"అవును ! నా శీలానికి సంబంధించిన విషయం"
"అంత సీరియస్ గా తీసుకోకండమ్మా!"
"నో! మేం పోలీస్ కంప్లయింట్ యిస్తాం. ఆతడు అపాలజీ చెప్పాలి."
"పోనీ అతనెవరో మీరయినా చెప్పండి" అని బ్రతిమాలుకున్నాడు. మేనేజర్! లేడీస్ బెటాలియన్ చేస్తున్న దేమిటో తమాషా చూస్తున్నావారిలా కొందరికి అర్ధమయింది.
జయసింహ గ్రహించాడు. ప్రియాంక వారందరికీ నాయకత్వం నడుపుతోంది. ఏదో ఒక కోరిక మనసులో ఉంచుకుని మెతక రకం మేనేజర్ మీద దాడి చేస్తున్నారు.
"మీరే తేల్చుకోండి" అని మేనేజర్ అనగలిగితే సమస్య క్షణాల మీద తేలిపోతుంది. కాని ఆ సాహసం అతనికి లేదు.
"థాంక్యూ సార్! థాంక్యూ వెరీ మచ్! యూ ఆర్ గ్రేట్!"
"షటప్! మేనేజర్ వస్తున్నారు"
మేనేజర్ తిరిగి గదిలోకి కాలు పెట్టె సమయానికి యిద్దరూ చాల గంభీరంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు.
"ఈ ప్రాబ్లం తెల్చేయండి సార్! అవతల చాలా పనులున్నాయి. క్రొత్త రిలీజ్ పిక్చర్ ! జనం వేల సంఖ్యలో వచ్చారు. కంట్రోల్ చేయటం చాల కష్టంగా వుంది"
"కేసుని కంట్రోల్ రూం దాకా పోనివ్వటం మంచిది కాదు"
"అనే నేనూ అనుకుంటున్నాను. మీరే ఏదైనా రాజీ చెప్పండి"
"ఈ కాలం ఆడపిల్లల అభిరుచులు మీకు తెలియవా?"
"అంటే మీ అభిప్రాయం!" మేనేజర్ నొసలు చిట్లించాడు.
"బయటికి రండి చెప్తాను" ఇద్దరూ లేచి వరండాలోకి వచ్చారు.
"ఈ గొడవ మూలంగా ఫ్రెండ్స్ సినిమా చూడలేకపోయారు"
"అయితే ఆ అమ్మాయికి కంప్లిమేటరీ యిస్తా! మళ్ళీ చూడమనండి......."
"ఇందాక వచ్చాక అ అమ్మాయి ఒక్కర్తే వెళ్ళదు.
"అయితే ఏం చెయ్యాలి"
"అందర్నీ పంపాలి"
"అమ్మో! చాలా మంది ఉన్నారు కదా!"
"ఇరవై మంది"
"నా జేబులో డబ్బెట్టుకుంటాను. ఇంతటితో ఈ గొడవ వదిలెయ్యండి సార్! మీ చేతులు పట్టుకుంటాను."
"అలాగే!" ఇద్దరూ లోపలి కొచ్చారు.
"మీరూ అందరూ సినిమాకి పోవచ్చు. ఇరవై టికెట్స్ మేనేజర్ యిస్తారు. తీసుకుని వెళ్ళండి."
"ఈ తీర్మానానికి నేను ఒప్పుకోను" అంది ప్రియాంక.
జయసింహ ఉలికి పడ్డాడు. అనుకున్న ప్రకారం తీర్మానం చేయిస్తే ఒప్పుకోనంటుందేమిటి?
"మొత్తం అంతా గల్లంతు చేస్తే కాని బుద్దిరాదులా ఉంది?"
"మరింకా ఏం కావాలి?" అన్నాడు సీరియస్ గా! సర్కిల్ తన పక్షం వహించి ఆమెతో కరుకుగా మాట్లాడేసరికి మేనేజర్ చాలా సంబరపడిపోయాడు.
"మాకు యిరవై టికెట్లు చాలవు. ఇరవై ఒకటి కావాలి" అందామె.
మేనేజర్ ఈ రాజీకి ఒప్పుకున్నాడు. చిన్న అడ్జెస్ట్ మెంట్ కదా!"
వెంటనే టికెట్స్ తెప్పించి యిచ్చాడు.
మనీషా ఒక నూరు రూపాయల నోటు , ఒక అయిదు రూపాయల నోటు అందించింది.
"డబ్బెందుకు ?" అన్నాడు మేనేజర్ ఆశ్చర్యంగా!
"తీసుకోండి సార్! మీరు పిల్లలు కలవారు. సారీ ఫర్ ది ట్రబుల్ ! మేము ఈ హీరోయిన్ అభిమాన సంఘం!" అంటూ జయసింహతో కలిసి బయటకు నడిచిందామే!
మేనేజర్ ముఖం ప్రశ్నార్ధకంగా అయింది. అయినా పోయిందనుకున్న డబ్బు రావటంతో సంతోషించి తన పనిలో తల దూర్చాడు.
ఆడపిల్లల బృందం టికెట్స్ చూచి కెరటంలా లేచింది. వారిలో వై=ఉత్సాహం పెల్లుబుకుతోంది.
