Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 7

 

    చెయిర్మను , బ్యాంకు సీనియర్ అధికారులు అందరూ చాలా శ్రద్దగా అతని మాటలు విన్నారు. ఆలోచిస్తున్నారు.
    బ్యాంకు ఉద్యోగంలో ముప్పయిఅయిదు సంవత్సరాల అనుభవము ఉన్న సీనియర్ అధికారి ఒకాయన పరిస్థితి ని విశ్లేషించాడు.
    "శుక్రవారం సాయంత్రం అయిదు గంటల వరకూ బ్యాంకులో అందరూ ఉన్నారు. అయిదు నించి ఆరు పది నిముషాల వరకు ఓ అటెండర్ మీరూ ఇద్దరే ఉన్నారు. ఆరు పది నుంచి- ఇరవై అయిదు నిమిషాల వరకూ అటెండర్ టెలిగ్రాం యిచ్చేందుకు వెళ్ళాడు. కాబట్టి బ్యాంకులో మీరు ఒక్కరే ఉన్నారు. ఆ తరువాత అయిదు నిముషాల్లోగా ఇద్దరూ కలసి షట్టర్స్ మూశారు శుక్రవారం సాయంత్రం ఆరు ముప్పై నించి సోమవారం ఉదయం పదిగంటల వరకూ అంటే ఇంచుమించు అరవై మూడున్నర గంటల పాటు బ్యాంకు లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదన్న మాట" అంటూ పరిస్థితిని విశ్లేషించి చెప్పాడు సినీయర్ అధికారి.
    'అవును సార్! అంతే జరిగింది?" అన్నాడు పురుషోత్తం.
    "బ్యాంకుకి గార్డు ప్రోవిజను ఉందా? మరొక అధికారి ప్రశ్నించాడు.
    "ఎందుకు లేదు సార్! ఉంది"
    "మీరు అటెండర్ తో బయటకు వచ్చి ఆరు ముప్పయి కి షట్టర్స్ మూసేస్తున్నారు కదా! అప్పుడెక్కడున్నాడు గార్డు"
    "నేను గమనించాను, డింగ్ డాంగ్ క్లాత్ షోరూం ఎదురుగ్గా ఉన్న కాకా హోటల్ బయట నిలబడి టీ త్రాగుచున్నాడు."
    "షట్టర్స్ వేయటానికి ఎంత సమయం పట్టింది?"
    "మూడు నిమిషాలు"
    "అప్పుడు గార్డు ఎక్కడున్నాడు"
    "నా దగ్గరకు వచ్చి సెల్యూట్ కొట్టాడు "
    "మీరు వెంటనే వెళ్ళిపోయారా?"
    "తాళాలు చెక్ చేసుకోమని గార్డుకి చెప్పాను. చెక్ చేసుకున్నాడు. సరిగ్గా ఉన్నాయని చెప్పాడు. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను."
    "కీస్ ఎవరి దగ్గరుంటాయి?"
    "అందరి కన్నా జూనియర్ ఆఫీసర్ షీనా దగ్గరుంటాయి . ప్రతి రోజూ ఉదయం తొమిద్దిన్నర గంటలకు ఆమె వెంట అటెండరు వస్తాడు. షట్టరు తెరుస్తారు!"
    "స్ట్రాంగ్ రూం తాళాలు ఎవరి దగ్గరున్నాయి"
    "ఒక సెట్ నా దగ్గర! మరో సెట్ అకౌంటెంట్ దగ్గరా ఉంటాయి."
    "డూప్లికేట్స్ ఎక్కడున్నాయి?"
    "ఐ.ఓ.బి లో డిపాజిట్ చేశాం"
    "మీరు పై అంతస్థులోకి ఎన్ని గంటలకు వచ్చారు"
    "ప్రేలుడు జరగ్గానే ముందుగా ఫైర్ స్టేషన్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంటలు ఆరిపోయాక పోలీసులు హాండవర్ చేసుకున్నారు.  
    ఇంజనీర్స్ ని పిలిపించి పరీక్షలన్నీ చేయించేసరికి సాయంత్రం నాలుగున్నర అయింది.
    అప్పుడు పోలీసులు మమ్మల్ని అనుమతించారు "
    "మీరు వెళ్ళగానే ఏం కనిపించింది ?"
    "ముందుగా చిన్న పెచ్చులుగా మారిపోయి కూలిపోయిన గోడలు కన్పించాయి. ఆ శిధిలాల్లో విరిగిన కుర్చీలు, బల్లలు , ప్లైఉడ్ స్క్రీన్ లు, విరిగిన ప్యాన్ లు కన్పించాయి.
    స్ట్రాంగ్ రూం పగిలిపోయి ఓ మూల పెద్ద రంధ్రం ఏర్పడింది. డెబ్బయి ఒకటి నించి తొంభయి తొమ్మిది వరకూ లాకర్ లు బ్రద్దలయికన్పించాయి. కాష్ చెస్ట్ ఉన్న సేఫ్ వంకరపోయింది.
    కాని ఆ విస్పోటానికి కూడ పగలలేదు.
    కస్టమర్స్ తీసుకున్న జి.లోన్స్ తాలూకు బంగారం కూడ అందులోనే ఉంది. కాబట్టే పెద్ద గండం గడిచింది. కోటి రూపాయల బంగారం!
    పగిలిపోయిన లాకర్స్ లోంచి వస్తువులు దూరంగా విసరబడ్డాయి. అప్పటికే పోలీసులు కొన్ని సంపాదించి ఉంటారు. ఆ తరువాత వేదికి మరికొన్ని సంపాదించగలిగాం.
