పూర్తయింది."


    "మిగతాది?"


    "చెబుతాను" అంటూ కొంచెంసేపు ఆలోచిస్తున్నట్లు ఉండిపోయింది. తర్వాత ఉన్నట్లుండి "ఇలా ఎందుకు జరుగుతుంది?" అన్నది తనలో తాను ఆలోచించుకుంటూన్నట్లు.  


    నేను ప్రశ్నార్థకంగా చూశాను.


    "దేవుడున్నాడో లేదో నాకు తెలీదు. మంచివాళ్ళూ, దుర్మార్గులూ అందరూ అతన్ని కొలుస్తారు. కాని ఎవరికీ అర్హతను బట్టి జీవితాన్ని ప్రసాదించడు."


    "ఇప్పుడా సంగతి ఎందుకు చెబుతున్నారు?"


    "నిన్నూ, నీకు జరుగుతున్న సంఘటనల్ని బట్టి అనకుండా ఉండలేకపోతున్నాను.... వాడు.... నిన్ను పెళ్ళి చేసుకున్నవాడు.... అసలు తనలో ఏమీలేదని తెలిసుండే ఎందుకు నిన్ను పెళ్ళాడాడు? నిన్ను కోరికలన్నీ చంపుకుంటూ పతివ్రతా ధర్మం నిర్వహించమనా, లేకపోతే బావగారితోనో, మామగారితోనో అక్రమ సంబంధం పెట్టుకొని జీవితం వెళ్ళబుచ్చమనా?"     


    "మీకివన్నీ ఎలా తెలుసు?"


    "చెప్పానుగా తెలుస్తుంటాయని?"


    "ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?"


    "ఏం చెయ్యాలనుకుంటున్నారు?"


    "ఏమీ తెలీటం లేదు. ఎలాగోలా బ్రతకాలి. నా దగ్గరున్న డబ్బు కొన్నాళ్ళలో అయిపోతుంది. ఈలోగా.... ఏదన్నా ఉద్యోగం చూసుకోవాలి."


    "ఎలాగోలా...." ఆమె గొంతులో బాధ ధ్వనించింది. "ఏదో రకంగా అర్థం లేకుండా, పిచ్చి పిచ్చిగా బతకటానికి కాదు మనిషి పుట్టింది. నీ మంచితనం, ఈ పసితనంలో బేలగా అన్పించి ఆక్రందనలూ భరిస్తూ ఏదో ఒకటి వొండుకుని తింటూ.... ఒక్కొక్క రోజు ఇలా వ్యర్థమైపోతూంటే...."


    "నా జీవితం సుఖంగా ఉందని నేననటం లేదు. నా గుండెల్లో అగ్నిగోళాలు బ్రద్ధలవుతున్నాయి. ఇలా ఒకటి రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుని, మీరన్నట్లు ఏదో ఒకటి వొండుకుని తింటూ, రాత్రిళ్ళు నిద్రపట్టక బాధపడుతూ.... ఈ జీవితాన్ని నేను కోరుకోవటం లేదు. నాకో గుర్తింపు కావాలన్న తపన అందరికన్నా నాలో ఎక్కువగా ఉంది. కానీ దారి తెలీటం లేదు. అదీగాక గుండెల్ని నలిపేసే ఈ నిస్సహాయ స్థితి...."  


    "దారి నేను చూపిస్తాను"


    ఉలిక్కిపడినట్లయి, ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాను.


    అదే నవ్వు పెదాల మీద.


    లేచి నిలబడి నా దగ్గరకొచ్చింది. నా బుగ్గలు ఆప్యాయంగా పుణికి 'హౌ నైస్!' అంది అలాగే కళ్ళప్పగించి చూస్తూ.  


    "ఈ మహా సౌందర్యం ఉండాల్సిన చోటు ఇదికాదు."


    నాకు భయం వెయ్యలేదు. నేనెక్కడికో ట్రాప్ చెయ్యబడుతున్నట్లుగా అనిపించలేదు. నా స్వభావానికి విరుద్ధంగా ఎవరూ ఏమీ చేయించలేరన్న నమ్మకం నాకుంది. ఒక్కోసారి ఈ మొండి నమ్మకమే ప్రాణాంతకమవుతూ ఉంటుంది. అది వేరే విషయం.    


    "నీకు చాలా చెప్పాలి"


    "చెప్పండి" అన్నాను.


    "ఇప్పుడు కాదు. నీకో ప్రపంచం మొదట చూపించాలి. రేపు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి."


    ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాను.


    "ఆరుగంటలకు కారు పంపిస్తాను. కాదనకు. నీ కళ్ళముందు వెలిగే కొత్త వెలుగులు దర్శించటానికి నిరాకరించకు."


    సరే అన్నాను.


    ఆమె వెళ్ళిపోయింది.


    నాకేం ఆశ్చర్యమనిపించలేదు. పెద్ద పెద్ద సంఘటనలను కూడా తేలిగ్గా తీసుకునే నా స్వభావాన్ని 'అహం' అనుకుందామా? ఉన్నదేమో తెలీదు. ఆ రాత్రి బజార్నుంచి తెచ్చిన సరుకుల్ని ఇంట్లో సర్దుకుని, వొండుకుని తిన్నాను. ఆ వయసులో.... అలా ఒక్కతే నివసిస్తూ, ఒక్కతే వొండుకు తినే జీవితం.... ఎంత దారుణంగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది.      


                                                                 9


    మర్నాడు సాయంత్రం ఆరుగంటలకల్లా ఇంటికి కారొచ్చింది.


    డ్రైవరు ఓ పార్సిల్ నాకందిస్తూ "అమ్మగారు మీకిమ్మన్నారు" అన్నాడు.


    విప్పి చూశాను.


    కళ్ళు మిరుమిట్లు కొలిపే ఖరీదైన చీరె, దాని మీదకు ఓ బ్లౌజ్, రెండు నెక్లెస్ లు రవ్వల గాజులు ఉన్నాయి. చిన్న ఉత్తరం.


    "సతీ!


    పార్టీ కొచ్చేటప్పుడు సాదా డ్రెస్ లో, ఒంటిమీద ఆభరణాలు లేకుండా రావటానికి మొహమాటపడతావని తెలుసు. ఇష్టం లేకపోతే తర్వాత తిరిగి ఇచ్చేద్దువు గాని, ధరించటం మానకు.       


                                                                              శమంతకమణి"


    ఒకే ఒక నిమిషం ఆలోచించాను. చదువుకున్న స్త్రీ అయినా, మామూలు స్త్రీ అయినా పెళ్ళికో, పేరంటానికో వెళ్ళేటప్పుడు వొంటి మీద ఆభరణాలేమీ లేకుండా వెళ్ళటానికి ఇష్టముండదు. ఇది బలహీనత అనేకంటే, సొసైటీలో ఉండే క్షమించదగే రుగ్మతలలో ఒకటనుకుంటే పోతుందనుకుంటాను.

 Previous Page Next Page