ఎవరి మీద అనుమానం?
ఎంత నష్టం జరిగింది?
ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వారికి తోచిన సమాధానాలు చెప్పి ఎలాగో బయటపడ్డాడు పురుషోత్తం.
అనుభవం కల సీనియర్ అధికారి సలహాలు తీసుకునేందుకు అయన వెంట బయల్దేరాడు . ఇద్దరూ కాంప్లెక్స్ ఆవరణలోకి వచ్చారు. పైకి వెళ్ళి చూచి వచ్చారు.
"లాకర్స్ లోకి బాంబు ఎలా వచ్చిందన్నదే ప్రధానమయిన ప్రశ్న."
"మీ గార్డు ఎక్కడ?" అని అడిగాడు సీనియరు అధికారి.
"క్రొత్త భవనంలో ఉన్న గార్డుకి కబురు పెట్టాడు పురుషోత్తం. అయిదు నిమిషాల అనంతరం ఓ యువకుడు వచ్చాడు.
"నీవేనా గార్డూ?" సీనియర్ అధికారి ప్రశ్నించాడు.
"కాదు సర్! నా పేరు జయసింహ?"
'అయితే మమ్మల్నేం చేయమంటావు?" పురుషోత్తం.
"నాది ఎనబైఎనిమిదో నంబరు లాకరు! దాన్లో ఒక ముఖ్యమయిన ........."
"ముఖ్యమయినవి కాకపోతే ఎవరూ లాకరు తీసుకోరు. ఆలోచిస్తున్నాం. రెండు రోజుల తరువాత కలవండి" జయసింహ నిరుత్సాహంతో కృంగిపోయాడు.
4
"హలో సార్! ఆగండాగండి! ఏం జరిగిందక్కడ? ఎందుకు పరుగులు తీస్తున్నారు? హలో సార మిమ్మల్నే!"
"అదేమోసార్ , నాకూ తెలియదు " మళ్ళీ ఉడాయిస్తున్నాడు.
"ఆగండాగండి! మరి మీరెండుకు పరుగెడుతున్నారు సార్?"
"అంతా పరుగెడుతున్నారు ! నేనూ పరుగుతీస్తున్నా! అంతే!"
"ఓ గాడ్! ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి! గొర్రె దాటు జనం" అంటూ అతను కూడ పరిగెత్తే వారితో కలిసిపోయాడు.
పాంటు జేబులో చేతులుంచుకుని రిలాక్సింగుగా నడుస్తున్నాడు జయసింహ. ఎవరో కుర్రాళ్ళు ఆదుకుని పగిలిపోగా పారవేసిన రబ్బరు బంతిని తన్నుకుంటూ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు.
ఓ కుర్రాడు హడావుడిగా పరుగెడుతూ భుజం తగిలి క్రింద పడిపోయాడు.
"నడివీధిలో అంత నింపాదిగా నడుస్తావెం?" దుమ్ము దులుపుకుంటూ లేచి డబాయించాడు.
"నీలా పరుగెడుతూ క్రింద పడలంటావా? ఏమిటంత హడావుడి?"
"అటు చూడు ఏం జరుగుతోందో?" పరుగెత్తుకుపోయాడు మళ్ళీ!
కాలి క్రింద ఉన్న రబ్బరు బంతి మీది నించి చూపుల్ని ఆ వైపు సారించాడు. నీల్ కమల్ దియేటర్ ముందు వందల సంఖ్యలో జనం గుంపులు కట్టి వున్నారు. ఇంకా ప్రవాహంలా చేరుతున్నారు.
ఒక వంక హాలు సిబ్బంది అంతా నిలబడ్డారు. మరో వంక యిరవై మంది ఆడవాళ్ళు. కురుక్షేత్రంలో పాండవ కౌరవసేనల్లా సమాయత్తమై యుద్దానికి కాలు దువ్వుతున్నారు.
స్త్రీ పురుషుల బహిరంగ రణరంగం!
చూచేవారికి ఆ దృశ్యం సీరియస్ గా అనిపించట్లల్లెదు. తమాషాగా ఎంజాయ్ చేస్తున్నారు. చరిత్రలో కూడ కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు రెండు పక్షాలుగా చీలిపోయిన యుద్దాలు లేవు.
జనం అమితోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు.
"వాట్స్ ది ప్రాబ్లం!' మేనేజర్ దిగివచ్చాడు.
"ఈ హాలు మేనేజర్ ఎవరు? ఎక్కడున్నాడు?' పిలవండి ఒక యువతి గొంతు చించుకుని అరుస్తోంది.
"నేనే తల్లీ ఆ దురదృష్టవంతుణ్ణి , ఏమయింది?"
"నీ స్టాఫ్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ ఉద్యోగం నీకెందుకు?"
"పిల్లలు కలవాణ్ణి అంతమాటనకమ్మా! ఏమయింది?"
"నీ స్టాఫ్ లో పర్సన్స్ మిస్ బిహేవ్ చేస్తున్నారు లేడీస్ తో!"
