గొంతునెవరో పట్టి పీకుతున్నట్టుగా అనిపించింది అవంతికి. సన్న దగ్గుతెర వచ్చింది.
పరీక్షలు నాలుగు నెలలున్నాయి. ఆపైన మరో రెండు నెలలకి రిజల్ట్స్ వస్తాయి.
అదే ఆరునెలలు ఓపిక పట్టాడిల. తన ఊపిరిని పుస్తకాల కంకితం చేసి చదవాలి. ఈ ధ్యేయం ఇప్పటిదికాదు. నగరానికొచ్చి కాలేజీలో చేరినప్పుడే తీసుకొంది.
అయితే యూనివర్శిటీ చదువంటే ఆ ముసలి తండ్రికి తెలీదు. ఇంతమంది విద్యార్థుల మధ్య మసలాలంటే మంచి చీరలు, లంగాలు, జాకెట్లు, పాకెట్ మనీ, హాస్టల్ ఫీజు, కాలేజీ ఫీజులు...... ఇవన్నీ ఆ తండ్రి శక్తి మించినది. అందుకే అవసరానికి మనోహర్ లాంటి వాళ్ళని ఆశ్రయించి దారి తప్పింది. అది అవసరానికే తప్ప అలవాటుగా మాత్రం అవంతిచేయలేదు. కానీ ఆడదిగా తనుండవలసిన హద్దును దాటిన సంగతి తండ్రికి తెలిస్తే ఆ గుండె ఇప్పుడే ఆగిపోతుంది. పెళ్ళి అనేమాట పట్ల ఆమె విముఖత గలది. వివాహ వ్యవస్థపట్ల నమ్మకం లేని మనిషి అవంతి.
శ్యామలా, కుసుమ వచ్చారు.
అవంతిని చూసి శ్యామల అడిగింది.
"అదేం అలా వున్నావు?"
ఆ ప్రశ్నకి అవంతికి మరింత దిగులు కలిగింది.
కళ్ళలో నీరు గిర్రున తిరిగింది.
"మా నాన్నకి ఒంట్లో బాగోలేదు. నాకున్న ఒకే ఒక బంధం. నా మనిషి అని చెప్పుకునే ఒకే ఒక నేస్తం నా తండ్రి. ఆయన నాకు దూరమైతే ఈ ప్రపంచంలో ఒంటరిగా ఎలా నిలబడాలా అని భయం వేస్తోంది.
అవంతి గొంతు ఆ మాటలంటున్నప్పుడు జీరగా పలికింది.
"మాకు ధైర్యం చెప్పవలసిన దానివి. నువ్వే ఇలా అయితే మా గతేం కాను?" అంది కుసుమ.
"మీకు నా అనే మనుషులున్నారు. కానీ నాకు ధైర్యం చెప్పేదెవరు? ఓదార్చే వాళ్ళెవరు?" నిస్పృహతో అన్నది అవంతి.
"ఈ ప్రపంచాన్ని ఎదిరించి నిలబడగల ధైర్యం, శక్తి నీలో వున్నాయి నీ శక్తి నీకు తెలీడంలేదు" అంది కుసుమ.
కుసుమ మాటలకి వెర్రిదానిలా నవ్వింది అవంతి.
'మీరనుకునేంత గొప్పదాన్ని కాదు నేను. నా గురించి ఒకళ్ళు జాలిపడడం నేను సహించలేను. చదువుకోసం ఈ వూరొచ్చాను. ఈ చదువు కోసం దారి తప్పాను. ఎందుకో తెలుసా? ఇంటిపట్టునే వున్నా నాన్న నాకు పెళ్ళిచేసి ఓ ఇంటిదాన్ని చేస్తాడన్న నమ్మకం లేదు. కారణం ఆయనకా శక్తి లేదు. రేపు ఆయనపోతే ఈ చదువుకూడా లేకపోతే నా భవిష్యత్తు సంగతేమిటి? అది ఆలోచించే ఈ చదువుకోసం నా అవసరాల కోసం నా శీలాన్ని పోగొట్టుకున్నాను. అందుకు నేను బాధపడటంలేదు. కారణం మడికట్టుకొని కూర్చున్నా నా కోసం ఏ పెళ్ళికొడుకుగాడూ బేవార్స్ గా రాడు. కనీసం ఈ వయసులో చదువుకోగలిగితే నా బతుకు నేను బతగ్గలననుకొన్నాను" అంది అవంతి.
