మగువా! చెయ్యి తెగువ!
పైశాచికం పడగవిప్పి నాట్యం చేస్తోంది
నాగరీకం పదంపాడుతూ తాళంవేస్తోంది
పురుషాధిక్యం సమాజం మీసాలుతిప్పి
ఎప్పుడూ ఆడదానిపై సవాలు చేస్తూనేవున్నది
స్త్రీని ఒక నలుసుగానే కాలరాసి పారేస్తున్నది
ఎదురు తిరిగిన మగువను మగరాయుడు అంటూ
తూలనాడుతూన్నది, హేళన చేస్తున్నది
ఆడవాళ్లకి పిరికి పాలు పోస్తూ
ప్రతివ్రతల కథలనుసిరంజితో ఇంజక్షన్ చేస్తూ
స్త్రీని ఎదగనీయక పురుషుడు
అడ్డుగోడై నిలుస్తున్నాడు
ఆమెమీద పెత్తనం చెలాయిస్తున్నాడు
డిగ్రీలున్నా దండగ ఆమెకి - ఉద్యోగం చెయ్యాలంటే
పురుషుడి 'పర్మిషన్' కావాలి
ఉద్యోగాలున్నా దండగే -ఆ డబ్బు పురుషుడికే ఇవ్వాలి
అతడి ఇష్టప్రకారమే ఖర్చు పెట్టాలి !
మగువా ! చెయ్యి తెగువ !
మహిళా దినోత్సవాలలో తద్దినం పెట్టించుకున్నట్టు
వేదికలనెక్కి ఉపన్యాసాలివ్వడంకాదు
ఏడుపుకధలు వినిపించడంకాదు
ఏడుపుకధలు వినిపించడంకాదు
ఈర్ష్యా సూయలు మాని
ద్వేషాగ్నిజ్వాలలకు దూరమై
మూడు కొప్పలు కలవవన్న నానుడిని తుడిచేస్తూ
మహాప్రభంజనమై విజృంభించాలి
నవనారీ ప్రభాతగీతం ఎలుగెత్తి పాడాలి
నువ్వు కేవలం ఒక్క ఆడదానివే కాదు
మరొక పురుషుడికి జన్మనిచ్చే ప్రాణదాతవి కూడా!
* * *
సమాంతర రేఖలు
వయసుకి మనులేదు
వద్దన్నా వస్తుంది
ఆగమన్నా ఆగదు కొంచెం
కనికరం అది ఎరుగడు
మనసుకు వయసులేదు
కమ్మని కలలు కంటూనే వుంటుంది
నడుం వంగినా బలం తగ్గినా
ఊహల పల్లకీలో
ఊరేగుతూనే వుంటుంది
గతాల జ్ఞాపకాల హరివిల్లులో
తనపొదరిల్లు కట్టుకుని
గంతులు వేస్తుంది
ఆనంద సాగర తీరాలలో ఈదుకుంటూ
అనుభూతులు ఏరుకుంటుంది
వయసుకి మనసులేదు
వద్దన్నా వస్తుంది -
మనసు నింపుకుంటుంది
నిత్యనూతన జ్యోతులు
వయసు రాల్చుకుంటుంది
గతకాలపు కాంతులు
ఇవి కలవని సమాంతర రేఖలు
* * *