"కధ సుఖాంతమయింది కదా! నేను వెళ్లొస్తాను"
"యువర్ గుడ్ నేమ్ ప్లీజ్!"
"జయసింహ! అన్ ఎంప్లాయిడ్ జయసింహ!" నవ్వాడు.
"మీరు కూడా పిక్చర్ కి రావాలి.
"సారీ! నా దగ్గర డబ్బు లేదు. అయాం సో పూర్!" అన్నాడు తలొంచుకుని ముందుకు నడుస్తూ.
ఈ సమాధానం విని ఆమె కళ్ళ నించి నీరు చిమ్మింది. అతను ఎంత తెలివయిన వాడో, ఎంత చురుకయినవాడో అంతకన్నా ఎక్కువ నిజాయితీ పరుడు. ముక్కు సూటిగా నిజం చెప్పేశాడు.
పేదరికం ప్రతిభకి ఒక శాపమా? చలించి పోయిందామే.
"క్షమించండి . మేము వచ్చింది యిరవైమంది. ఇరవై ఒకటి కావాలంది మీ కోసమే!" అంది బ్రతిమాలుతున్న స్వరంతో.
"సారీ! నేను రాలేను.
"ఘోరావ్ చేస్తాం. మాకు యింత సాయం చేసి మీరు రానప్పుడు ఈ సినిమా మేము మాత్రం ఎందుకు చూడాలి!' టికెట్స్ ని చించి పారేయబోతున్నట్లుగా పట్టుకుంది రెండు చేతులతో.
"నో! అలా చేయకండి! నేను కూడ మీతో పాటుగా వస్తాను" అన్నాడు.
ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్లు అందరూ థియేటర్ లోకి వచ్చారు.
ఒక "రో" మొత్తం అక్రమించేశారు.
చిత్రంలో హీరోయిన్ పడుతున్న కష్టాలు అందర్నీ కదిలిస్తున్నాయి. కధలో మనసు విలీనం చేసిన వాళ్ళు అయ్యో పాపం అంటున్నారు.
కొంతమంది మధ్య ప్రక్కవాళ్ళు గమనించకుండా కళ్ళు తుడుచుకుంటున్నారు. ఆడవాళ్ళ పైట కొంగులు తడిసిపోతున్నాయి.
హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తోంది తెరమీద.
సరీగ్గా అదే సమయానికి తలత్రిప్పి చూచాడు జయసింహ.
అప్పటికే ప్రియాంక రెండు సార్లు కన్నులు తుడుచుకుంది . ఈసారి ముక్కు ఎగబీలుస్తోంది . కనురెప్పలు తడిసి వున్నాయి.
"ఏమయింది ప్రియాంకా!"
"హీరోయిన్ కష్టాలు చూస్తే నేను చలించిపోతాను. అది నా వీక్ నెస్."
"మీరు చూపించిన దైర్య సాహసాలు కేవలం నటనే అన్నమాట. ప్చ్! ఒట్టి నేతిబీరకాయి" అన్నాడు.
ఆమె కన్నులు తుడుచుకుని కిలకిలా నవ్వింది.
మళ్ళీ సినిమా చూడటంలో మునిగిపోయారు. క్లయిమాక్స్ వచ్చింది.
హీరోయిన్ హీరో కోసం మనుషులెవరూ చేయలేని చాల అసహజమయిన త్యాగం చేసి చనిపోయింది.
చనిపోతూ "ది సీజ్ మెన్స్ వరల్డ్ యూ నో!" అంది. ఆ తరువాత రెప్పలు వాల్చింది. హీరో చిన్నపిల్లాడల్లె ఏడ్చాడు.
ఆయుధాలతో వచ్చిన పదిమంది గుండాలని చెమట పట్టకుండా క్రాఫ్ చెరగకుండా పిండి కొట్టిన హీరో వెక్కిళ్ళు పెడుతున్నాడు.
ఆమె శవాన్ని ముత్తయిదులు కుర్చీలో కూర్చోబెట్టారు. హీరో చేత నీళ్ళు పోయించారు. ముఖానికి పసుపు రాయించారు. తలలో పూలు పెట్టించారు. శవం కాళ్ళకి పారాణి కూడా పూయించారు.
ఆ దృశ్యం చూస్తూ ఆడిటోరియం వెక్కిళ్ళ తో నిండిపోయింది.
మళ్ళీ తలత్రిప్పి చూచాడు జయసింహ.
ప్రియాంక పరిస్థితి దారుణంగా ఉంది. కళ్ళ వెంట నీరు కారి అందాల చెక్కిళ్ళు తడిసి పోతున్నాయి.
అందమయిన ముక్కు చివర ఎర్రగా కందిపోయింది.
వెక్కిళ్ళు పెడుతోంది. ఏడుస్తోంది.
"ఏమిటిది? ఇలాంటి వాళ్ళు అసలు సినిమాకి ఎందుకు రావాలి .ఆడవాళ్ళకి ఏడవటంలో కూడా ఓ అనందం ఉంటుందనుకుంటాను అంటూ రుమాలు అందించాడు జయసింహ.