రమణి ఓదార్పుగా అంది అవంతితో.
ఇప్పుడు మనం ఏమనుకొనీ లాభంలేదు. జరగబోయే దాన్ని తలచుకొని భయపడనూ కూడదు. టేకిట్ ఈజీ'
అవంతి కన్నీరు తుడుచుకొంది. "ఏమే శ్యామలా, ఏమంటున్నాడు నీ ఫ్రెండ్ సురేష్!" అంది.
"వాళ్ళ డాడీ మినిష్టరవుతాడట"
"ఇది పాత పాటేగా!"
"తనతో నాగార్జునసాగర్ రమ్మంటున్నాడు"
"నువ్వేమన్నావు?" భృకుటి ముడివేసి అడిగింది.
"నవ్వేసి వూరుకొన్నాను. ఇక అతన్ని కట్ చేస్తాను. ఇక అతనితో మూవ్ కాను." అంది శ్యామల.
"దట్స్ గుడ్. మరి నువ్వు!" కుసుమని అడిగింది.
"ఆనంద్ నన్ను ప్రేమిస్తున్నాడట."
"నమ్మావా నెలతప్పుతుంది." అంది అవంతి నవ్వుతూ.
"వాడినా, వాళ్ళ నాన్న వెంకోజీ పేరంటేనే వందమైళ్ళు పారిపోతాడు. నమ్మితే నువ్వన్నది ఖాయం." అంది నవ్వుతూ కుసుమ.
"మరేం చేశావ్?"
"గదికి రమ్మని చంపేస్తున్నాడు. వాడు నా అడ్రసు మరచిపోయేలా చేయాలని అనుకొంటున్నాను" అంది కుసుమ.
అవంతి వాళ్ళకేసి వెర్రిదానిలా చూసింది.
"మీరు చాలా తెలివైన వాళ్లే. ఆ మాత్రం తెలివి నాకు లేకపోయింది. నేను నిజంగా ఫూల్ ని" అంది అవంతి దిగులుగా.
ఆమె ఫ్రెండ్స్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఎవరికి ఏం మాట్లాడాలో తోచలేదు.
ఆ గదిలో పూర్తిగా నిర్లిప్తత చోటు చేసుకొంది.
శ్రీదేవి క్లాత్ స్టోర్స్ ముందు అంబాసిడర్ ఆగింది.
కార్ బాక్ డోర్ తెరుచుకొని అందులోంచి భారతి కిందికి దిగింది.
లోపల సీటులో పక్కకి జరిగి విండోలోంచి బయటకి చూస్తూ -
"సెలక్షన్ కాస్త జాగ్రత్తగా చేసుకో. అసలే పిచ్చి మొహనివి. నా కవతల పనిలేకపోతే నేనే వచ్చేదాన్ని. నాకు అవతల అయిదు నిమిషాలు కూడా టైం లేదు. ఏం చేయను" అంది లలితాంబ.
"అలాగే మమ్మీ." అంది భారతి నవ్వుతూ.
"అలాగే అంటే కాదు. నువ్వు తెచ్చే బట్టలు చూడగానే నాకు నచ్చేలా ఉండాలి. లైట్ కలర్స్ కొనుక్కో. తెలిసిందా? నీ పనవగానే ఇంటికెళ్ళి భోజనం చేసి చదువుకో."
"ఓ.కే మమ్మీ."
"ఏం ఓ.కె.నో, నిన్ను నమ్మి వెళ్ళాలంటే నాకసలు మనసొప్పడం లేదు. కానీ తప్పదు.
అవతల కలెక్టరుగారి భార్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. డ్రైవర్......." అని పెదవి విరిచింది మధ్యలో లలితాంబ.
"అమ్మా" అన్నాడు డ్రైవర్.
"అన్నట్లు అన్నీ పాంట్లు, చొక్కాలేం చేసుకొంటావు. రెండు చీరలు కూడా తీసుకో." అంది లలితాంబ.
"చీరలు నేనేం చేసుకోనమ్మా" అన్నాడు డ్రైవర్.