దౌర్భాగ్యుడు ఛండాలంగా వాగుతున్నాడు!
"మిస్టర్ వెంకటప్పయ్య" తీక్షణంగా అంది భారతి.
"నా పేరు బోసుబాబు!"
"నీకేపేరైనా ఒప్పుతోంది. ఆఖరికి చింపాంజీ అన్నా బాగానే వుంటుంది చింపాంజీకి ఆపిల్స్ అంటే అంత యిష్టమా?" మెల్లగా అడిగింది.
"అవును. నీ దయపైన ఆధారపడ్డాను" అన్నాడు.
వెధవ సోడాబుడ్డి మొహం వీడూనూ వీడిపైన దయచూపాలట దయ.
ఇంటికి చాలా దగ్గర వరకూ వచ్చేసింది.
"నీ దగ్గర పెన్ నైఫ్ వుందా?" అడిగింది.
"దేనికి?" అడిగాడు.
"కోతిగుండె ఆరోగ్యానికి శ్రేష్టమని ఏదో పేపర్లో చదివాను. నువ్వు పెన్ నైఫ్ ఇస్తే ఆ కత్తితో నీ గుండెను కోసి ముక్కలు తరిగి ఈ వాడకట్టులో అందరికీ ప్రసాదం పంచాలి.
అంతేకాదు. మరోసారి పోకిరీ వేషాలు వేస్తే నిన్ను కటకటాలవెనక్కి పంపిస్తాను. టేక్ కేర్" అని విసవిస వెళ్ళిపోయింది భారతి.
బోసు నిటారుగా నిలబడ్డాడు. కోపంతో బుస్సుమని పాములా తల ఎగరేశాడు.
"ఆఫ్ట్రాల్ ఆడదానివి. నిన్ను లొంగదీసుకుని నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు లేకపోతే ఈ బోసుబాబు మొగాడెలా అవుతాడు?" అనుకున్నాడు.
కానీ అది అర్ధంలేని ప్రతిజ్ఞ అని అతనికి తెలీదు. భారతి లాంటి ఆడపిల్లతో పేచీ పెట్టుకుంటే అది ప్రాణంమీదకొస్తుందని అతనికా క్షణంలో ఏ మాత్రం తెలీదు.
10
'ఆడది మగాడితో సమానమా?' అన్న అంశంపైన ఇంటర్ యూనివర్శిటీ డిబెట్ కాంపిటేషన్స్ లో అవంతికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
వేదికపైన నిలబడి అపరశక్తిలా విజృంభించి ఆమె మాట్లాడుతుంటే సభ మొత్తం ఆశ్చర్యపోయింది.
ఆడది ఎందులో తక్కువని ప్రశ్నిస్తూనే ఆదినుంచి ఆడదానికి అటు సమాజం, ఇటు మగజాతి చేసిన అన్యాయాలని సోదాహరణంగా ఏకరువు పెట్టింది నిజానికి ఆడది మగాడి కన్నా మహోన్నతమైన స్థానంలోనే వుందని వాదించింది.
లాండ్ స్కేప్ గార్డెన్లో అవంతి చుట్టూ చేరాడు ఆమె ఫ్రెండ్స్.
శ్యామల అవంతి బుగ్గపైన ముద్దు పెట్టుకొని.
"మగాళ్ళని దూది ఏకినట్టు ఏకేశావు. నిజంగా నీకు నువ్వే సాటి" అంది.
"నిజమే. మన అవంతిని చూస్తుంటే ఆ సమయంలో ఝాన్సీరాణిలా అనిపించింది నాకు." అంది రమణి.
"ఆడదానికి తన శక్తి తనకి తెలీకుండా ఓ భ్రమలో వుంచేశారు. ఆడదాన్ని 'భారతనారి' అని 'భారత స్త్రీ' పరమసాధ్వి అని బిరుదులిచ్చేసి వాళ్ళను నోరు విప్పకుండా చేశారు.
ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతోనే గుండెల్లో దాచుకొని మూగగా ఏడుస్తూనే భరించే సహనం ఆడదానికి వుంది. కానీ, ఆడది నోరు తెరచి ప్రశ్నిస్తే ఈ సమాజంకానీ, మగజాతికానీ సమాధానం చెప్పలేదన్న సంగతి ఆడవాళ్ళకే తెలుసునని బాగా చెప్పావు!" అంది వేద.
