Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 10

 

    థాంక్యూ " అంటూ రుమాలు అందుకుని ముక్కు నించి కళ్ళ నించి ఊరుతున్న జలంతో దాన్ని పూర్తిగా తడిపేసింది ప్రియాంక.

                                  5


    "బాబుగారూ! తమకో యిల్లు ఉందన్నారు కదా ఏమయింది?"
    "అమ్మేశాను పానకాలస్వామి!"
    "ఎందుకమ్మేశారు బాబూ!"
    "అర్జంటుగా డబ్బు కావల్సివచ్చింది అమ్మేశాను"
    "ఎంతకీ అమ్మేశారు "
    "ఎనబై ఎనిమిది వేలోచ్చింది."
    "మరి డబ్బంతా ఏం చేశారు?"
    "ఖర్చు పెట్టేశాను"
    "ఏం కొన్నారు? కనీసం 5 జతల బట్టలయినా కుట్టించుకోలేదుగా!"
    "లేదు. నా కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు.  
    "మరి ఎవరి కోసం ఖర్చు పెట్టారు?"
    "ఆ ఒక్క విషయం నన్నెప్పుడు అడగకు పానకాల్సామీ!"
    "ఉన్న ఆ ఒక్క ఆధారం అమ్ముకున్నారు. ఒక్క పైసా కనీసం రెండు రోజులు తిండికయినా ఉంచుకోకుండా ఎవరికో యిచ్చేశారు. ఇకనైనా మీ గురించి ఆలోచించుకొండయ్యా"
    "నేను రాత్రి పూట ఈ పార్కులో పడుకోవటం , అప్పుడప్పుడు మీ యింట్లో తిండి తినటం నీకు బాధగా ఉందా పానకాల్సామీ!"
    "అదేం కాదు బాబుగారూ! మీరు గొప్పోరు. చదువుకున్నారు. గొప్పగా ఉంటే చూడాలని నా కోరిక. నాకు మాత్రం ఎవరున్నారు."
    ఆ నా కొడుకే వుంటే మీ అంత ఎదిగేవాడు. అర్ధాయుష్హుతో పోయాడు. అమ్మను కూడా తీసుకుపోయాడు.
    ఒక మొండి కట్టేని ఒంటరిగా మిగిలాను.
    కలో గంజో తాగుతానంటే నాతొ పాటు ఉండు. కాని అంత సదువుకున్న బాబువి! బికారిలా ఉంటే బాధగా ఉందయ్యా!"
    "ఆ మంచి రోజుల కోసమే నేను ఎదురుచూస్తున్నాను."
    "పానకల్సామీ! నీ దగ్గర ఓ రూపాయుందా?"
    "లేదు బాబయ్య! ఎందుకు? ఆకలిగా ఉందా?"
    "కాదు. పేపర్ కొనాలి."
    "ఉద్యోగాలేమయినా ఖాళీలు పడ్డాయ్యా"
    "కాదు. లాటరీ ఫలితాలు వస్తాయి ఈవేళ!"
    "నా దగ్గర అర్ధ రూపాయుంది. రెండు నెలలుగా జీతం లేదు"
    'అయితే సారాయి తాగుతున్నావన్నమాట"
    "నిద్రపట్టాలి కదా బాబయ్యా!"
    "వొద్దులే! ఆ అర్ధరూపాయి నువ్వే వుంచుకో. ఎక్కడయినా చూస్తాను" లేచి వీధిలోకి వచ్చాడు జయసింహ!
    నోబుల్ పార్క్ ఎదురుగానే 2 కిళ్ళీ షాపుల్లో పేపర్లు వ్రేలాడదీసి ఉన్నాయి. అప్పుడే వచ్చాయి దినపత్రికలు.
    "లాటరీ ఫలితాలు వచ్చాయా" అని అడిగాడు.
    "కొని చూడరాదు !" విసురుగా సమాధానం మరో వంకకు తిరిగాడు షాప్ వాలా!
    అక్కడ నుండి కదిలాడు జయసింహ!
    రోడ్డు మీద పడి వున్న ఓ ఖాళీ సిగరెట్ పాకెట్ ని తన్నుకుంటూ తనతో పాటుగా తీసుకుపోతున్నాడు. పేపర్ ఎక్కడ చూడాలి. టికెట్ పోయింది. డైరీలో నోటు చేసుకున్న నంబర్ మాత్రం గుర్తుంది."
    పాంటు జేబుల్లో రెండు చేతులూ పెట్టుకుని ఆలోచిస్తున్నాడు . అతనితో పాటుగా తన్నులు తింటూ చాలా దూరం వచ్చింది సిగరెట్ పాకెట్!
    ఒక వ్యక్తీ పేపర్ పట్టుకుని పోతూ కన్పించాడు.
    "మాస్టారూ! ఓసారి పేపర్ యిస్తారా?"
    "నేను మాష్టారు ఉద్యోగం చేస్తున్నానని నీకెలా తెలుసయ్యా?"
    అయన వంక ఎగాదిగా చూచాడు జయసింహ.
    పంచకట్టు, లాల్చి, బెల్టుస్టాప్ తో పెట్టుకున్న గడియారం, ఆకూ చెప్పులూ అయన నిజంగా మాస్టారే! కళ్ళజోడు కూడ వుంది.
    పేపరు యివ్వలేదు. కాని ఓ ప్రశ్న విసిరాడు.
    "అవును మాస్టారూ! మిమ్మల్ని చూడగానే గుర్తించాను మాస్టారని"
