Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 75


                          మహాత్ముఁడు


    మనము ప్రజలము; ఆయన మన నాయకుఁడు. మనము సామన్యులము; ఆయన మహాత్ముఁడు. మనము భారతీయులము; ఆయన భారతభాగ్యవిధాత. మనము సాధారణ స్త్రీపురుషులము; ఆయన యుగపురుషుఁడు. మనము మానవులము; ఆయన మహామానవుఁడు.
    గాంధీజీ జాతికి జనకునివంటివాఁడు; కనుకనే భారతదేశ మాయనను 'బాపూజీ' యని సంబోధించినది. ఆయన పూర్తి పేరు "మోహనదాస్ కరంచంద్ గాంధీ" ఇందులో 'గాంధీ' యనునది గృహనామము "కరంచంద్" అనునది మహాత్ముని సొంతపేరు.
    గాంధీజీ జనని నామము పుత్తలీబాయి. ఆమె చక్కగా చదువుకొన్నది. సుగుణవతి. పూర్వాచారపరాయణురాలు. గాంధీ తండ్రిగారికి రాజకోట సంస్థానములో నుద్యోగము. ఆయన న్యాయశీలుఁడు; సత్యనిరతుఁడు; సరళ హృదయుఁడు. గాంధీజీకి మాతాపితలపై భక్తి మిక్కుటము. ఆయన వారి యనుజ్ఞల కడుగు దాటెడివాఁడు కాడు.
    గాంధీజీ క్రీ.శ. 1869వ సంవత్సరము అక్టోబరు 2వ తేదీ "పోర్ బందరు" గ్రామములో జన్మించెను. ఆయన డెబ్బది తొమ్మిది సంవత్సరములు జీవించెను. ఆయన తన బ్రతుకు నంతయు దేశసేవకే వినియోగించెను. మంచిమంచి యుపదేశము లొసఁగి మానవజాతికి మార్గదర్శకుఁడయ్యెను. మహిళా భ్యుదయము, మద్యపాన నిషేధము, హరిజనోద్ధరణము, కుటీర పరిశ్రమలు మొదలగు దేశాభ్యుదయకరములగు కార్యముల నెన్నింటినో నిర్వహించెను.
    గాంధీజీ 1887వ సంవత్సరములో మెట్రిక్యులేషన్ పరీక్ష యందు కృతార్థుఁ డయ్యెను. అనంతరము బారిష్టరు పట్టము పొందుటకై ఇంగ్లాండు దేశమునకు బయలుదేరెను. లండను నగరములోనున్నంతకాలము "మద్యమాంసములను స్పృశింప" నని తన తల్లిముందు చేసిన వాగ్దానము జ్ఞప్తియందుంచుకొని జాగరూకుఁడై ప్రవర్తించెను.
    గాంధీజీ 1891లో బారిష్టరై భారతదేశమునకు తిరిగి వచ్చెను. వచ్చిన కొలఁది కాలమునకే యాయన 'సేట్ అబ్దుల్లా' దావాకొరకై దక్షిణాఫ్రికాకు వెళ్ళెను. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు భారతీయులను పలువిధముల బాధించుచుండిరి. ఆ దేశములో నల్లవారు తెల్లవారితోఁబాటు రోడ్లపై నడవరాదు. రైళ్ళయందు మొదటితరగతి పెట్టెలలో నెక్కరాదు. తలపాగలు దాల్చి న్యాయస్థానములలో కూర్చుండరాదు. దొరలు పోవు ఫలహారశాలలలోనికి ప్రవేశింపరాదు.
    అచ్చట భారతీయులనుభవించుచున్న బాధలు చూచి గాంధీజీ హృదయము కరిగిపోయెను. ఆయన నల్లవారి గౌరవాభిమానములను రక్షించుటకై దీక్షగైకొనెను. సభలు జరపి ప్రజలలో నవచైతన్యము కలిగించెను. పత్రికలు స్థాపించి నిరంకుశ ప్రభుత్వమును నిర్భయముగా విమర్శించెను. కార్మిక కర్షకులను సమాయత్తపరచి మహత్తరమైన సత్యాగ్రహ సమరమును సాగించెను.