అవంతి చిన్నగా నవ్వింది. ఓ గడ్డిపువ్వుని చేతిలోకి తెంపి అటూ ఇటూ ఆడిస్తూ అంది.
"ఏమో, ఆవేశంతో మాట్లాడానే కానీ, మన మాటలవల్ల ఎవరూ మారలేరు."
అయినా పుట్టినప్పటి నుంచీ ఆడదాన్ని సెంటిమెంటల్ ఫూల్ని చేసి ఉగ్గుపాలతోనే నేర్పిస్తారు. లేకపోతే దిక్కుమాలిన సనాతనా చారాలనీ, మూఢ విశ్వాసాలకి మనని బాధ్యుల్ని చేసినా ఎందుకు నోరెత్తలేకపోతున్నామో తెలుసా?
దానికొకటే కారణం వుంది.
ఆడది కట్టుకొన్న భర్తపైన ప్రేమని, అనురాగాన్నీ, కన్న పిల్లల పైన మమకారాన్ని పెంచుకుంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొనే ఆడదాన్ని తోలుబొమ్మని ఆడించినట్టు ఆడించగలుగుతున్నాడు మగాడు.
"అందుకే.... అందుకనే ఐ హేట్ మగాళ్ళు!" కింది పెదవిని మునిపంటిలో కొరుకుతూ అన్నది అవంతి.
"చాలా ప్రమాదకరమైన స్టేట్ మెంట్ ఇది" అంది కుసుమ.
"బాల్స్ హూ కేర్ ఫర్ ఇట్. మగాడికన్నా ఆడదానిదే పై చేయిగా నాకనిపిస్తుంది.
వేలకి వేలు పోసి మగాడ్ని మొగుడుగా కొంటుంది ఆడది. వాడితో సంసారానికి వెళ్ళడానికి గానూ సత్తుగిన్నె దగ్గర నుండి వాడు పడుకొనే మంచం వరకు ఆడదే తీసుకెళుతోంది. ఆడది వండి పెడితే తింటాడు వాడికి సుఖాన్ని ఆడది అందిస్తుంది. వాడి వంశాన్ని ఉద్దరించడానికి సంతతినీ ఆడదే ఇస్తుంది. ఇవన్నీ ఒకెత్తు వాడి పరువూ, మర్యాదా, కాపాడ్డం ఒకెత్తు. తెగించి వాడి బతుకుని నాలుగురోడ్ల దగ్గర పెట్టేస్తే ఉరిపోసుకుని చావకుండా వుండగలడా? లీవిట్.
నాకు మన వివాహ వ్యవస్థపట్ల కూడా నమ్మకం లేదు.
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని కట్టుకొన్న మొగాడిని నమ్మి వంటగదిలో మగ్గిపోతూ భర్త చెలాయించే అధికారాన్ని భరిస్తూ, కిటికీలోంచి బయటకి తొంగి చూసినా, పాలకుర్రాడితోనో, పేపర్ బాయ్ తోనో మాట్లాడితే అనుమానంగా చూసే మగరాయుళ్ళతో కలిసి బతికేకంటే ఏ నేరమో చేసి జైలు కెళ్ళడం మంచిదని నా అభిప్రాయం!" అంది అవంతి.
"అంటే అసలు మగాళ్ళ అవసరం మనకి లేదంటావా?" శ్యామల అడిగింది.
"ఆకలేస్తే తిండి తింటారు. అలాగే సెక్స్ కూడా. వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేసి కలిసి తిరగచ్చు. జస్ట్ లైక్ దట్..... వరకూ ఫరవాలేదు."
"నీ మాటలు వింటుంటే నా కేమనిపిస్తుందో తెలుసా?" అంది వేద.
"చెప్పు."
"నువ్వు పెద్ద వేదాంతివి అవుతావు లేకపోతే పిచ్చిదానివన్నా అయిపోతావు!"
"ధాంక్స్ ఎందుకో తెలుసా?"