Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 71
శ్రీనాథుని ఫలాహార మింకను పూర్తికాలేదు. ఆయన మాటలధోరణిలోఁ బోధనకంటె వెనుకఁబడెను. పోతన "మంచిది బావగారూ!" అనిమాత్రము పలికి గ్రంథమును గొనివచ్చుటకుఁగాఁబోలు లోనికిఁబోయెను.
ఇచ్చట శ్రీనాథుఁడు తన కార్యక్రమములో నిమగ్నుఁడైయుండెను. శారద కొసరికొసరి వడ్డించుచునే యుండెను. ఇంతలో దొడ్డియందలి బావిలో గభీలుమను శబ్దమువినవచ్చెను. "మామగారూ! మామగారూ! మీ పిల్లవాఁడు బావిలోఁ బడినాఁడు" అని మల్లన్న కంఠస్వరము వినిపించెను.
ఆ కేక వినుటతోడనే శ్రీనాథుఁడు చివాలున పీటపై నుండి లేచెను. "అయ్యో! అయ్యో!" అని గుండెలు బాఁదుకొనుచు దొడ్డిలోనికిఁ బరుగులెత్తెను. మల్లన్న తత్తరపాటుతో బావిలోనికిఁజూచుచుండెను. శ్రీనాథుని భార్య లక్ష్మి, శారద, అందఱును బావియొద్దకుఁ బరుగెత్తుకొని వచ్చిరి. శ్రీనాథుఁడు "అయ్యో! బాబూ! నా బంగారుతండ్రీ! నా వరాలమూటా! నా రత్నాలరాశీ!" అని విలపించుచు నున్మత్తునివలె బావిచుట్టు గంతులు వేయసాగెను.
ఇంతలో బావిప్రక్క కాఁకర పాదుచాటునఁ గూర్చుండియున్న పిల్లవాఁడు పకపక నవ్వెను. బాలునిఁ జూచుసరికి శ్రీనాథుని ప్రాణములు కుదుటపడినవి. "ఏమిరా! మల్లన్నా! దొంగమాటలు పలికితివి" అని గద్దించి పిల్లవానిని ముద్దాడసాగెను.
మల్లన్న "మామా! నాకేమి తెలియును. నీ కొడుకు గుండ్రాయి బావిలో పడవైచి చెట్లపాదుచాటున నక్కినాఁడు కాఁబోలు"అని నవ్వసాగెను. ఇంతలోఁ బోతనామాత్యుఁడు వచ్చి "ఏమండీ! బావగారో౧ బాలుఁడు బావిలోఁబడెనని విన్నంతనే పరువెత్తుకొని వచ్చితిరి. పరికరములు తెచ్చుట మఱచితిరి. బావిలోఁ బడినవానిని పైకిఁ దీయుటకుఁ ద్రాళ్ళు, నిచ్చెనలేకుండ రిక్తహస్తములతో వచ్చి గంతులు వేసితిరి. ఇదేమంత సమంజసముగా లేదే!" అనెను.
బావగారి పరిహాసము శ్రీనాథున కర్థముకాలేదు. ఆయన ప్రశ్నార్థకముగఁ బోతనామాత్యుని ముఖమువైపు చూచుచు "అవును. పరుగెత్తుకొని వచ్చినమాట వాస్తవమే. కన్నబిడ్డ ప్రాణాపాయస్థితిలోనుండగా నాలస్యముగ నాడుచుఁ బాడుచురమ్మందువా! త్రాళ్ళు నిచ్చెనమాట యాతొందరలో నాకు జ్ఞప్తికేరాలేదు" అని పలికెను.
పోతన పకపకనవ్వుచు "ఒప్పుకొన్నాను, బావగారూ! ఒప్పుకొన్నాను, ఆర్తరక్షకుఁడగు పరమేశ్వరునకుఁగూడ నార్తులపై నిటువంటి యనురాగమే యుండును. కనుకనే గజేంద్రునిదీనాలాపములు కర్ణములఁ బడినంతనే శ్రీమన్నారాయణుఁడు సిరికిఁ జెప్పక, శంఖచక్రములు ధరింపక, పరువెత్తుకొని వచ్చినాఁడని నేను భాగవతములో వర్ణించితిని. అది యాసందర్భముగా నున్నదని యింతకుముందే మీరు సూచించితిరి. ఇప్పటి మీ యనుభవమునుబట్టి నా వర్ణనము స్వభావసిద్ధముగనే యున్నదని భావింతును" అనెను.
శ్రీనాథుఁడు పోతనామాత్యుని వేళాకోళమును సమయోచితప్రవర్తనమును మెచ్చుకొనుచు వినమ్రవదనుఁడై "మహాకవీ! క్షమింపుము. నేనే పొరపడి యట్లు పలికితిని. భక్తశిఖామణివగు నీ భాగవతములో తప్పులెన్నుట మావంటి వారికి సాధ్యమా!" అని పలికెను.
