Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 72
"నేనే కారణమా? అదేమిటమ్మా? నా వాగ్దేవత దుఃఖమునకు నేనే కారణమా?"
"అవును. ముమ్మాటికి నీవే కారణము. నన్ను నరాంకిత మొనరింపఁ దలంచితివి. భాగవతమునుండి రామభద్రుని పేరు కొట్టివేసి యచ్చోట రాజులపేరు వ్రాయుదువా? చక్రవర్తులకుఁ జక్రవర్తియైన శ్రీరాముని విస్మరించి భోగముల కాసపడి నన్ను వీథులలో విక్రయింతువా?"
"లేదు, తల్లీ! లేదు, బావగారిపలుకులతో నొకింత పట్టుదల సడలిపోయి యాలోచించుచుంటిని; కాని, నా తల్లిని నరాంకిత మొనరింపను. అమ్మా! కవితాభారతీ! క్షమించుతల్లీ! అవనిక్రుంగినను, ఆకసము వంగినను నే నట్టి దుష్కార్యమొనరింపను. నా బంగారుతల్లీ! నిన్నెంత కష్టపెట్టితినమ్మా! ఇదిగో నా ప్రతిజ్ఞ వినుము.
ఉ|| కాటుకకంటినేరు చనుకట్టు పయింబడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల! యోమదంబ! యో
హాటక గర్భురాణి! నిను నాఁకటికిం గొనిపోయి యల్లక
ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుధ్ధిగ, నమ్ముభారతీ!
అని మహాకవి యుత్తరీయాంచలముతో భాషావధూటి కన్నీటిని దుడిచినాఁడు. ధైర్యముచెప్పి యోదార్చినాఁడు.
తెల్లవాఱినది. శ్రీనాథుఁడు సపరివారముగఁ బ్రయాణమై "బావా! నేను సింగభూపాలుని యాస్థానమునకుఁ బోవుచున్నాను. మఱి భాగవతము విషయమేమందువు?" అని హెచ్చరించెను. పోతనామాత్యుఁడు దృఢమైన కంఠస్వరముతో "కవిసార్వభౌమా! నన్నుఁ బదింబది బలవంతపెట్టకుము. నా కంఠమునప్రాణమున్నంత వరకు నా పవిత్ర భాగవతము నరాంకిత మొనర్పలేను, రాజసన్మానములపై నా కాశలేదు. కనకాభిషేకములపై నాకుఁగాంక్షలేదు. నేను కోరునది శ్రీవిభునియనుగ్రహముకాని భూవిభుని యనుగ్రహముకాదు. ఇఁక నిట్టి ప్రసంగములతో నన్ను బాధింపవలదని బావగారిని బ్రార్థించుచున్నాను" అని ఖండితముగ బదులుచెప్పెను.
శ్రీనాథుఁడు మొగము చిన్నపుచ్చుకొని "సరే, కానిమ్ము. ఎవరికర్మమున కెవరు బాధ్యులు? మేము పోయివచ్చెదము" అని పలికి సోదరి నోదార్చి యంతేవాసులతోఁ గూడి వెడలిపోయెను.
9
సింగభూపాలుఁడు లలితకళాభిమానము కలవాఁడు. ఆయన కవులను, గాయకులను సన్మానించి కృతులందుకొన్నాఁడు. పోతనమహాకవి భాగవతము రచించుచున్నాఁడని విన్నదిమొదలా మహాగ్రంథమును స్వనామాంకితముగా గ్రహింపనెంచినాఁడు. పోతనామాత్యుని గూర్చియు, పోతనామత్యుని కవిత్వమును గూర్చియు శ్రీనాథుఁడెన్నో పర్యాయములు సింగభూపాలునియొద్దఁ బ్రశంసించినాఁడు.
సింగభూపతిహృదయములో కుతూహలము రేకెత్తినది. భాగవతమువంటి మహాగ్రంథమునకుఁ గృతిభర్తయగుటకంటె మహాభాగ్యము మరేమున్నది?
సింగభూపాలుఁడుపెక్కుసార్లు రాజసభకు రమ్మని సహజపాండిత్యు నాహ్వానించినాఁడు. ఎన్నో సారులు శ్రీనాథునిచే వర్తమానములు పంపినాఁడు. కాని పోతన మహాకవి రాజసభకు రాలేదు. రాజునకుఁ గృతినిచ్చుట కంగీకరింపలేదు. మనుజేశ్వరుల భోగభాగ్యములా మహాకవి మానసమును మార్చలేకపోయినది. పోతన్న నెట్లైన లొంగఁదీసికొనవలెనని చిట్టచివరకు సింగభూపాలుఁడు కృతనిశ్చయుఁడయ్యెను.
తాను రాజు. ఏది తలఁచుకొన్న నది చేయఁగలడు.రేపు సూర్యోదయముననే యరిగి భాగవతగ్రంథమును బలవంతముగా స్వాధీనపఱచుకొన్నఁ బోధన యేమి చేయఁగలఁడు?
అదే యాలోచన. ఆ రాత్రి సింగభూపాలుఁడు హంసతూలికాతల్పముపై శయనించియుండెను. ఆయన మానస మాలోచనా తరంగములతో నల్లకల్లోలమైపోయెను. "కృతిప్రదానమునకు నిరాకృతియా? సింగభూపాలుని యాహ్వానమునకుఁ దిరస్కారమా? ఎంతసాహస మీ కవికి! తప్పదు! రేపే భాగవతమును గొనిరావలయును! కవి యభిమానమును గాలరాయవలయును".