    ఎనబైశాతం దొరికాయి" తన పరిధిలో చేయాల్సింది అంతా సిన్సియర్ గానే చేశానని వివరిస్తున్నాడు బి.యం పురుషోత్తం.
    అంతసేపూ ప్రేక్షకుడుగా కేవలం శ్రోతగా ఉండిపోయిన చైర్మన్ కల్పించుకున్నాడు. ఛాంబర్ నిశ్సబ్దంగా అయిపొయింది.
    "ఈ ప్రమాదం ఎలా జరిగిఉంటుందని మీరు అనుకుంటున్నారు?"
    "అది ఊహలకు అందే విషయం కాదు సర్! మళ్ళీ తాను అకౌంటెంట్ గా వెళ్ళాల్సివస్తుందన్న భయంతో చెప్పాడు. బి.యమ్ పురుషోత్తం.
    ప్రతి అంశాన్ని విశ్వేషించటంలో విశేషమయిన అనుభవమున్న సీనియర్ అధికారి చూపులు సూదుల్లా గ్రుచ్చుకుంటున్నాయి.
    "షట్టర్స్ వేసినవి వేసినట్లుగా ఉన్నాయి. ఎన్నో గంటలు ముందుగా టైం బాంబు పెట్టడం జరగదు. ఒకవేళ పెట్టినా శనివారం రాత్రి కాని ఆదివారం కాని ప్రేలిపోయేలా చెయ్యొచ్చు."
    ప్రత్యేకించి సోమవారం ఉదయం తొమ్మిది అయిదు నిముషాలకి ప్రేలిపోయేలా టైం బాంబు ఎందుకు అమర్చుతారు?
    కాబట్టి ఆ ఊహకి తావులేదు.
    ఎవరో రెండు రాత్రులూ ఒక పూర్తీ పగలూ ఆఫీసు  మూసి ఉంటుందని గమనించారు. శనివారం రాత్రి ప్రయత్నం ప్రారంభించారు. అది సోమవారం ఉదయానికి సఫలమయింది "అన్నాడాయన.
    "ఇట్ మేబి , అటువంటి సాహసం ఎవరి కుందని?" చెయిర్మన్
    "ఇది సాహసం కాదు సర్! అవసరం, కేవలం డబ్బు కోసమయితే చేష్ట మీద ఫోకస్ చేసేవారు, లాకర్స్ మీద దృష్టిని కేంద్రీకరించారు కాబట్టి ఆస్తుల విషయం అనుకోవచ్చు"
    "లాకర్స్ ఎవరివరకున్నాయో అందర్నీ పిలిచి మాట్లాడతారా?"
    "కొందరు వచ్చారు. మరికొందరు రాలేదు సర్"
    "అది సహజం. ముందు ముందు అవసరం రావచ్చునని లాకర్స్ తీసుకుంటారు కొందరు. అలాంటి వారి లాకర్స్ లో ఏమి ఉండవు. వాళ్ళు రాకపోవచ్చు"
    "వచ్చినవారిలో అనుమానించదగినవారు ఎవరూ లేరా?"
    "నేనెవరినీ అనుమానించలేదు. ఎవరి లాకర్స్ ని వారే ఎందుకు నష్టపరచుకుంటారు?" అన్నాడు బి.యమ్.
    "ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఎందుకంటే ఒక్కొక్కసారి సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. కాని లాకర్ కలిగి ఉన్న వ్యక్తీ లాకరులో టైం బాంబు పెట్టాలంటే శనివారం పెట్టాలి."
    "అందువల్ల అది వారి పని కాదని నిర్ధారించుకోవచ్చు" అన్నాడు అనుభవమున్న సీనియర్ అధికారి.
    "ఆ తరువాత ఏమి చర్యలు తీసుకున్నారు?" బ్రాంచి మేనేజర్ని వదిలేసి రీజినల్ మేనేజర్ వంక చూచాడు చైర్మన్.
    'అక్కడ ప్రజలు మనమీద విశ్వాసం కోల్పోయారు. వారిలో తిరిగి నమ్మకాన్ని కలిగించాలి. మనది సుప్రసిద్దమయిన జాతీయ బ్యాంకు! అనేక బ్రాంచీలు ఉన్నాయి.
    కాబట్టి త్వరగా కోలుకోవటానికి ౩ అవకాశాలున్నాయి. నష్టం రెండున్నర లక్షల వరకూ అంచనా వేశాం. ఇంటి యజమానికి అంత కన్నా ఎక్కువ నష్టం జరిగింది.
    అయన భవనాన్ని యిన్ ష్యూర్ చేశారు. మనం లాకర్సు ని యిన్ ష్యూర్ చేశాం . కాబట్టి భయం లేదు సర్!
    డింగ్ డాంగ్ షాపు ఎదురుగా ఉన్న మరో భవనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి బ్యాంక్ మార్పించాను. వెయింటింగ్ యువర్ ఇన్ స్ట్రక్షన్స్!" అన్నాడు రీజినల్ మేనేజరు.
    "ఈ సమావేశాన్ని యింతటితో ముగిస్తున్నాను. అవుసరం అనుకుంటే మరో సమావేశానికి పిలుస్తాను . బై"
    అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అది బాంబు ప్రేలుడు. పోలీసులు తేల్చవలసిన ప్రాబ్లం.
    కాబట్టి ఎవరి మీదా విరుచుకుపడలేదు. అక్షింతలు తప్పినాయి.
    బయటకు రాగానే పత్రికల వాళ్ళు చుట్టుముట్టారు.
    ఎలా జరిగింది?

 Previous Page Next Page