Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 15


    నువ్వున్నట్టు వేదాంతినైతే ప్రశాంత జీవితాన్ని గడుపుతాను. పిచ్చిదాన్నయితే, ఎవరితోనూ నిమిత్తం లేకుండా ఆనందంగా ఈ జీవిత కాలాన్ని గడుపుతాను. అంతే కానీ, నా వరకు నేను మాత్రం జీవితంలో రాజీపడను. రాజీపడి బతకనూ లేను" అంది అవంతి.


    ఆ మాటలంటుండగా అవంతికి కడుపులో తిప్పినట్టయింది. ఏమిటో వికారంగానూ, తల తిరగడం మొదలైంది. అవంతి భళ్ళున వాంతి చేసుకొంది. స్నేహితురాళ్ళు నిర్ఘాంతపోయి చూస్తున్నారు.


    అవంతికి తన పరిస్థితి అర్థమైంది. ఒక్కొక్క స్నేహితురాలికేసి చూసింది. అదే మొదటిసారి అలా జరగడం. అందుకే ఆమె పాతాళంలోకి జారిపోతున్నట్టుగా భయపడింది.


    "ప్లీజ్ నన్ను గదికి తీసుకెళ్ళండి!" అంది దిగులుగా అవంతి.


    రమణి, కుసుమ, శ్యామల, వేద ఆమెని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న ఆటోలో ఆమెని ఎక్కించి వాళ్ళు ఎక్కారు.


    ఆమెకి ఊపిరి ఆడ్డంలేదు. రమణి భుజంపైన తలవాల్చింది అవంతి. ఆమె కళ్ళ నించి కన్నీరు జారుతోంది.    


                                         11


    మూడు రోజులైంది.


    అవంతిలో పూర్తిగా నిర్లిప్తత చోటు చేసుకుంది.


    'ఏమిటి? ఏం జరిగింద'ని అడగడానికి ఆమె స్నేహితురాళ్ళకెవరికీ దమ్ముల్లేవు.


    నిజానికి అవంతిని చూసేవాళ్ళు ధైర్యంగా వుంటారు.


    అలాంటి మనిషి పిచ్చిదానిలా, వెర్రిచూపులు చూస్తుంటే వాళ్ళకీ భయంగానూ వుంది.


    కానీ వాళ్ళకి జరిగిందేమిటో తెలుసు. తెలిసిన విషయాన్ని కదిపి ఆమె మనసు కించపరచగల చిన్న మనసూ వాళ్ళది కాదు.


    అవంతికి నెల తప్పింది.


    ఆమె గర్భవతి.


    కానీ ఎన్నోనెలో వాళ్ళకి తెలీదు.


    ఆమె తెలివైనది. నలుగురికి సలహాలివ్వగల చాతుర్యం ఆమెకున్నది. అలాంటి మనిషి అంత తెలివి తక్కువతనంగానూ, అజాగ్రత్తగానూ ఎలా ప్రవర్తించిందో అర్థంకావడంలేదు.


    మూడురోజులనించీ ఆమె కాలేజీకిపోవడం లేదు. హాస్టలు దాటలేదు.

    
    ఆలోచనలు ఎంత పదునుగా వున్నా ఓ దారికి రావడం లేదు.


    నెల తప్పినందుకు ఆమె బాధపడ్డంలేదు.


    నవమాసాలు మోసి బిడ్డని కనాలనే వుందామెకి.


    కానీ ప్రస్తుత పరిస్థితిలో అది సాధ్యంకాదు.


    అందుకే ఆమె బాధ పడుతోంది.


    ఇదే మరో సంవత్సరం తర్వాతో, రెండేళ్ళ తరవాతనో జరిగితే ఎంత సంతోషించేదో మరి!


    ఇప్పుడు మాత్రం!


    తనెవర్నీ లక్ష్యపెట్టకపోవచ్చు.


    అటు కుటుంబ సమస్య. మరోపక్క ఆర్థిక పరిస్థితి కొట్టొచ్చినట్టుగా పెనుభూతాల్లా కనిపిస్తున్నాయి.


    భవిష్యత్తుపైన ఆశ పెట్టుకొంది. పెరిగి ఓ స్టేటస్ లో నిలబడితే సరేమన్నా కేర్ చేయకపోవును.


    అబార్షన్ చేయించుకోక తప్పదు.


    కానీ అదెంత పాపం!


    మరెంత ఘోరం!!


    బిడ్డగా ఆకృతి దిద్దుకోడానికి కడుపున పడ్డ బీజాన్ని కనికరం లేకుండా చంపడం పరమ దారుణం.


    అయితే పరిష్కారం ఏమిటి?


    జవాబు దొరకడం లేదు.


    స్వార్థంతో ఇప్పుడు అబార్షన్ చేసుకోడం సులువే కావచ్చు. అదే తొమ్మిది నెలలూ మోసాక బిడ్డపుడితే అవతల పడేయగలదా?


    గుండెల్లో ఏదో అదృశ్యం హస్తం పెట్టి కెలికినట్టయింది.


    "అమ్మా" అని ఓ చిన్న పాప పిలిచినట్టయింది అవంతికి.


    "నన్నీలోకం లోకి రానీకూడదని ఆలోచిస్తున్నావా అమ్మా?" చిన్నారి చేతులతో, బోసి నోటితో ప్రశ్నిస్తున్నట్టుగా భ్రాంతి.


    మూడు రోజులుగా అదే టార్చర్. "ఎంత నరకం! ఛీ పాడు జీవితం" ఆనాడు రమణకి చాలా తేలికగా చెప్పింది.


    ఈనాడు స్వానుభవంలోకి వచ్చాకగానీ తెలిసిరాలేదు ఆమెకి.


    రమణి కూడా తనలాగే బాధ పడిందా? తనలా రియాక్ట్ కాగల ఆలోచనలు రమణికున్నాయా? ఆ పిల్ల మెదడు అంత ఎదిగిందా?


    ఓ పక్క నాలుగు నెలల్లో పరీక్షలు మరో పక్క జబ్బు తండ్రి.


    నల్లకోటులోనూ గౌనులోనూ, ఆ ముసలి తండ్రిలో దీపం ఆరిపోయేలోగా వెళ్ళి కనబడాలి. కనీసం ఆ తృప్తితో నన్నా ప్రశాంతంగా జీవుడు వెళ్ళిపోతుంది.


    అలా కాకుండా.....


    చచ్చే తండ్రి కోసం పుట్టబోయే శిశువుని తుంచేయడమా?


    ఆ శిశువు కోసం తన బంగారం భవిష్యత్తుని కూకటివేళ్ళతో పెంకలించడమా?


    ఏది ధర్మం!?


    ఇది ధర్మం ఎలా అవుతుంది.


    పరమ పాపం.


    నిజమే! ఇది పాపమే. అలాగని విద్యార్థినిగా చదువుకొనే తను, పెళ్ళి కాకుండా కడుపుతో తిరిగితే ఎంత హేళనకి గురిచేస్తారో తెలుసు.

 Previous Page Next Page