Previous Page Next Page 
చెదిరిపోతున్న దృశ్యం పేజి 15

    గొంతు గుండెలోన...
    గొంతుగుండెలోకి దిగిపోతోంది
    గుడ్లప్పగించాను - మాటరాక
    గుండె గోతుల్లోని గాయాలలోకి
    జారిపోతోంది గొంతు !
    మూగవై మిగిలాను - పలుకలేక
    అరవాలను కున్నాను అందరూ వినేలా ఎలుగెత్తి
    విలుకాని దెబ్బలకు విలవిలా
    కొట్టుకుంటూన్న హరిణంలా
    పూడుకు పోయింది నా గొంతు
    పుట్టెడు దుఃఖంతో
    కళ్లనిండా వెతలు కథలై
    నిండుకున్నాయి
    ఒళ్లు జలదరించి రోమాలు
    రిక్కపొడుచుకున్నాయి
    కన్నీళ్లు కాలువలు కట్టి మండుతూ
    గుండెను తడిపి ముంచెత్తుతున్నాయి
    కణకణలాడే మార్తాండుణ్ణి
    రాహువు కసిగా మింగేసి
    కహకహ నవ్వేసినట్టు -
    వెండివెలుగులు పరుచుకుని
    అందంగా అలంకరించుకున్న తారలతో
    ఆడుకుంటున్న చందమామని
    నల్లని చిమ్నీ పొగలాంటి కారుమబ్బులు
    కప్పేసి అందాలను అలికేసినట్టు -
    మనిషిలోని మానవత్వాన్ని
    స్వార్ధంతో హత్య చేస్తున్నాడు
    ఆధునిక మానవుడు -
    కన్నతల్లి ఆస్థిపరురాలైనా
    ముసలిది ఇంకా చావడంలేదని
    గుండెలో కత్తిని దిగేసి కసాయిలా నరికి పారేసిన కొడుకు ఒకడైతే
    బీదదైన తల్లి బతికి ఎవరినుద్ధరించాలని
    బతికుండగానే చితిని పేరుస్తున్న కొడుకు మరొకడు
    ఆ వైఖరికి నాగొంతు ఖంగుమందామనుకొంది
    మాట పెగలక నాగొంతు గుండెలోకి జారిపోయి
    జావగారిపోయింది
    కట్నం చాలలేదని కక్షకట్టి
    కాల్చి చంపిన తాళికట్టిన భర్త
    కడుపు చీల్చుకు పుట్టిన బిడ్డలకి
    కడివెడు కన్నీళ్ళూ కష్టాలూ తప్ప
    పట్టెడు మెతుకులు పెట్టలేక
    అల్లల్లాడే తల్లి ఆత్మహత్య
    నడిరోడ్డుమీద పట్టపగలే
    వికటాట్టహాసం అఘాయిత్యం అక్రమాలు
    ఆడవాళ్లంటే 'ఆడు' వాళ్లుగా
    అత్యాచారాలు చేసి
    అలుసుగా కంటిలోని నలుసులా
    తొక్కిపారేసే వైనం -
    నా గొంతు ఉరుమై ఉరవాలనుకుంది
    చప్పుడు రాక గుండెచప్పుళ్లలో ఇరికిపోయి
    నా గొంతు గుండెలో చిక్కుపడి
    మూతబడిపోయింది
    ఎలాతియ్యను పైకి ?
    గుండె బండలా బద్దలై
    గొంతునులిమేస్తున్న వేళ
    నా గొంతు మౌనంగా రోదిస్తోంది
    ఏడుస్తూ ఎండిపోతోంది !
    నా పలుకు తేనె చిలుకై నిలిచిననాడు
    నా గొంతు పాడిన మోహన రాగాలు
    తేటతెల్లని తెనుగు పాటలై
    గుండెగుండెను వీణగా మలచి
    ఆనంద భైరవియై మ్రోగిననాడు
    మనవత మల్లెతీగై
    మంచితనం సుగంధమై
    మమతల పారిజాతాలై
    మనిషి కోవెలలోని దేముడిలా
    పుడమితల్లిని పులకింపజేసినవేళ
    కోటివీణల నాదంతో
    సాటిలేని రాగంతో
    మాట మాటలో మందారాలు
    పూయించిన నాగొంతు
    ఈ విషజ్వాలల్ని భరించలేక
    మారణహోమాల ధూమాన్ని పీల్చలేక
    శవదహనాల హారతుల
    నందుకుని ఆనందించలేక
    శుష్కనినాదాల హాహాకారాల
    నాలకించలేక
    గుండెలోకి దిగిపోయింది నాగొంతు
    మాటలు విరుచుకుంది
    ఎలా మాట్లాడగలను ?
    బలిపశువుగా మూగిగా
    కన్నీరు కార్చడం తప్ప
    ఎలా మాట్లాడగలను ?
    రండి ! రండి !
    నా గొంతును గుండెలోయలో నుంచి తీసి
    రక్షించండి ! ప్రాణం పొయ్యండి !
    మళ్లీ నా కంఠానికి మాటనివ్వండి 
    పదిమందినీ పలకరించే
    సౌభాగ్యాన్ని చేకూర్చంది
    నా శబ్దప్రపంచాన్ని మళ్లీ
    నాకు అందించండి !
            * * *
 

 Previous Page Next Page