Previous Page Next Page 
చెదిరిపోతున్న దృశ్యం పేజి 16

    రిసర్చ్ లాబ్...
    కొందరిని చూస్తే మనస్కరించాలనిపిస్తుంది
    కొందరిని చూస్తే తిరస్కరించాలనిపిస్తుంది
    కళ్లు చెప్తాయి పరికించి చూసి
    ఎవరు హితులో ఎవరుకాదో
    మనసు చెబుతుంది గుండెలోతుల్లోకి తొంగిచూసి
    ఎవరు నెయ్యానికి తగుదురో
    ఎవరు కయ్యానికి కాలుదువ్వుదురో
    నా మనసూ కళ్లూ ఇచ్చే గైడెన్సుతోనే
    కొందరికి నమస్కరిస్తాను
    కొందరిని తిరస్కరిస్తాను
    ఎప్పుడో గాని కళ్ళు దారితప్పవు
    మనసు మార్గం మరువదు
    అంచనా తారుమారుకాదు
    మాటలే అక్కర్లేదు
    మనిషిని చదవడానికి
    నా మెదడే ఒక రిసెర్చ్ ల్యాబ్
             * * *
    కలం చేతికర్రగా...!
    హలంపట్టి పొలందున్నే ఇంటపుట్టి
    కలంపట్టి సాహితీ క్షేత్రాన్ని దున్నావు
    నీ కలం బలం వన్నెతెచ్చింది
    నీవు పుట్టి నింటికి
    వాసిరెడ్డి పేరుకే సాహితీ మెరుగులు దిద్దింది
    వారి తప్ప రాశికోసం పరుగెత్తలేదు
    కసిగా సమాజంలోని కుళ్ళుని
    కడిగెయ్యాలను కున్నావు
    కలం చేతబట్టి
    కన్నీటి గాధలకు రూపకల్పన చేసి
    మనసు గారడీల తమాషాలు చూసి
    సమతకోసం పాకులాడావు
    మట్టి మనిషిలోని ఔన్నత్యాన్ని
    మహోన్నతంగా సృష్టించి
    శిఖరాగ్రంపైన నిలబెట్టావు
    ఒడుదుడుకుల నెదుర్కొని
    ఒంటరిపోరాటం చేసి
    కీర్తిశిఖరాల నధిష్టించావు
    రెండు పదులు దాటిన మనస్నేహం
    నిండుదనాన్ని సంతరించుకుంది
    కుండబద్దలు కొట్టినట్టు
    మాట్లాడే నీ నైజం
    నిర్మలమైన మనసుకు తార్కాణం
    మంచిని ప్రేమిస్తావు మనిషిగా
    చెడుకి ఝడవక శక్తివై విజృంభిస్తావు
    కొరడాతో కొట్టి కొట్టి తరిమెయ్యాలనిచూస్తావు
    పోరాడుతావు ఆరాటపడతావు
    పట్టుదల నీధ్యేయం
    విశ్వాసమే నీ ఆయుధం
    నిజాయితీతో నీదైన బాణీతో సాగిన
    నీరచనలే నీ ఆదర్శం
    రెండుమార్లు అకాడమీ బహుమతిని అందుకున్నావు
    ఉరితాడు నవల సుడిగుండంలో చిక్కుకుని
    కొట్టుమిట్టాడే అబలలకందరికీ
    ధైర్యాన్నిచ్చే అస్త్రం
    ఊపిరిపోసే ఉగ్గు
    నిండుగా నూరేళ్లు బతికి మెండుగా రచనలుచేసి
    దండిగా ఎన్నెన్నో బహుమతులు గెలిచి
    వర్ధిల్లాలని కోరుకుంటూ
    అందిస్తున్నానీ చిన్నికవిత
    'ఉరితాడు' నవలకి నీవీనాడు
    అక్షర నీరాజనాలందుకునేవేళ
    అర్పిస్తున్నాను ఆత్మీయంగా
    నాభావనా పుష్పాన్ని
    కలిసి సీతమ్మా
    కలంచేతి కర్రగా
    కలకాలం నిలబడు
    నవలా మణివై వెలుగొందు
     ('ఉరితాడు' నవలకి 2వసారి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా సిటీ సెట్రల్ లైబ్రరీలో వాసిరెడ్డి సీతాదేవి జరిగిన సన్మానసభలో చదివిన కవిత  - ఫిబ్రవరి '82).
            
* * *

 Previous Page Next Page