నీబాట నువ్వే వేసుకో
నాచిట్టి తల్లీ! నాగారాలవల్లీ!
పదేళ్లయినా నిండని నిన్ను
బయట ప్రపంచం దృష్టిలో పడకుండా
సృష్టిలోని అందాలను తనివితీరా చూడనీయకుండా
నీబాల్యాన్ని ఉండచుట్టిపడేసి
నిన్ను గాంధారినిచేసి కూర్చోబెట్టే
దౌర్భాగ్యపు స్థితిని ఏమనాలో తెలీదు
ఏపేరు పెట్టి పిలవాలో తెలీదు
బడికి పంపిస్తే పదేళ్ల పాపని పదిలంగా
తిరిగొస్తావన్న నమ్మకంలేదు
గుడికెళ్లినా అంతే
దేముడూరాయే కదా !
పొలంకెళితే నవ్వుతూ తిరిగొస్తావన్న ఆశలేదు
శవంగా మారిపోవచ్చు!
పూలు కొనడానికికెళితే నవ్వేపువ్వులా వున్న నిన్ను
ఏ పాపిష్ఠి చేతులో ఎత్తుకుపోయి నలిపిపారెయ్యొచ్చు
ఇంటికొచ్చిన బంధువే రాబందుగా మారి
కబళించుకు పోవచ్చు
నిర్ధాక్షిణ్యంగా చచ్చిన చేపలనో కోడిపెట్టలనో
రాళ్లనో రప్పలనో రవాణా చేసినట్టు
ఎక్కడికైనా నిన్ను అమ్మెయ్యొచ్చు
ఎక్కడని దాచిపెట్టను తల్లీనిన్ను
ఎన్నాళ్లని నాచీరకుచ్చెళ్లలో చుట్టి
నిన్ను దాచగలను ?
ఇంతటి విశాల ప్రపంచంలో నీకు
స్వేచ్చగా తిరిగేచోటే కరువయిందా
బతికే బరువైందా ?
బాధపడకు తల్లీ,
నాగారాల వల్లీ
ఏడుస్తూ కూర్చోకు ఖర్మఅని
నీ జోలికి వచ్చిన వాళ్ళని
జాలిపడక కొరికిపారేయ్
కుత్తుకలు కోసిపారెయ్
మనిషికన్న బండరాయినో
ఇనుపసుత్తినో నమ్ముకో
నీ బాటను నువ్వు వేసుకో
అమ్మగా నిన్నెప్పుడూ ఒకకంట
కనిపెడుతూనే వుంటాను
నీడలా నీ వెంటే వుంటాను !
* * *
నాగదికి రెండు కిటికీలు
నా గదికి రెండు కిటికీలున్నాయి - నా కళ్లలాగే
నా కళ్ళు రెండూ ఎప్పుడూ తెరిచే వుంటాయి. ఒక్క నిద్రలో తప్ప
ఈ ప్రపంచంలోని వింతలన్నీ చూస్తూనే వుంటాయి
కోరికలు నింపుకుంటూవుంటాయి
కానీ నాగది కిటికీలు మాత్రం
రెండూ ఒక్కసారే ఎప్పుడూ తెరుచుకోలేదు
ఓ కిటికీ గుండా
ఎన్నెన్ని దృశ్యాలో!
ఆరంతస్థుల నుంచి పదహారంతస్థుల వరకు
గగనానికి నిచ్చెనలు వేసినట్టు
మిలమిలా మెరిసిపోయే ఇంద్రభవనాలు
వెన్నెల రాత్రుల్లో తాజ్ మహల్ ని తలదన్నేలా
వందచందమామల వెలుగును పులుముకున్నట్టు మెరిసిపోతాయి
దివినుండి తారకల దిగివచ్చినట్టు
విద్యుత్ ద్దీపాలు వెలిగిపోతాయి
పండగేరానఖ్కర్లేదక్కడ
ప్రతీరోజు సందడే
పడవల్లాంటి పొడవాటి కార్లూ
దేవకన్యలా అలంకరించుకునే పడతులూ
నవనాగరికతకు ప్రతీకలైన యువకులూ
భూతలస్వర్గం అదృశ్యం
అక్కడి దృశ్యాన్ని ప్రసరిస్తుంది ఆ కిటికీ నా గదికి
మదినిండా నింపుతుంది ఆనందం నామదికి
మరో కిటికీ తెరిస్తే కనిపించే దృశ్యం
బతుకుకీ మెతుకుకీ మధ్య జరిగే పోరాటం
పొద్దుపొడిచినప్పటినుంచి పొద్దుకుంగేదాకా
కాలంతో గడిపే సమరం
బాధలని మరచిపోవడానికి తాగేవాడొకడు
మైకంలో తేలిపోవాలని తాగేవాడొకడు
బడాయిలు వారికి తెలీవు
బుకాయింపులు అసలే లేవు
పేలికలు చుట్టుకున్నా నవ్వులు
రేపటి ఆశల పువ్వులు
తియ్యని కోరికతో చందమామ వెలుగులో
నులకమంచం ఉయ్యాల్లో
ఊహల్లో తేలిపోయేజనం
పాలమనసులు వారివి
బాలమనసులు వారివి
దీపాల్లాంటి స్వచ్ఛమైన బతుకులు వాళ్లవి
పసిపాపల్లా దేనికో కొట్టుకుంటారు
అంతలోనే కలుసుకుంటారు
కమ్మగా పాడుకుంటారు
ఆడుకుంటారు
అక్కడ స్వచ్చమైన నూనెదీపాలుతప్ప
మెర్కురీ బల్బులు కనిపించవు
అందుకే ఆ కిటికీలోంచి ఏదీ
ప్రసరించదు నాగదికి
నా రెండు కిటికీలలో ఎంతతేడా
ఒకటి స్వచ్ఛతకు రూపమైతే
మరొకటి కృత్రిమానికి ప్రతిరూపం
అయినా నాకెందుకంత స్వార్ధం ?
విద్యుత్ కాంతులను నాగదిగుండా
అవతలి కిటికీలోంచి నేనైనా
ప్రసరింప చెయ్యుచ్చుగా !
స్వార్ధం ఈనాడు మనజన్మహక్కై నడిపిస్తోంది.
పెదవి విడిపడదు పలుకురాదు - నాగది కిటికీల్లాగే
* * *