ఇప్పుడే తెలిసింది...
అబలవూ ఆడపిల్లవూ అంటూ
అందరూ నిన్ను అలుసుగా చూసేవాళ్లే
పుట్టగానే పురిటి ఖర్చులూ
పెరుగుతుంటే పెళ్ళి ఖర్చులూ
నీకు పెట్టే ప్రతీ పైసా
దండగని ఊహించుకుంటూ
నిన్ను కనడం ఖర్మంటూ
నీ తమ్ముడికోసం కలలు కంటూ
నిన్ను ఆరడిపెడుతూ వుంటే
నోరు విప్పని నన్ను చూస్తే
నాకే సిగ్గేస్తోంది
నవనాగరికత నన్ను చూసి నవ్వుతోంది!
చిట్టిపాపగా గంపెడు ఆశలు కళ్ళనిండా నింపుకుని
అమ్మవెంట నీడలా తిరుగుతూ
వంట ఇంటిలో సాయంచేస్తూ
మాడిన గిన్నెల్నీ మసిబారిన గిన్నెల్నీ
గరగరలాడేమట్టితో తోమితోమి
రక్తం పేరుకు అరిచేతులు మండిపోతే
మండే చేత్తో మాడే కడుపుతో
అందరు తినగా మిగిలిన మెతుకులు గతికి
బండెడు చాకిరి ఒంటిగ చేస్తూ
అలుపు తెలియని అమాయకతతో
బాల్యమంతా గడిపేనిన్ను
ఆదుకోలేని నన్ను చూస్తే
ఒళ్ళుమండుతోంది నాకే
నా డిగ్రీలు నన్ను చూసి
విరగబడి నవ్వుతున్నాయి!
పెళ్ళి పెళ్ళని ప్రేరేపించి
లేనిపోని ఆశలు రేపి
చదువుకాస్తా మాన్పించేసి
అడిగినంతా అతనికే ఇచ్చి
గుండెబరువు తీరిందంటూ
సంబరపడే నీ వారిని చూస్తూ
'ఇక ఆయిల్లే నీ స్వర్గం
అతడే నీ ప్రభువు' అంటూ
నీతులు చెబుతూ నిను పంపిస్తుంటే
కళ్ళ నీళ్ళు దాచుకుంటూ
కన్నవారిని ఒదులుకుంటూ
బిక్కుబిక్కుమని నువు వెళుతూవుంటే
నీవ్యక్తిత్వం నిలబెట్టి మాటలు
మచ్చుకైనా చెప్పని నన్ను చూసి
నా పేరు ప్రతిష్ఠలు పగలబడినవ్వాయి
జాలిగా చూశాయి!
నాలో రగిలిన కోపం
జ్వాలై కళ్లల్లో నిప్పులు చెరిగింది
కరిగిపోయి మరిగిపోయిన కన్నీరు
చెంపలపై జారింది
పెదవులు విడివడ్డాయి
పిడికిళ్లు బిగుసుకున్నాయి
అప్పుడే తెలుసుకున్నాను
నాలోని సబలత్వం సజీవంగానే నిలిచివుందని
నావ్యక్తిత్వం నన్ను మనిషిగా నిలబెట్టిందని
అడుగుముందుకు వేశాను!
నా అనుభూతిని అందరితో పంచుకోవాలని
ఆడది అబలకాదని అందరికి చాటించాలని
అడుగు ముందుకు వేశాను.
* * *
ఏమో!
మానవుడా! మానవత్వాన్ని గుండెనిండా నింపుకుని
దైవత్వం పొందిన సాధువులా జీవనాన్ని సాగించే
మహామహుడా! జీవనయానంలో అలుపెరుగని ప్రయాణికుడా!
ఎందుకిలా దానవుడిలా మారిపోయావ్?
తాచుపాములా బుసలు కొడుతూ స్వార్ధాన్ని నరనరంలో నింపుకుని
విషప్పురుగులా మసులుతున్నావ్
ఏమైంది నీ సౌందర్యారాధన
కవితలో కథలలో చిరుగాలిలో చిన్నవాన చినుకులో
వెలుగులో, వేడిలో, నీలిమబ్బులో, మెరుపుతీగెలో
పువ్వులో, నవ్వులో, రాతిలో, నీటిలో
అందాలను చేసి ఆరాధించేవాడా
ఎందుకిలా మారిపోయావ్ ?
చెట్టుకొమ్మలూ చెరువుగట్లూ
ఆకాశంలోని చుక్కలూ ఆత్మను స్పందింపజేసే అలలూ
అన్నీనీకు పరిశోధనాంశాలే!
ఇంద్రధనస్సూ ఇంద్రియాశక్తీ అన్నీ నీకు
ఆలోచనల రేకెత్తించి పులకరింపజేసే అంశాలే
అవన్నీ ఒదిలి ఎందుకిలా మారిపోయావ్
నేలతల్లి గొంతునురక్తంతో తడుపుతున్నావు
కత్తులతో కుత్తుకలు కోస్తున్నావు
బాంబులతో భస్మంచేస్తున్నావు
తోటిమనిషిని తోడేలువై పీకుతున్నావు
మానవుడా ! నువ్వు మారాలి !
స్వార్ధానికి కోరలు పీకి పారెయ్యాలి
మానవత్వానికి మమతల పన్నీరుజల్లి
మంగళహారతులివ్వాలి
అప్పుడే ఈ భూమి మళ్ళీ పుణ్యభూమిగా మారుతుంది.
సకల శాస్త్రాల వేదవల్లిగా మిగులుతుంది
అలా జరుగుతుందంటావా మానవుడా
సమానత్వం సౌభాతృత్వం మళ్లీ చిగురిస్తుందంటావా?
* * *