విరిసే పువురేకుల్లారా
విరిసే పువురేకుల్లారా
మురిసే చివురాకుల్లారా
రాగానికి అనురాగానికి
యోగమెపుడో చెబుతారా
భోగమేపుడో చెబుతారా
పరువేత్తే హరిణములారా
ప్రసరించే కిరణములారా
ఉదయానికి అభ్యుదయానికి
మొదలేచటో చెబుతారా
అంచులేవో చెబుతారా
అందని అరవిందములారా
చిందని మకరందములారా
అందానికి ఆనందానికి
అనుబంధం చెబుతారా
ఆద్యంతం చెబుతారా
ఊగే విరజాజుల్లారా
మ్రోగే అళిరాజుల్లారా
గీతానికి సంగీతానికి
లోతెంతో చెబుతారా
అవధి యెచటో చెబుతారా
తెల్లని పసికందుల్లారా
చల్లని హిమబిందుల్లారా
గమనానికి ఆగమనానికి
క్రమమేదో చెబుతారా
పరమార్ధం చెబుతారా
సంక్రాంతికి స్వాగతం
స్వాగతమమ్మా! సంక్రాంతీ! సు
స్వాగతమమ్మా సంక్రాంతీ!
స్వర్ణ వర్ణ సుప్రభా స్రవంతీ!
శ్రమిక కృషిక జన వైజయంతీ! ||స్వాగత||
పౌష్యలక్ష్మీ సిగలో చేమంతివి
ప్రకృతి కాంత జడలో పూబంతివి
సస్యసంపదలు లాస్యం, చేసే
సంబరాల బంగారుబవంతివి ||స్వాగతం||
ఏటేటా ముస్తాబై మమ్మొక
మాటు చూచి పో వస్తావూ!
కోటి కోటి రతనాల రాశులను
మూట గట్టుకొని తెస్తావూ! ||స్వాగత||
మకరరాశిలో ప్రవెశించే భాస్కరుడు
నవయుగమ్ములో అడుగుపెట్టే మానవుడు
దివినిండా రవిదీప్తి నిండవలె
భువినిండా మానవత పండవలె ||స్వాగత||
దయామయా దయచేయవయా
దయామయా! దయచేయవయా!
దయచేయవయా! దయచేయవయా! ||దయా||
కరుణారస పరిపూరిత హృదయా!
మమతామయ మానవతా నిలయా! ||దయా||
హింసారాక్షసి మానవత్వమును
ధ్వంసంచెసెనయా
ద్వేషపిశాచం ప్రేమతత్వమును
నాశంచేసెనయా ||దయా||
జటాజూటమును విదలించీ
నిటాలేక్షణము కదలించీ
కసిబూనిన రక్కసిమూకల పో
కార్చు ప్రగతి చేకూర్చు ధరిత్రికి ||దయా||
మధూదయం
మధూదయం నవ మధూదయం
మధుర మధుర మన్మదోదయం
మంజుల మధుకర మహోదయం
శుక పీక కలరవ శుభోదయం ||మధూదయం||
చివురు చెక్కిళుల సిగ్గుల మొగ్గల
నవ్వుల పువ్వుల నవోదయం
లతా లతాంగుల లావాణ్యోజ్జ్వల
లలిత లాస్య నవ రాసోదయం ||మధూదయం||
సగము నమిలి బిసవల్లి నేచ్చెలికి
చక్రవాక మందించిందిలే
కరిణి తొండమున పరిమళ జలములు
కరిరాజుకు త్రాగించిందిలే ||మధూదయం||
మృగము కొమ్మకొనతో తనప్రేయసి
మొగము హాయిగా గోకిందిలే
తేటి బోటితో పూలకంచమున
తియ్యతేనియలు త్రాగిందిలే ||మధూదయం||
అందరికీ స్వాగతం
అతిధులుగా విచ్చేసిన
అందరికీ స్వాగతం!
అందుకోం డిచే మా అభి
నందన వందనశతం! ||అతిధులు||
మంద మంద మలయానిల మధురకరస్పర్శలో
సుందరతర కుందలతా బృంద పరామర్శలో
అందములో - విరిసిన అరవిందములో - కురిసిన
మకరందంలో - మెరిసిన ఆనందములో - స్వాగతం ||అతిధులు||
ఉదయశ్రీ అరుణారుణ ఉజ్జ్వల కిరణాలలో
హృదయేశ్వరి లలిత చలిత మృదుకరచరణాలలో
పులకించే - యుగయుగాలు తిలకించే - నవరసాలు
ఒలికించే - హృదయవీణ పలకించే - స్వాగతం ||అతిధులు||
నల్లమబ్బుతెర చాటున తెల్లని జాబిల్లిగా
కల్లాకపటా లెరుగని గారాముల చెల్లిగా
కొల్లలుగా - అరవిచ్చిన మొల్లలుగా - పాలవెల్లి
ఎల్లలుగా - కళాశాల పిల్లలుగా - స్వాగతం ||అతిధులు||
ఓ ప్రభూ
ఉదయాద్రి కాలూను కొదమ భానుని చూచి
చరమాద్రి కాల్జారు చందమామను చూచి
ఉప్పొంగి బిట్టార్తువా? ఓ ప్రభూ! ఉస్సురని నిట్టుర్తువా?
పట్నమేలే రేని పసిడిపళ్ళేములోన
కట్టేలమ్మేవాని మట్టికంచములోన
పన్నీరు చిలికింతువా? ఓ ప్రభూ! కన్నీరు వొలికింతువా?
పసమించు పురిటింటి పసిపాప దేసగాంచి
ససిచెడ్డ పెరటింటి ముసలమ్మ దశ గాంచి
పొంగిపోవుచు నుందువా? ఓ ప్రభూ! క్రుంగిపోవుచు నుందువా?
చిన్నారి పొన్నారి చిగురుటాకులవైపు
పండి రాలుచునున్న ఎండుటాకులవైపు
సంతోషముగ చూతువా/ ఓ ప్రభూ! సంతాప మోగబోతువా?
పార్కులో విహరించు బాబుగారిని చూచి
జైలులో క్రుశియించు దేశభక్తుని చూచి
కులికిపోవుచు నుందువా? ఓ ప్రభూ! కుమిలిపోవుచు నుందువా?
ఫెళ ఫెళా మ్రోగేటి పెండ్లి బాజాలలో
దేవుడో యని యేడ్చు చావు కంఠాలలో
తలబ్రాలు పాయింతువా? ఓ ప్రభూ! తలకొరివి పెట్టింతువా?
బానిసలుగా ప్రజల పాలించు భూభుజుల
పరతంత్రులై భంగపడిన దేశప్రజల
అందలము లెక్కింతువా? ఓ ప్రభూ! క్రిందనే త్రోక్కింతువా?
ఒకే కంఠం ఒకే గమ్యం
ఒకే కంఠం ఒకే గమ్యం
ఒకే నినాదం మనదంతా
ఒకే జాతీ ఒకే నీతీ
ఒకే పతాకం మనకంతా ||ఒకే||
భాషా వేషం ఏదయినా
భారతీయులం మనమంతా
ఊరూ పేరూ వేరయినా
ఒకే కుటుంబం మనదంతా ||ఒకే||
ఒకే మాట మనదంతా
ఒకే పాట మనదంతా
ఒకే బాట మనదంతా
ఒకే కోట మనదంతా ||ఒకే||
"జయహిందే" మన మాట
"జనగణమన" మన పాట
"సమైక్యతయే" మన బాట
"స్వాతంత్ర్యమె ' మన చక్కని కోట || ఒకే||