8
ఆ రాత్రి శ్రీనాథుఁడు తన సోదరి లక్ష్మితో నేకాంతముగ కొంతసేపు సంభాషించెను. లక్ష్మి కన్నీరుగార్చుచు నన్నగారితోఁదమ దారిద్ర్యమును బరిపరివిధముల వర్ణించి చెప్పినది; భర్తగారి యుదాసీనభావమును విశదీకరించినది. దినము గడచుటయే కష్టముగానున్నదని వాపోయినది. పెండ్లి యీడువచ్చిన శారదను, మల్లన్ననుగూర్చి తన మనోవేదనను స్పష్టము చేసినది.
శ్రీనాథుఁడు సోదరిమాటలననియు వినినాఁడు. ఆయన హృదయము కరఁగిపోయినది. తనకేమి! భోగభాగ్యములతోఁదులదూఁగుచున్నాఁడు; అందలములపైఁ దిరుగుచున్నాఁడు; కనకాభిషేకములనుభవించుచున్నాఁడు; రాజసమ్మానము లందుచున్నాఁడు. తనవలెఁ దనబావగారైన పోతనామాత్యుఁడు సైతముండిన దనకెంత సంతోషముగా నుండును! తనసోదరి యెంత సుఖించును! సహజపాండిత్యుఁడై సరసకవితాకళానిధియైన బావగారు రాజాశ్రయమును నిరాకరించి 'తానుపట్టిన కుందేటికి మూఁడేకా'ళ్లని కూర్చున్నాఁడు. బావగారి మనస్సు మార్చినఁగాని లక్ష్మి కాఁపురము చక్కఁబడదు. ఇట్లుకొంత సేపాలోచించుకొని కవిసార్వభౌముఁడు పోతనదగ్గరకుఁబోయి మంచముపైఁ గూర్చుండి సానునయముగ నిట్లు పలికెను;
"బావా! నామాట పాటింపుము. కాఁపురములోని కష్టసుఖములను గమనింపుము. మాసోదరి దీనవదనమును తిలకింపుము. నిరుపమాన కవితాధురంధరుఁడవే కాని నిన్ను నీవు తెలిసికొనలేకున్నావు. రాచకొండప్రభువైన సర్వజ్ఞసింగ భూపాలుఁడు సాహితీప్రియుడు, సరసకవితావిశారదుఁడు, సౌజన్యనిధి. నాతోరమ్ము, నేను నీకాయన దర్శనమిప్పించెదను. నీ సంగతి మనవిచేసెదను. నీ మహాకావ్య మా మహారాజున కంకితము చేసితివా నీకుఁ గనకాభిషేకము జరుగును; సర్వసంపదలు సమకూరును. మీ కాఁపురము 'నిత్యకల్యాణము పచ్చతోరణము'గ నుండును. మీ పర్ణశాల స్వర్ణసౌధముగ మారును. మీ దారిద్ర్యమును తీరును. నీవొక్కమాటు తలయూఁపిన జాలును. మీ యిల్లు రత్నరాసులతో నిండిపోవును. ఆలోచించుకొనుము".
అనంతరము భోజనములైనవి. అందఱును శయనించిరి. పోతనామాత్యున కా రాత్రి నిద్దురపట్టలేదు. మాటిమాటికి శ్రీనాథునిపలుకు లాయన కర్ణములలోఁ బ్రతిద్దంనింపసాగినవి. దారిద్ర్యదేవత వికటాట్టహాసము చేయుచు జుట్టు విరఁబోసికొని నాట్యము చేయుచున్నట్లు కనిపించినది. మహారాజులిచ్చు రత్నహారములు, బంగారు పతకములు కన్నులు మిరుమిట్లు గోల్పినవి. మహాకవి మానస మొకింత చలించినది. ఆయన తన శిథిలకుటీరము వైపు చూచుచు నిమీలితనయనుఁడయ్యెను.
సరస్వతీమూర్తి సాక్షాత్కరించినది. అదరిన హృదయముతో, బెదరిన నేత్రములతో, చెదరిన ముంగురులతో వాగ్దేవత సహజపాండిత్యుని మ్రోల సాక్షాత్కరించినది.
"అమ్మా! ఎవరు నీవు?"
"నేను వాణిని".
"నీ కనులవెంట బాష్పము లేమి తల్లీ! నీ చేతిలోని కచ్ఛపి జారిపోవుచున్నదేమి? నీ వినీలశిరోజములు చిక్కుపడినవే! ఎందులకమ్మా దుఃఖించుచున్నావు? "బాలరసాల సాల నవపల్లవ" కోమలమైన నీ వదనము వాడుటకుఁ గారణమేమమ్మా?"
"నీవే కారణము"
Previous Page
Next Page