"సారీ! అపరాధం! అపాలాజీస్! వెళ్ళిపొండమ్మా ! తల్లీ! మహాలుకి అప్రతిష్ట! ఓనర్ కి తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది"
'అలాగని సినిమాకి వచ్చే ఆడవాళ్ళు అవమానానికి తలోంచుకోవాలంటారా? అతన్ని పిలవండి! ఎట్ వన్స్! లేకపోతే పోలీసులకి కంప్లయింట్ చేస్తాం."
స్టాఫ్ అంతా నిలబడి గుర్రున చూస్తున్నారు.
"ఎవరు నాయనా ఆ మిస్ బిహేవ్ మహానుభావుడు. వచ్చి అపాలజీ చెప్పుకోండి. జనం ఎగబడి చూస్తున్నారు. హాలుకి చెడ్డ పేరు వస్తుందయ్యా! మన ఉద్యోగాలు పోతాయి"
సినిమా ఉద్యోగుల సంఘం వర్ధిల్లాలి. అని అంటున్నట్టుగా మౌనంగా నిలబడి పోయారు ఉద్యోగులందరూ!
అపరాధిని నేనూ అంటూ ఎవరూ ముందుకు రాలేదు.
మేనేజర్ కి కాళ్ళు వణుకుతున్నాయి.
"మా వాళ్ళు ఏమీ చేయలేదంటున్నారు కదా!" అన్నాడు లేడీస్ బ్రీగెడ్ వంక చూస్తూ, వాళ్ళు మండిపడ్డారు.
"అయితే మేమే అబద్దాలు చెపుతున్నామంటారా?" ఒకమ్మాయి డబాయించింది.
"పాపం! ఆడపిల్లలు అబద్దలేందుకు చెప్తారమ్మా! ఎవరేం చేశారో చెప్పండి! కొంపలు మునుగుతాయి ' తిరిగి తన ఉద్యోగుల వంక చూస్తూ! వాళ్ళు తొక్కిపట్టిన బంతుల్లా వున్నారు.
ఆ మౌనం నిశ్శబ్ధం వెనుక ఏదో ఆలోచన, ఆవేశం ఉన్నట్లనిపించింది.
"తల్లీ! అసలేం జరిగిందో మీరయినా చెప్పండి."
"సినిమా చూడాలని వచ్చింది పాపం ఈ అమాయకురాలు! నోట్లో నాలుక కూడ లేదు. వనితా! నోరు తెరచి చూపించవే?" అంటూ ప్రోత్సహించింది ప్రియాంక! ఆమె మాటలను అవునంటూ అందరూ తలలు ఊగించారు. వనిత అనే అమ్మాయి నాలుక వెనక్కు మడిచి నోరు తెరచి చూపించింది.
"వస్తే ఏం జరిగింది?' జాలిగా అడిగారు మేనేజర్!
"హీరోయిన్ కష్టాలు చూడలేక లేచి బయటికి కొచ్చింది "
"ఒంటరిగానా?"
"అవును ఒంటరిగానే! వస్తే మీ ఉద్యోగులు ఊరుకొవచ్చు కదా!"
"ఏం చేశారు ? త్వరగా చెప్పు తల్లీ!"
"ఒకడు ఆమె దగ్గరగా వచ్చాడు. కళ్ళల్లోకి చూశాడు "
"అమ్మో కొంపలంటుకున్నాయి . తరువాత?"
"నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు"
"అమ్మయ్య! అంతేకదా ! అదేం పెద్ద తప్పు కాదు"
"తప్పు కాదా ? మీరు కూడా సమర్ధిస్తున్నారా? అంతటితో ఊరుకోలేదు."
"ఇంకా ఏం చేశాడు? చేయి పట్టుకున్నాడా?"
"కాదు ముద్దెట్టుకో బోయాడు"
"పెట్టుకోబోయాడు కాని పెట్టుకోలేదు కదా! అపాలజీ నేను చెప్పుకుంటాను సరిపోతుందా?"
"సరిపోదు. అతనే అపాలజీ చెప్పాలి."
"అవును అతనే చెప్పాలి. హాలు దద్దరిల్లే వంత పలికారు అందరూ!
"ఎవరయ్యా ఆ పని చేయబోయిందీ?"
"మాకు తెలియదు. అంతా అబద్దం" కోరస్ లా కోపం వుట్టి పడేలా ఐక్య కంఠంతో చెప్పారు ఉద్యోగులు.
"మా వాళ్ళకి తెలియదంటున్నారు కదా!"
"తెలియదనటానికి ఇదేం మాములు విషయమా? దాని శీలానికి సంబంధించిన విషయం" అంది ప్రియాంక ద లీడర్!
"అవును నా శీలకి సంబంధించిన విషయం" దిగులుగా చూసింది.
'శీల కాదే పిచ్చి మొద్దూ! శీలం , శీలం" ప్రియాంక సవరించింది