"మేమంటే మీరూ, మీ పెద్దబ్బాయా? విడి విడిగానేనా, ఉమ్మడిగానా?"
"నువ్వు పెద్దరికాన్ని గౌరవిస్తే మంచిది."
"ఇదేనా మీ సమాధానం?"
"ఇంతకంటే ఏముంటుంది?"
"ఆడదానికి డబ్బు, విలాసాలే కాకుండా అందమైన జీవితం కావాలని మీకు తోచటం లేదా?"
"డబ్బు, విలాసాలు లేని జీవితంలో ఎంత అందమున్నా, కష్టాలే తప్ప రుచి ఏముంటుంది?"
ఇహ అతన్తో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని ఇవతలి కొచ్చేశాను.
మర్నాడు మా అత్తగారితో మాట్లాడటం జరిగింది.
"జరిగిందానికి నేను చాలా విచారిస్తున్నాను. మావాడి అశక్తత గురించి అవగాహన లేనిదాన్ని కాను. చాలామంది డాక్టర్లను సంప్రదించాను. మానసికంగా భయమూ, స్తబ్దతే గాని శారీరకంగా ఏమీ లోపం లేదనీ, అతన్ని ఉత్తేజపరచగల ఆడది ఉంటే ఆ స్తబ్దత తొలగిపోయే అవకాశముందని చెప్పారు. అలాంటి అమ్మాయికోసం వెదుకుతూండగా ఒకరోజు హఠాత్తుగా నువ్వు కనిపించావు. ఏ లక్షమందిలో ఒకరిలో కనిపించే కవ్వింపూ, ఆకర్షణా నీలో కనిపించాయి. నీ వల్ల వాడిలో స్తబ్దత తొలగిపోతుందనీ, ఉత్తేజం కలుగుతుందనీ ఆశించాను. నా దురదృష్టం నీ అందం, యవ్వనం అందర్నీ రెచ్చగొడుతూంది గానీ, వాడిలో ఏమీ కదలిక తీసుకురాలేక పోయింది. నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు. కాని ఒక్క హామీ ఇస్తున్నాను. ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఇక్కడే ఉండి నీ ప్రయివేట్ లైఫ్ ఇంకో రకంగా ఎన్నుకున్నా నా సహకారముంటుంది."
నేను జవాబు చెప్పటానికి ఎక్కువ వ్యవధి తీసుకోలేదు.
"మీ మంచితనం, ఔదార్యం నన్ను ముగ్ధురాలను చేస్తున్నాయి. కాని నాకు డైరెక్ట్ లైఫ్ కావాలనిగానీ, యిన్ డైరెక్ట్ లైఫ్ అక్కర్లేదు. నేనిలా చెయ్యటం వల్ల మీ కుటుంబ గౌరవం పెరగకపోగా ఇంకా తగ్గి అల్లరిపాలవుతుంది. నేనెవరికి నిజం చెప్పను. నేను గయ్యాళిదాన్ననీ, మీ స్టేటస్ కి తగినదాన్ని కాదనీ, ఇంకా అవసరమయితే నా క్యారెక్టర్ కూడా మంచిది కాదనీ ప్రచారం చెయ్యండి. నేను దేన్నీ ఖండించను" అన్నాను.
ఆమె కళ్ళలో నీరు చిమ్ముతూండటం చూశాను. దగ్గరకొచ్చి కావలించుకుంది. "ఇంత గొప్ప అందం, మనసూ ఉన్నదానివి.... దేవుడు నీకన్యాయం చేశాడు" అంది గాద్గదిక కంఠంతో.
"వాణ్ణి గురించి నాకు చెప్పకండి" అన్నాను కొంచెంగా నవ్వి.
"ఎవరి గురించి?"
"దేవుడి గురించి. ఎందుకంటే అన్యాయాలు చెయ్యటంలో సిద్ధహస్తుడు. ఈ నిజాన్ని ఒప్పుకోవటానికి భయపడి వాడికి ఇంకా ఇంకా పూజలు చేస్తూ ఉంటారు."
ఆమె కూడా నవ్వేసింది." నువ్వు చాలా నిర్భయంగా మాట్లాడటం నాకు నచ్చింది. నువ్వెక్కడున్నా నా ఆశీర్వాదం ఉంటుంది."
"మీ సదభిప్రాయానికి కృతజ్ఞురాల్ని. కాని ఆశీర్వాదానికి అంత బలముంటుందనుకోను."
మళ్ళీ నవ్వింది.
వెళ్ళిపోయేటప్పుడు ఓ సూట్ కేస్ ఇచ్చింది.
"ఏమిటిది?"
"డబ్బు"
"మనోవృత్తి క్రిందా? ఉంచండి"
"కాదనకు. మీ అమ్మగారి ఆరోగ్యం బాగాలేదని విన్నాను. నువ్వు ఇంకో రకంగా సెటిలయ్యే వరకూ దీని ఉపయోగముంటుంది."
తీసుకుని, ఆ ఇంట్లోంచి నిష్క్రమించాడు.
8
అమ్మ పరిస్థితి చాలా విషమంగా ఉంది.
"ఇలా ఉంటే నాకెందుకు కబురు చెయ్యలేదు?"
కొంతమంది 'ఆ వెధవ జీవితం. దీని మీద నాకేం ఇంట్రస్ట్ లేదు. అని పదే పదే కబుర్లు చెబుతూంటారు. కాని అనుక్షణం చచ్చే భయం. ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఆ వెధవ బడాయి కబుర్లు చెప్పేవారికంటే నిజమైన విరక్తి కలిగి, చావుకు బయపడనివారు నిశ్శబ్దమనుగడలో బయటకు తెలీకుండా ఉంటారు.
అమ్మలో ఆ అసలైన విరక్తి కనిపించింది.
ముఖంలోగాని, దుఃఖంలోగాని పరీవర్షన్ లేకుండా సూటిగా జీవించే మనుషులు చాలా కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిలో అమ్మ ఒకతె.
కొంతమంది అవశానదశలో, శరీరం దారుణంగా వ్యాధిగ్రస్తమై, ఏ ఆశా కనిపించని సమయంలో కూడా బ్రతకటానికి బ్రతికించుకోటానికి వికృతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమన్నా అంటే మానవతా దృష్టి అని ప్రగల్భాలు పలుకుతుంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ అవసరాలకు ఉపయోగించే మానవతా దృష్టి ప్రదర్శించకుండా ఇలాంటి సమయాల్లో ప్రదర్శించటం మానసిక వికారంగా కనిపిస్తుంది.
అమ్మను బ్రతికించుకోటానికి నేను చేస్తోన్న ప్రయత్నాలు తీవ్రంగా ప్రతిఘటించింది.
ఆ విషాదమైన జీవం లేని నవ్వుతో, కళలేని చూపుల్లో నా గురించి పడుతున్న వేదన కనిపిస్తోంది.
ఆమె మానసికంగా బాధపడకుండా ఉండటానికి నేను చేస్తోన్న ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతున్నాయి.
కొన్నిరోజుల ప్రయాస తర్వాత నన్ను ఒంటరిగా ఒదిలి అమ్మ వెళ్ళిపోయింది.
నా కళ్ళు.... కన్నీళ్ళకి నోచుకోలేదో, సెల్ఫ్ సిటీ అంటే ఉన్న విముఖత్వమో, వాటిలోకి తడి రాలేదు.
* * *