ఒంటరితనం దుర్భరమే. కాని మనుషుల్లోకి అసహ్యాన్ని, అల్పత్వాన్నీ భరించటం కన్న ఒంటరిగా ఉండి మనల్ని మనం హింసించుకోటం ఉత్తమం. కాని ప్రతి చిన్నదానికి ఇతరుల మీద ఆధారపడే ఆవశ్యకత ఉన్నప్పుడు అర్థంలేని ఈ ఒంటరితనం ఎన్నాళ్ళు కొనసాగించగలం.?
అబ్బో! మనుషుల్లో ఎన్ని రకాలు! జీవితంలో దూరి జీవించేవాళ్లు కొందరు, పైపైన ప్రేక్షకుల్లా నిలబడి జీవించేసేవారు కొందరు. ఆలోచనాత్మకంగా జీవించేవారు కొందరు, ఏ ఆలోచనా లేకుండా యాంత్రికంగా జీవించేవారు కొందరు, తమకంటూ ప్రత్యేకమైన శైలిని రూపొందించుకొని ఆ శైలిని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ జీవించేవారు కొందరు. ఏ శైలీ లేకుండా ఎటుగాలి వీస్తే అటు కొట్టుకుపోతూ జీవించేవారు కొందరు.
కొందరి జీవితాలు అడుగడుక్కి సంఘటనలతో నిండి ఉంటాయి.
మరికొందరివి కేవలం ధియరీ క్లాసుల్లా సాగిపోతూ ఉంటాయి అక్కడ ప్రాక్టికల్స్ ఉండవు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతయినా ఉంది. ముందు ముందు సందర్భానుసారం చెప్పటానికి ఇంతటితో వదిలేసి మళ్ళీ నాలోకి ప్రవేశిస్తున్నాను.
ఇంతకీ అప్పటికి నా వయసెంతని.
ఇంకా పదిహేడేళ్ళు నిండలేదు.
సరిగ్గా అప్పుడే నా జీవితం మరో మలుపు తిరిగింది.
ఒకరోజు సాయంత్రం బజారుకెళ్ళి కావాల్సిన సరుకులు కొనుక్కుని రిక్షాలో ఇంటికొస్తున్నాను. నా మనసు రకరకాల ఆలోచనల్లో నిమగ్నమై వుంది. అత్తగారిచ్చిన డబ్బు ఇంకో రెండు మూడు నెలలు వస్తుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలి? వుద్యోగానికి కావలసిన చదువు నాకు లేదు. ఏదో చిన్న వుద్యోగమొస్తుంది. కాని బ్రతకటానికి అది సరిపోతుందా?
ఈ లేత మనసు సరిగ్గా వుండలేక రకరకాల గెంతులు వేస్తోంది గెంతులు అనగానే అపార్థం చేసుకోకండి. వాటిలో చెడు భావాలేమీ లేవు. అసలు నాకు చెడు గురించి ఏమీ తెలీదు. నా మనసులో వున్నవి భవిష్యత్తుని గురించి ఆందోళనతో వున్న అమాయకపు చిందులు మాత్రమే.
రిక్షా వెనగ్గా ఓ కారు అనుసరించటం గమనించాను. అందమైన కారు. చాలా విలాసవంతంగా వుంది. అందమైన ఆడపిల్లలు రోడ్డుమీద పోతూన్నప్పుడు రకరకాల వ్యక్తులు వెంటబడటం పరిపాటే. అందులో ఆశ్చర్యమేమీ లేదు. వొద్దనుకుంటూనే తల కొంచెం వెనక్కి త్రిప్పి తొంగి చూశాను. కారు డ్రైవ్ చేస్తోంది మగాడు కాదు. స్త్రీ. అంతకంటే గమనించటానికి వీల్లేకపోయింది.
పావుగంట తర్వాత ఇంటిముందు రిక్షా ఆపి తాళం తీసి సరుకులున్న సంచి తీసుకుని లోపలికెళ్ళిపోయాను.
పది నిమిషాలు గడిచి వుంటాయి. బయట్నించి ఎవరో తలుపు తట్టినట్లయింది. నే వుంటోన్న ఇంటికి కాలింగ్ బెల్ లేదు.