    "ఏం బాబూ! నువ్వు నా దగ్గర చదువుకున్నావా? హిహి ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. వెధవది ముప్పయి సంవత్సరాల సర్వీసు! నా దగ్గర చదువుకున్నవాళ్ళు ఎంతమందో! ఎక్కడెక్కడో ఉన్నారు. ఏవేవో పదవులు చేస్తున్నారు.
    మొన్నీ మధ్య పార్టీ మర్చి మంత్రి అయ్యాడు చూశావూ! కుర్ర మంత్రి! వాడు నా శిష్యుడే! ఇప్పుడు వాడు అనకూడధనుకో! వారు అనాలి! అన్నట్టు నా శిష్యుడే ఒకడు ఈ మధ్య కలెక్టరు అయ్యాడు!
    డాక్టర్లున్నారు. ఇంజనీర్లు , లాయర్లున్నారు.
    అంతే కాదండోయ్!
    నా దగ్గర ఒకటి నుండి అయిదు దాకా చదువుకున్న ఓ బడుద్దాయి జేబులు కత్తిరించటం నేర్చుకున్నాడు. ఓ రోజు  సిటీ బస్సులో వస్తుంటే నా జేబే కత్తిరించాడు. పర్సులో నా అడ్రసు దొరికిందిట, వచ్చి పర్సు యిచ్చాడు. డబ్బు మాత్రం ఖర్చయింది మాస్టారూ అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. చిన్నప్పుడు కూడ అలాగే హోం వర్క్ ఎగ్గోట్టేసి అలాగే ఏడుపు ముఖం పెట్టేవాడు. వెధవని -- వెధవ!
    పోనీలేమ్మని వొదిలేశాను. నా పిల్లాడు తప్పు చేస్తే నేను సర్దుకుపోనుటయ్యా! అలాగే!
    అది సరే! ఇంతకూ నువ్వు ఏ బాపతు! అ బాపతా! ఈ బాపతా!?"
    "ఏ బాపతూ కాదు మాష్టారూ పేపరు చూద్దామని-?"
    "పేపర్! ఈ పేపర్ సంగతే కదా నువ్వు చెపుతున్నావు. ఈ పేపర్ ఉంది చూచావూ? తెల్లవారే సరికి ప్రపంచంలోని వార్తలు అన్నీ మన ముందుంచుతుంది. నిన్న అమెరికాలో ఏం జరిగిందో, డిల్లీలో ఏం జరిగిందో ప్రొద్దున్నే మనం చదువుకోవచ్చు."
    పేపరు వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి.
    అలాంటి పేపరుని కొని చదవాలి! లేదా లైబ్రరీలో చదవాలి! అంతే కాని పేపరు మరోకర్ని అడగటం కాని, మరొకరికి యివ్వడం కాని యింత వరకూ చేయలేదనుకో!
    అది నా సిద్దాంతానికే విరుద్దం నాయనా! ఎగైనెస్ట్ మై ప్రిన్సిపుల్. ఇలా అన్నానని బాధపడకు నాయనా!
    "నేను వెళ్ళిపోతున్నాను. పేపరు చదువుకోవాలి కదా మరి!" మేష్టారు ఆకూ చెప్పులు నేలకు తాటిస్తూ హడావుడిగా వెళ్ళిపోయారు.
    దారిన పోయేవారిని అర్ధించి యిలా తల వాచిపోయేలా చివాట్లు తినడం వృధా ప్రయాస అన్పించింది. హోటల్స్ లో అయితే అవకాశం దొరకొచ్చు. కాఫీ తాగినా టిఫిను చేసినా పేపరు ప్రక్కనే ఉంచుతారు.
    ఈలోగా నంబర్ చూచి తిరిగి యివ్వొచ్చు.
    ప్రయిజ్ రాకపోతే టికెట్ పోయినందుకు బాధ పడాల్సిన అవసరం ఉండదు. వస్తే ఆ లాటరీ టికెట్ కోసం ప్రయత్నించవచ్చు.
    ఇది తన అదృష్టం తేలిపోయే రోజు.
    తన్నుకుంటూ తన వెంటే తెచ్చుకుంటున్న సిగరెట్ పాకెట్ వదిలేసి తలఎత్తి చూశాడు జయసింహా.
    ఎదురుగా ఆనందభవన్ హోటల్ కన్పించింది.
    ఉదయం సమయం కావటం మంచి రద్దీగానే వుంది.
    ఒక పేటంచు కండువా పెద్దమనిషి హాఫ్ బూటు టకటక లాడించుకుంటూ లోపలకు పోతున్నాడు.
    అతను పేపర్ ఒకటి తీసుకుని చిల్లర యిచ్చేసి దాన్ని చూడకుండా చంకలో యిరికించుతున్నాడు. కొందరికి పేపర్ కొనగానే హడావుడిగా ఆవురావురుమంటూ చదివేయటం అలవాటు!
    ఆకలితో ఉన్నవాడు రుచితో నిమిత్తం లేకుండా తినేసినట్టు!
    కొందరికి నింపాదిగా చదవటం అలవాటు! హడావుడి పనులన్నీ ముగించుకుని సోఫాలోనో ఈజీ చైర్ లోనో నింపాదిగా వాలి ఫ్యాన్ కూడ వేసుకుని చదువుకోవటం.
    హెడ్ లైన్ నుంచి ప్రింటెడ్ అండ్ పబ్లిష్ డ్ బై దాకా ఒక్కక్షరం వోదలకుండా చదవడం వాళ్ళకి హాబీ!

 Previous Page Next Page