అంతలో భూకాంతునికన్నులకు మిఱుమిట్లుగొలుపుచు నొక దివ్యకాంతి సాక్షాత్కరించినది. దేదీప్యమానమగు నా తేజోరాశిని గాంచినంతనే రాజేంద్రుని దేహము గడగడవడఁకినది; గుండెలు దడదడకొట్టుకొన్నవి; నోట మాటరాలేదు. ఆయన నిర్విణ్ణుఁడై యట్లే చూచుచుండెను. అతని కా వెలుఁగులో నొక వీరపురుషుఁడు కన్పించెను. ఆ పురుషుని శిరస్సుపై మణిమయకిరీటము విరాజిల్లుచున్నది. మెడలో వైజయంతి తేజరిల్లుచున్నది. ఆ మహాపురుషుని కరకమలములలో నొక మహాగ్రంథమున్నది. ఆ గ్రంథరాజముపై ముత్యాలవంటి యక్షరములతో 'శ్రీమదాంధ్ర మహాభాగవతము' అని లిఖింపఁబడియున్నది.
సింగభూపాలుఁడు చకితుఁడై యాదివ్యమూర్తికిఁజేతులు మోడ్చెను. "రాజా! మహాకవికి ద్రోహముచేయనెంచితివా! అస్మన్నామాంకితమగు భాగవతమును బలవంతముగా గ్రహింపనెంచితివా! ఘోరము సుమా!" అనుపలుకు లా తేజోమూర్తి వదనకమలమునుండి వెలువడెను. సింగభూపాలుఁడు భయకంపితస్వరముతో "ప్రభూ! మీ యాజ్ఞ నా కర్థమైనది. మీ యాదేశ మవగతమైనది. పరమపురుషుని పవిత్ర చరణసరోజముల కర్పించిన మహాభాగవతముపై దురాక్రమణ సేయఁదలఁచిన నన్ను మన్నింపుఁడు" అని పలికెను.
10
ప్రభాతభేరి మ్రోఁగినది. సింగభూపాలుఁడు నిద్రమేల్కొనినాఁడు. శ్రీరామభద్రునకు భాగవతమును సమర్పించు సందర్భములోఁ దాను స్వయముగఁ బాల్గొనెదనని మహాకవికి వర్తమాన మంపినాఁడు. ఆ మహోత్సవమును దానే నడిపించెదనని ప్రార్థించినాఁడు.
ఆనాఁడు కృతిసమర్పణమహోత్సవము. ఏకశిలానగరమంతయు నానావిధమంగళతోరణములతో నలంకరింపఁబడినది. పౌరులందఱు ఫలపుష్పాదులుగైకొని కృతి ప్రదానమహోత్సవమునకు వచ్చుచుండిరి. మహారాజు మంగళ వాద్యములతో భాగవతగ్రంథమును బట్టపుటేనుఁగుపైఁబెట్టి యూరంతయు నూరేగించెను. శ్రీనాథ పోతనామాత్యులు వికసితవదనులయి మహారాజుతోఁ గలసి నడచి వచ్చుచుండిరి. మల్లన్న, శారద నూత్నవస్త్రములు ధరించి మహోత్సాహముతో జనకుననుసరించుచుండిరి.
ఎచ్చట చూచినను నవ్యోత్సాహమే! ఏదిక్కు పరికించినను నుల్లాస భరితములగు సల్లాపములే! ఏ ప్రక్క విన్నను మధురమంజుల గీతికలే! ఏ గృహప్రాంగణము చూచినను మామిడాకు తోరణములే! ఎవరి వదనము తిలకించినను దరహాసచంద్రికలే!
మహోత్సవము ముందుకు సాగిపోవుచున్నది. అసంఖ్యాకులగు పురజనులు సంతోషతరంగితాంతరంగములతో నడచిపోవుచున్నారు. క్రమముగా మహోత్సవము శ్రీ కోదండరామాలయము చేరినది. మహాకవి దంతావళముపై నుండి భాగవతమును మెల్లగాఁగ్రిందికి దింపినాఁడు. తన జీవితసర్వస్వమగు నా కావ్యఫలమును భద్రముగా భక్తిపూర్వకముగాఁ బాణిపద్మములతోఁ బట్టుకొని దేవాలయమునఁ బ్రవేశించినాఁడు. జయజయనినాదములు మిన్నుముట్టినవి.
పోతనామాత్యుఁడు శ్రీరామభద్రుని చరణారవిందములకుఁ బ్రణ మిల్లినాఁడు. సర్వజనసమక్షమున దేవదేవునికి భాగవతమును సమర్పించినాఁడు. శ్రీనాథ సింగభూపాలురు శిరస్సులు వంచి చేతులు మోడ్చి శ్రీరామునకు నమస్కరించినారు. శారద యా మహానందములో మైమఱచిపోయినది. లక్ష్మి పుష్పహారము లర్పించినది. పోతనామత్యుని నేత్రము లానందబాష్పములు రాల్చినవి.
మహాకవి మనోరథము సఫలీకృతమైనది. ఆయన జీవితము కృతార్థమైనది. కవిసార్వభౌముఁడు గద్దించినను, మహారాజు లాహ్వానించినను, భాగ్యదేవత కన్నుగొట్టినను, దారిద్ర్యపిశాచము తాండవించినను మహాకవి చలింపలేదు.
పోతన ధన్యజీవి. ఆయన భాగవత మాంధ్రభాషామతల్లి కమూల్యాలంకారము.
మహాకవీ! నమోవాకములు!
భక్తశిరోమణీ! ధన్యవాదములు!
* * * *
Previous Page
Next Page