Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 76


                            దేశోద్ధారకుఁడు


    సమాజసంస్కర్తయై, మహాదాతయై, భాషాసేవకుఁడై, దేశోద్ధారకుఁడై వన్నెకెక్కిన మహనీయుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు.
    నాగేశ్వరరావు పంతులుగారు కృష్ణాజిల్లాలో "ఎలకుఱ్రు" అను గ్రామమున క్రీ.శ. 1867 మే 1వ తేదీన జన్మించిరి. ఆయన తండ్రిపేరు బుచ్చయ్యగారు. ఆయన చాలా సరళహృదయుఁడు. నాగేశ్వరరావు పంతులుగారి జనని శ్యామలాంబ. ఆమె వినయ విధేయతలుగల విజ్ఞానవతి.
    తండ్రిగారి సాధుత్వము, తల్లిగారి సౌజన్యము నాగేశ్వరరావు పంతులుగారికి స్వభావసిద్ధముగ సంక్రమించినవి. తల్లిదండ్రుల సుగుణములు వారి సంతానమున కబ్బుట సహజమే కదా!
    పంతులు తన తల్లి ప్రోత్సాహమున మచిలీపట్టణములో నింగ్లీషుభాష సభ్యసింప నారంభించెను. బుద్ధికుశలత గలవాడగుటచే నీతఁ డాంగ్లముననే కాక సంస్కృతమునుగూడఁ జదువ మొదలిడెను. అచిరకాలముననే పంతు లా రెండు భాషలయందును మంచి జ్ఞానమును సముపార్జించెను.
    ఉన్నతపాఠశాలలో విద్యార్థిగా నున్నప్పుడే యీయన నాట్యకళ నభిమానించెడి వాఁడు. బందరులో "హిందూ థియేటర్" అను నొక నాటకసమితిని స్థాపించి నాటకాలలో వేషధారణ మొనర్చుచుండెడివాఁడు.
    ఆయన మిషన్ కళాశాలలో 'ఇంటర్ మీడియేట్' తరగతియును, మదరాసు క్రైస్తవకళాశాలలో 'బి.ఎ.' తరగతియును జదివెను.
    నాగేశ్వరరావు పంతులుగారికి మదరాసులో రెంటాల వెంకట సుబ్బారావుగారను నొక ముఖ్యబంధువు గలడు. ఆయన వాణిజ్యమునందు ప్రవీణుఁడు, ప్రజ్ఞావంతుడు. ఆయనొక సుగుణవతియగు మేనకోడలుండెను. ఆమె పేరు రామాయమ్మ, రెంటాల వెంకట సుబ్బారావుగారు నాగేశ్వరరావు పంతులుగారి శాంతి ప్రియత్వమును, నౌదార్యమును చూచి యెంతయో సంతపించి రామాయమ్మ నిచ్చి పరిణయము గావించెను.
    రెంటాల వెంకట సుబ్బారావుగారు విక్టోరియా డిపో యనునొక వ్యాపార కేంద్రమును స్థాపించిరి. పంతులుగారు వ్యాపార కేంద్రమును చూచి వాణిజ్య పద్ధతులు, వానియందలి రహస్యములు, వాని విశేషములు నామూలాగ్రముగఁ దెలిసికొనెను. తరువాత తన జీవితమును స్వేచ్చగా గడుపుకొనుటకు వ్యాపారము చేయుట మంచిదని నిశ్చయించుకొనెను.
    అప్పుడు కలకత్తాలో 'బౌమన్' అను తెల్లదొర యొకఁ 'డాయుర్వే దౌషధములు' తయారు చేయుచుండెను. నాగేశ్వరరావు పంతులుగారికి కలకత్తా కరుగవలెనని బుద్ధి పుట్టినది. వెంటనే బయలుదేరిపోయినాడు. కొలది నిమిషములలో నాయనకు 'బౌమన్' దొర పరిచితుడయ్యెను. ప్రతిభాశాలురకుఁ గార్య సాఫల్యము సులభసాధ్యము గదా! కలకత్తాలో 'బౌమన్' దొర సహాయమున గొంత ధనము సంపాదించెను. కాని యాయన కచ్చట దేహారోగ్యము బాగులేకుండెను. అందుచేత నాయన స్వగ్రామమునకు మరలిరాక తప్పలేదు.
    పిమ్మట కొంతకాలమునకు పంతులుగారు బొంబాయి నగరమునకుఁబోయి యచట 'విలియంకంపెనీ'ని స్థాపించిరి. ఆ కంపెనీలో నాయుర్వే దౌషధములు తయారుచేయించి పంతులు గారు ప్రజలకుఁ బంపించు చుండెడివాఁడు. స్వదేశములోను విదేశములలోను నా మందుల కత్యంత ప్రాముఖ్యముండెడిది. పంతులుగారీ విధముగ నమితముగ ధనము సంపాదించిరి.