వెళ్లి తలుపు తీశాను.
ఇందాక కారులో నన్ను వెంటాడిన స్త్రీ. ఆమె వస్తూందని ఊహిస్తూనే వున్నాను.
పలకరిస్తూన్నట్లుగా చిరునవ్వుతో చూసింది.
"రండి" అన్నాను మర్యాదగా.
ఇప్పుడు నే వుంటోన్నది రెండుగదుల ఇల్లే. ముందు గదిలోనే రెండు కుర్చీలు, వగైరా. రాత్రిళ్ళు అక్కడే మంచం వేసుకుని పడుకుంటూ వుంటాను.
ఆమె కూచున్నాక ముఖంలోకి పరిశీలనగా చూశాను. ముప్ఫై అయిదేళ్ళుంటాయి. చాలా అందగత్తె. ఆ ముఖంలో, కళ్ళలో గొప్ప వెలుగు, వింత తేజస్సు. ఖరీదైన చీరె, ఆభరణాలు ఎంతవరకూ అవసరమో, అంత వరకే ధరించింది.
ఆమెలోని ఆకర్షణ నన్నాకట్టుకుంది.
అప్రయత్నంగా నవ్వాను.
తనూ నవ్వింది.
ఎంత మనోహరమైన నవ్వు! ముత్యాల్లాంటి పలువరసతో భామ, చెవులకున్న రవ్వలదుద్దులు తళతళమన్నాయి.
"మీరు చాలా అందంగా ఉంటారు" అన్నాను.
"నీకన్నానా?"
నాలో సంతోషంతో కూడిన గగుర్పాటు. ఒక మగాడు ఆడదాని అందాన్ని పొగడటంలో ప్రత్యేకతేదీ లేదు. కాని ఒక ఆడది ఇంకో ఆడదాని అందాన్ని అభినందించటంలో ఈర్ష్యనధిగమించిన నిజాయితీ లైంగిక చాపల్యం లేని పులకింత ఆవరించి ఉంటాయి.
"స్త్రీకి అందమొక్కటే చాలదు. శరీరపు వొంపులూ చాలవు. కళాత్మకమైన విలువలు ఇంకా చాలా చాలా వుండాలి. ఏ కోటికి ఒకరో అలాంటి అపురూప రత్నంలా మలచబడతారు. ఆ మాదిరి అపురూప రాత్నానివి నువ్వు.
నాకెందుకో గర్వమనిపించలేదు. బహుశా గర్వపడటం అందరికీ చేత కాదనుకుంటాను.
రెండు మూడు క్షణాలు.... అదిగో క్షణాలు మళ్ళీ వచ్చాయి మౌనంగా గడిచాయి.
ఎంచేతనో ఆమె పట్ల వినయమూ, గౌరవభావమూ కలుగుతున్నాయి. అందుకే అపరిచిత వ్యక్తి అయినా నిర్మొహమాటంగా మాట్లాడలేకపోతున్నాను.
"మీరెవరో తెలుసుకోవచ్చునా?" అని మర్యాదగా అడిగాను.
"నా పేరు శామంతకమణి."
పేరుకు తగ్గట్లు నిజంగానే ఓ మణిలా ప్రకాశిస్తోంది.
నాలో కొన్ని సందేహాలు ఉదయిస్తున్నాయి.
వీటిని గమనించినట్లు నవ్వింది.
"ఇప్పుడు నా వయసు ముప్పయి అయిదేళ్ళు. కొన్ని విషయాల్లో స్త్రీకి ఈ వయసొస్తే రిటైరయినట్లే లెక్క. ఎన్ని తెలివి తేటలున్నా జిజ్ఞాస ఉన్నా, నన్ను గురించి నేను తెలుసుకునేసరికి లేటయి, కొంత జీవితం చెయ్యి జారిపోయింది. అనుకున్నది సాధించలేకపోయాను. తీవ్రమైన అసంతృప్తితో.... విచిత్ర స్థితిలో నీలాంటి అమ్మాయికోసం అన్వేషిస్తున్నాను."