వినరా...వినరా...తెలుగోడా...!
అందుకో కాలాన్ని
తెలుసుకో గతకాలపు వైభవాన్ని
వేసుకో భావికి బాటలు
బంగరు పీటలు -
ఎన్నున్నా ఏమున్నా
నీ ఖ్యాతిని పెంచుకో
నీ జాతిని నిలబెట్టే
నీ సంస్కృతిని నిలుపుకో
నీ దేశం నీ తల్లి
నీ భాగ్యం నీజన్మే
మరువకు ఈ సత్యం
రత్నగర్భ నీదేశం -
ఈ రొదలూ ఈ సెగలూ
ఎప్పుడూ వుండవు
రాగాలూ ద్వేషాలూ
కలకాలం నిలవవు
కన్నతల్లి కన్నీళ్లు
కాలువలై పారకముందే
జన్మభూమి దిక్కులేక పగుళ్లతో
బీటలు బారకముందే
పరాయి దేశపు బడాయి నీలో
పూర్తిగా ఇమడకముందే
ఎగురవెయ్ నీ జాతి జెండా
నింపుకో ఔనత్యం నీ గుండెనిండా
* * *
ఆశావాది!
పిచ్చి కెరటం పరుగెడుతుంది
కొండలకు ఢీకొట్టుకుంటూ
ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా
లెక్కజెయ్యక ప్రయాణం ఆపుకోక
ఒడ్డు చేరుకోవాలన్న ఆశతప్ప
అలుపుతెలీని కష్టజీవి కెరటం
వెన్నెలను చూస్తూ వెర్రెత్తినట్టు
మరీ పరుగెడుతుంది వేగాన్ని పెంచుతూ కెరటం
ఆనందంతో నురగలు కక్కుతూ!
చీకటి రాత్రిలో నిశిని చూసి
ఉన్మాదినిలా ఉరకలు వేస్తుంది కెరటం
కడలి గుండెను చీల్చుకుంటూ
పరుగులు తీస్తుంది ఆవేశంతో
జీవితంలో దగాపడ్డ ఆడదానిలా!
ఏమైనా సరే ఆపదు దాని ప్రయాణం
సాగుతూనే వుంటుంది అహర్నిశం
ఆశావాదానికి ప్రతీక సముద్ర కెరటం !
* * *
నా నీడవే అయినా...
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు
కనుమూసి కలనైన తేలిపోనివ్వు...
ఉరుకు పరుగుల బతుకుబాటన అలసిపోయిన నన్ను
అలుపు తీరేదాక హాయిగా కాస్సేపు నిదుర పోనివ్వు...
మేలుకొలుపకు నన్ను మేలుకొలుపకు నువ్వు...
కనుముందు జరిగేటి కటిక ఘోరాలెన్నొ కనలేని నా కళ్ళు
నిదుర వాకిట్లో నిండు చీకట్లో మైమరచి క్షణమైన మరచిపోనివ్వు
మేలుకొలుపకు నన్ను మేలుకొలుపకు నువ్వు...
ఎదనిండ బెంగలు ఎండిపోయిన ఆశలు
దండగ బతుకని బెంబేలు పడువేళ
ఒడలు తెలియని నిదురలో బెడదలే నిహాయిలో
స్వేచ్చాగీతం పాడుకోనివ్వు మనసంతా వసంతాన్ని నింపుకోనివ్వు
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు...
గతకాలపు జ్ఞాపకాలను నెమరవేసుకునే వేళ
వడలిపోయిన చైత్రశోభల దివ్యకాంతులు వెతుక్కునే వేళ
ఊహకందని భవిష్యత్తుని గమ్మత్తుగా ఊహించుకోనివ్వు
మేలుకొలుపకు నన్ను మేలు కొలుపకు నువ్వు...
నా నీడవైనా నీకు నమస్కరిస్తాను
నీ పాదాల మీద పడి నీకు మొక్కుతాను !
* * *
ముగ్గురమ్మల మూలపుటమ్మ
నవమాసాలు మోసి ఎంతో ప్రయాసకోర్చి
జన్మనిస్తుంది కన్నతల్లి
పొత్తిళ్లలోపొదివి పట్టుకుని గుండెలకి హత్తుకుంటూ
స్తన్యమిచ్చి పెంచుతుంది తన బలాన్ని క్షీరధారగా మార్చి
గోరుముద్దలు తినిపిస్తుంది చందమామని చూపిస్తూ
పలుకనేర్పుతుంది అమ్మ ఆడిస్తూ లాలిస్తూ
ప్రాణానికి ప్రాణంగా కవచంగా నిలుస్తుంది
బుజ్జి బుజ్జి కబుర్లకి పదునుబెట్టి పాఠాలు నేర్పుతుంది పంతులమ్మై
మెదడుకు సానబట్టి తన మెదడులోవన్ని నీకు సరఫరా చేస్తుంది
తన పాండిత్య ప్రతిభను నీకు పంచుతుంది
అమ్మ నేర్పిన నడకకీ నడతకీ మరింత వన్నె తెస్తుంది
అమ్మ తరువాత అమ్మ అంతటిది పంతులమ్మ
అలా అంటే ఏమాత్రం అతిశయోక్తికాదు.
మరో అమ్మ కూడా వుంది -మూడో అమ్మ
ప్రతి మనిషికీ ఎప్పుడో అప్పుడు తగులుతుంది
తెల్లటి దుస్తుల్లో పాలరాతి బొమ్మలా వుంటుంది
మనసును కూడా తెల్లగా వుంచుకుంటూ
మలినాన్ని ఏరిపారేస్తుంది
ఆపదలో ప్రాణ రక్షణకు వెళ్ళిన వారికి
సపర్యలు చేసి కొత్త ఊపిరి పోస్తుంది
చిరునవ్వుతో బాధని తొలగించి ఉపశమనం కలిగిస్తుంది
పదునైన సూదిని మృదువైన మాటలతో నరాలకు గుచ్చి
నవ్వుతూ ఊరడిస్తుంది
ఆ అమ్మే నర్సూ ప్లస్ అమ్మ...నర్సమ్మ!
ఈ ముగ్గురమ్మలూ జీవనానికి ఆరోప్రాణం
ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ
కనిపించని కర్పూరపు బొమ్మ
మనసున్న మనిషికే పలికే వరాలకొమ్మ
ఆమె పేరు మానవత్వం ఆమె ఊరు మంచితనం
ఎక్కడో అంతరాంతరాల్లో ఏదో ఒకమూల
ఇసుమంత స్థలముంటే ఇమిడిపోతుంది
గుండెలోపలి మమతనీమనసు తెలిసిన మనిషినీ
అయస్కాంతంలా పసిగట్టి గబుక్కున లాగేసుకుంటుంది
ముగ్గురమ్మలకి మూలపుటమ్మ ఈ అమ్మ
మనుగడకి మూలస్తంభం ఈ బొమ్మ !
* * *