"షటప్, అమ్మాయితో మాట్లాడుతుంటే మధ్య నీ గొడవేమిటి. చీరలు తీసుకోమంది అమ్మాయిని, నిన్ను కాదు ఎందుకైనా మంచిది. నేను చెప్పి వెళతాను. ఆ వెంకటేశాన్నిలా పిలువు." అంది లలితాంబ.
డ్రైవర్ వెళ్లి శ్రీదేవిక్లాత్ స్టోర్స్ ప్రొప్రైటర్ మల్లయ్యగారి కొడుకు వెంకటేశాన్ని పిలుచుకొచ్చాడు. ఈ మధ్య మల్లయ్య తిరుమల హోటల్ ప్రారంభించి దాని వ్యవహారాన్ని చూసుకోవడంతో, బట్టల వ్యాపారాన్ని వెంకటేశం చూస్తున్నాడు. ఆ ప్రాంతంలో అది మంచి పేరుగల దుకాణం. కస్టమర్ల విషయంలో ఉదారంగానూ, గౌరవ మర్యాదలతో వినయంగా ఉంటారు కాబట్టి ఎక్కువమంది శ్రీదేవి షాపుకి వస్తారు.
వెంకటేశం "నమస్కారమమ్మా, దిగిలోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నారు. మామీద కాస్త దయ చూపండి" అన్నాడు నవ్వుతూ.
"దయ ఉండబట్టే ఇక్కడ కారాపింది. లేకపోతే అబిడ్స్ కో, కోఠీకో వెళ్ళేదాన్ని అద్సరే, అమ్మాయికి రెండు పాంట్లు, షర్టులూ, మరో రెండు చీరలు ఇచ్చి పంపు. దానికి పెద్దగా సెలక్షన్ తెలీదు. కాస్తలైట్ కలర్స్ చూసి ఇవ్వు, బిల్ దానికివ్వకు. నేనే వచ్చి పే చేస్తాను."
"అలాగే" అన్నాడు వెంకటేశం.
"ఎవరికేం చెప్పినా ఇంతే 'అలాగే' అంటారు గంగిరెద్దుల్లా. కానీ నాకు నచ్చవు. అందుకే అసలు నాకు నచ్చే పద్ధతులేలా వుండాలో తెలియాలనే ఈ అవకాశం అమ్మాయికిచ్చాను. అవునూ, ఏమిటీ మధ్య సినిమాల్లో వేషాలని తిరిగావట. మీ నాయన కనబడి ఒకటేగోల. బుద్ధిగా వ్యాపారం చూసుకో. వెధవ సినిమాలు కూడుపెట్టవు."
వెంకటేశం నవ్వి ఊరుకున్నాడు.
"డ్రైవర్ కారు పోనీ"
"అలాగే అమ్మా" కారు కదిలింది.
భారతి వూపిరి తీసుకొని నవ్వి "అబ్బవాన వెలిసినట్టు ఉంది" అంది.
"పదండమ్మా," అన్నాడు వెంకటేశం.
"చూశావా, ఇంత టైం వేస్ట్ చేసిందే తప్ప లోపలికి రాలేదు. మమ్మీ కారు దిగి ఉంటే ఈ పాటికి సెలక్షన్ కూడా అయిపోయేది. అమ్మకు తోచదు. ఎదుటి వాళ్ళకి తోచనివ్వదు" అంది భారతి షాపులో అడుగుపెడుతూ.
"అమ్మగారి పద్దతే అదికదా! చూడండి ఏంకావాలో మళ్ళీ నాకు మాట రాకూడదు" అన్నాడు.
భారతికి తానులు విప్పి చూపిస్తున్నాడు జకరయ్య.
రెండు పాంట్లు, రెండు షర్టులు తేలిగ్గానే సెలక్టు చేసుకోగలిగింది. చీరలే ఏం తీసుకోవాలో అర్థంకాక చూస్తోంది భారతి.
పక్కనే ఎవరో సకిలించినట్టుగా వినిపించింది. భారతి తల తిప్పి చూసింది.
బోసుబాబూ!
"దిక్కుమాలిన సన్నాసి ఇక్కడికెలా వచ్చాడబ్బా!" అనుకొంది.
ఆఫీసు అక్కడికి దగ్గరే కావడం చేత ఆ షాపులో తనని చూడ్డం చేతనూ వాడక్కడ గద్దలా వాలాడని భారతి గ్రహించింది.