    తెల్లదొరలు మన గాంధీజీ మీద కారాలు మిరియాలు నూరిరి. ఆయనపై శిలావర్షములు గుఱిపించిరి. రైళ్ళలో నుండి క్రిందికి బడబెట్టిరి. నానావిధముల హింసించిరి. పలుతెఱఁగుల పరిభవించిరి. కాని, గాంధీజీ వారికి లొంగలేదు. ప్రభుత్వమే లొంగిపోయినది.
    గాంధీజీ ప్రయత్నము ఫలించినది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల పరిస్థితులు చాలావరకు చక్కబడినవి. ఆయన దక్షిణాఫ్రికాలో నున్నప్పుడే పరప్రభుత్వము క్రింద క్రుంగి కృశించుచున్న భారతమాత దీనారావ మాయనకు వినిపించినది. దాస్యాంధకారమున దారిగానక తల్లడిల్లుతల్లి పిలుపువిని గాంధీజీ 1915లో జన్మభూమికి చనుదెంచినాడు.
    బాపూజీ భారతదేశమంతయు పర్యటించి ప్రజల పరిస్థితులన్నియు దెలిసికొనెను. గొప్ప గొప్ప నాయకులను సందర్శించి సంభాషించెను. దేశ స్వాతంత్రమునకై దీక్షవహించెను. స్వరాజ్య సంపాదనకై నడుము బిగించెను. పర ప్రభుత్వమునకు స్వస్తి చెప్పవలెనని నిశ్చయించెను.
    ఆనాడు మనదేశ మిప్పటివలె స్వతంత్రము కాదు. బ్రిటిష్ ప్రభుత్వము మనపై నధికారము చలాయించు చుండెను. వారి యొద్ద కత్తులు, కటారులు, తుపాకులు కలవు. గాంధీజీకి సత్యాహింసలే శస్త్రాస్త్రములు. సత్యాగ్రహమే జయపతాకము. శాంతి సైనికులే చతురంగబలము.
    గాంధీజీ 1920లో సహాయ నిరాకరణోద్యమము సాగించి బ్రిటీష్ ప్రభుత్వమును గడగడ లాడించినాడు. 1928లో ఉప్పు సత్యాగ్రహమును జయప్రదముగా నిర్వహించినాడు. 1930లో వ్యక్తిసత్యాగ్రము నడిపించినాడు. 1942లో "మీరు మీ దేశమును విడిచిపొం"డని "క్విట్ ఇండియా" నినాదము లేవదీసినాడు. ఈ ప్రకారము గాంధీజీ స్వరాజ్యము కొరకై యెన్నెన్నో కష్టములు భరించి యెంతయో కృషి చేసినాడు.
    చిట్టచివరకు 1947 ఆగస్టు 15వ తేదీ నాడు భారతదేశము స్వతంత్రమైనది. పరప్రభుత్వము తొలగిపోయినది. దాస్యబంధములు తెగిపోయినవి. స్వరాజ్య సౌధముపై జాతీయ పతాక విజయకాంతులతో విరాజిల్లినది. కాని బ్రిటీష్ వారి కూటనీతిచే భారతభూమి రెండుగా చీలిపోయినది. హిందూ మహమ్మదీయుల కొట్లాటలు చెలరేగినవి. శాంతమూర్తి బాపూజీ కర్ర పట్టుకొని కాలినడకతో పలుప్రాంతముల బర్యటించి ప్రజలలో సౌహార్దమును నెలకొల్పెను.
    1948 జనవరి 30వ తేదీ పూజ బాపూజీ మన దురదృష్టవశమున గుండుదెబ్బచే మరణించినాడు. బాపూజీ మృతికి భారతమాత కన్నీరుమున్నీరుగా విలపించినది. ప్రపంచమంతయు స్తంభించిపోయినది.
    బాపూజీ ఆశయములే మన కాదర్శములు, బాపూజీ చూపిన వెలుగుబాటలే మన కనుసరణీయములు. ఆయన ప్రబోధములే మన కనుకరణీయములు.


                           * * * *

 Previous Page Next Page