    పంతులుగారికి ప్రతిష్ఠ సమకూర్చినది 'అమృతాంజన; మను నొక యౌషధరాజము. అమృతాంజనమే కనకవర్షము గురిపించి పంతులుగారిని గుబేరుని చేసినది.
    దేశోద్ధారకుఁడగు పంతులుగా రాంధ్రభాషకు చేసిన సేవ యమూల్యమైనది. 1908వ సంవత్సరమున పంతులుగారు ఆంద్ర వారపత్రికను స్థాపించిరి. ఆ పత్రిక తన యాఱవయేటనే దినపత్రికగా మారినది. ఆంధ్రులకు రాజకీయముగాఁ జైతన్యము ప్రసాదించుట కీ పత్రిక యెంతయో తోడ్పడినది. ప్రజలకు విజ్ఞాన విశేషములు ప్రపంచ పరిస్థితులు తెలియపఱచి యీ పత్రిక రాజకీయ రంగములో ప్రతిష్ఠలు సంపాదించినది.
    నాగేశ్వరరావు పంతులుగారు 'భారతి'యను నొక సారస్వత మాస పత్రికనుగూడ నెలకొల్పిరి. 'భారతి' ఆంధ్ర కవిచంద్రుల నాదరించినది. విమర్శకుల గౌరవించినది. పండితుల నభిమానించినది. పద్యములు, గద్యములు, వ్యాసములు, కథలు, విమర్శలు మున్నగు నానావిధ రచనా విధానములతో విలసిల్లుచు 'భారతి' యాంధ్ర సాహితి కలంకారమైనది.
    పంతులుగారు 'ఆంధ్ర గ్రంథమాల' యనుపేర తాము ప్రకాశకులుగా నుండి యెన్నియో యుత్తమగ్రంథముల నాంధ్రుల కరకమలముల కందించిరి.
    పంతులుగారి భాషాసేవ యాంధ్ర సాహిత్యమునకు నవోదయము చేకూర్చినది. 'ఆంధ్ర విశ్వకళాపరిషత్తు' సాహితీవేత్తయగు పంతులుగారికి 'కళాప్రపూర్ణ'యను బిరుదము నిచ్చి సత్కరించినది.
    పంతులుగారు నిష్కళంక దేశభక్తులు. తెలుఁగుదేశమున స్వాతంత్ర్యోద్యమమును సమర్థతతోఁ బ్రచారము చేసిన పంతులు గారిని పూజ్య బాపూజీ "దేశోద్ధారక" బిరుదముతో సంబోధించి యాదరించినాఁడు.
    ఆంధ్రరాష్ట్రమును నిర్మించుటకు పంతులుగా రెంతయో యాందోళన సాగించిరి. గాంధీజీ సత్యాగ్రహోద్యమములోఁబాల్గొని దేశోద్ధారకుఁడు కారాగారవాస మనుభవించెను. తన పత్రికా ముఖమున ప్రజలకుఁ బరప్రభుత్వముపై విద్వేషము పెంపొందించి స్వాతంత్ర్య మెంత యావశ్యకమో నిరూపించినవాఁడు దేశోద్ధారకుఁడు. ఆంధ్రులను మేల్కొల్పి స్వతంత్ర సమరమున కురికించినవాఁడు దేశోద్ధారకుడు.
    పంతులుగారు విజయవాడలోఁ గట్టించిన 'దుర్గకళామందిర'మను నాటకశాల వారి కళాభిమానమునకు గీటురాయి.
    నాగేశ్వరరావు యాచక జనులకు ముంగొంగు బంగారము. ఆయన కడకు వచ్చి చేఁజాపినవాఁడెవ్వడును నసంతృప్తి పొంద లేదు. ఆయన దాతృత్వమును  గూర్చిన యొక కథ ప్రసిద్ధమై యున్నది.
    ఒకనాఁడొక బీదవిద్యార్థి విశ్వదాతకడకు వచ్చి తన కష్టగాధ నెఱింగించి బడిజీతము గట్టుటకు ధనము నిండని ప్రార్థించెను. తోడనే దయామయుఁడగు విశ్వదాత తన జేబులో చేయిపెట్టి యొక నూరురూపాయల నోటు దీసి యా విద్యార్థి చేతఁబెట్టెను. అతఁడా వితరణమున కాశ్చర్యపడి 'బాబూ! మీరిచ్చినది నూరు రూపాయల నోటు!' అని యనెను. విశ్వదాత చిరునవ్వు నవ్వుచు 'నాయనా! అది నీ యదృష్టమోయీ!' అని పలికి యాతని నింటికి బంపెనట, పంతులుగా రెంతటి దానవీరుడో చూడుడు!
    కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు దేశసేవకుఁడు. భాషాపోషకుఁడు, కళాభిమాని, విశ్వదాత. ఆయన కీర్తి సూర్య చంద్రు లున్నంత వఱకు తెలుఁగు దేశము నలుగడల నలరారుచుండును.
    మాననీయులగు పంతులుగారు 11-4-38 తేదీన దేహము చాలించి యాంధ్రులకు తీరని యావేదన కలిగించిరి.


                             * * * *    

 Previous Page Next Page