"రండి ఇంజనీరుగారు" అన్నాడు వెంకటేశం, బోసుబాబు భారతి కేసి చూసి నవ్వాడు.
ఆ నవ్వు చూసిన భారతికి వళ్లు మండిపోయింది.
వెకిలినవ్వు డర్టీ ఫెలో!
చేస్తున్న ఉద్యోగానికైనా విలువలేకుండా వెధవ పనులు వాడూను అనుకుంది.
"ఏం కావాలి?" అడిగాడు బోసుని వెంకటేశం.
బోసు క్రీగంట భారతిని చూసి అన్నాడు.
"నాకు బోలెడన్ని బట్టలున్నాయి. పోనీ చీరలు కొందామంటే వంటరివాడిని, బ్రహ్మచారిని. చీరలు మాత్రం ఏం చేసుకోను?"
"దానికేముంది?" ముందు జాగ్రత్తగా ఇప్పటినుంచే నెలకోచీరె కొని దాస్తే వచ్చే ఆవిడ సంతోషిస్తుంది కదా!" అన్నాడు గుమస్తా జకరయ్య.
"ఐడియా మంచిదే కానీ చీరలు కొన్నాక నాకు, పాంట్లు, చొక్కాలేసుకునే అమ్మాయి పెళ్ళాంగా వస్తే ఏం చెయ్యాలి" అన్నాడు బోసుబాబు.
ఆ మాటలు తనని ఉద్దేశించి అంటున్నాడని భారతికి పూర్తిగా అర్థం అయినాయి.
"అప్పుడు నువ్వు కట్టుకోవచ్చుగా ఆ చీరలు" అంది కోపంగా.
ఆమె మాటలకి షాపులో అందరూ నవ్వేశారు.
"బారూ" అని పిలిచాడు బోసుబాబు.
ఆ పిలుపుకు ఆమె చెంపలు ఎర్రబడినాయి. కోపంతో ముక్కు పుటాలు ఎగిరిపడినాయి. చెప్పుతీసి బోసుగాడి చెంప పగలకొట్టాలనిపించింది కానీ అక్కడ వాడ్ని మాటలతోనే చంపాలనుకుంది.
"ఏం నాయనా వెంకటప్పయ్యా" అంది.
"అదేమిటి మీరు ఒకళ్ళుకొకళ్ళు తెలుసా!" అడిగాడు వెంకటేశం.
"బ్రహ్మాండంగా తెలుసు" అని మెల్లగా అన్నాడు.
"నీ తియ్యని గొంతుతో పిలిస్తే ఈ పేరు కూడా బాగానే ఉంది." అన్నాడు బోసుబాబు.
భారతి మూతి తిప్పుకొంది.
"వెంకటేష్, చీరలు మమ్మీ వచ్చి తీసుకొంటుంది. ఇవి పాక్ చేసివ్వు. బిల్ కూడా మమ్మీ పే చేస్తుంది" అని బోసుకేసి చూసింది.
"చీరల సెలక్షన్ నాకు తెలుసు. నీకు సరిపోయేవి ఎలా ఉండాలో మరీ తెలుసు 'ఊ' అంటే ఆ పని నేను మొదలుపెడతాను."
"వెంకటప్పయ్యగారు..... ఆదినారాయణలు సెలక్టు చేసే చీరలు ఈ భారతి కట్టదు. ఆఖరికి మా సర్వెంటు మెయిడ్ కూడా కట్టదు" అని పాకెట్ తీసుకొని విసురుగా బయటికి నడిచింది.
బోసుబాబుకూడా క్షణం ఆలస్యం చేయలేదు. బయటకొచ్చేశాడు. చీకటిపడి వీధి దీపాలతో కాంతిగా వుంది రోడ్డు. ఆ రోడ్డు చాలా బిజీగా ఉంటుందెప్పుడు అంచేత భారతి పక్కగా నడుస్తోంది. అయితే దివాంజీ దార్ నందు దగ్గిర కొచ్చేసరికి పక్కనే బోసుని చూసి కలవరపడింది. అతనేమి వెర్రివేశాలు వేసి ఇబ్బందిని కలిగించలేడని ఆమెకి తెలుసు. అయినా మనసులో ఏదో సందిగ్థమైన భావన.
సందు తిరగబోతుంటే పక్కనే ఉన్న పళ్ళదుకాణాన్ని చూస్తూ -
"నాకు ఆపిల్స్ అంటే ఇష్టం. ఇవ్వకూడదా?" అన్నాడు బోసు.