యువభారత యుగోదయంలో
యువభారత యుగోదయంలో
నవభారత మహోదయంలో
పూచిందొక అరుణతరంగం
లేచిందొక క్రాంతి విహంగం ||యువ||
కంఠంలో విప్లవరాగం
గమనంలో విద్యుద్వేగం
దేశానికి నవసందేశం
లోకానికి నూత్నాలోకం ||యువ||
త్యాగోజ్జ్వుల మహిమా మండిత
రాగారుణ రక్తపతాకం
నవభారత హృదయాంబరమున
ప్రసరించిన మహేంద్రచావం || యువ||
చైతన్యం జీవితలక్ష్యం
స్వాతంత్ర్యం అంతస్సాక్ష్యం
ప్రాచీ దిగ్ద్రగంచలంలో
రోచిస్సులు చిలికే కిరణం ||యువ||
అజ్ఞాతం అతిక్రమించిన
ప్రజ్జామయ విజయవిహారం
కురుక్షేత్ర సంగ్రామానికి
గురిపెట్టిన ఘనగాండీవం | |యువ||
అదిగో మన విజయ పతాకం
అదిగో మన విజయపతాకం
అదిగో మన వీరపతాకం
దిగంతముల విరిసిందదిగో
దృగంతముల మెరిసిందదిగో ||అదిగో||
మువ్వన్నెల మేలు పతాకం
ముల్లోకము లేలు పతాకం
నవభారత రాజ్యపతాకం
యువభారత పూజ్యపతాకం ||అదిగో||
త్రివర్ణములు మెరయు పతాకం
సువర్ణములు కురియు పతాకం
త్యాగరుణ తరుణపతాకం
రాగారుణ కరుణ పతాకం ||అదిగో||
స్వాతంత్ర్యం మించు పతాకం
చైతన్యం పంచు పతాకం
జాతీయాభ్యుదయం పతాకం
జ్యోతిర్మయ జయప్రతీకం ||అదిగో||
దీనుల ప్రేమించరా
దీనుల ప్రేమించరా దేవుని కృపగాంచరా
దిక్కులేని మనుజులలో దేవుని దర్శించరా ||దీనుల||
కన్నతల్లి మమతలోన గంగానది ప్రవహించును
చిన్నిచెల్లి ప్రేమలోన సిరిమల్లెలు వికసించును
ప్రేమే దైవంమురా ప్రేమే స్వర్గమురా
ప్రేమ లేని బందబ్రతుకు భీకర నరకమమ్మురా ||దీనులు||
ఆర్తుల మొరలాలింపుము ఆపన్నుల పాలింపుము
వెనుకబడ్డ శ్రమ జీవుల వెన్ను దట్టి లాలింపుము
ప్రజాసేవయే నిజమగు భగవంతుని సేవరా
నిజాయితీ గల నడవడి విజయానికి త్రోవరా ||దీనుల||
బీదసాదలను దయతో ఆదుకోనుట మనకందం
తోడివారి కష్టములో తోడుపడుట అనందం
ఆ అందం అనందం ఆ జ్ఞానం ఆ ధ్యానం
శుభముగోరు మానవులకు ప్రభువిచ్చే వరదానం ||దీనుల||
నల్లనయ్య నవ్వితే
నల్లనయ్య నవ్వితే
ఇల్లంతా వెన్నెలే
వెన్నదొంగ కన్నులేత్తితే
విరజాజుల వన్నెచిన్నేలె ||నల్లనయ్య||
శిఖిపించం ఊగితే
అఖిలవిశ్వ మూగునే
వనమాలిక పరిమళించితే
వనమంతా పరవశించునే ||నల్లనయ్య||
యదుకిశోరు డాడితే
యమున పొంగిపోవునే
బాలమురళి పాడితే
బండలు చివురించునే ||నల్లనయ్య||
బృందావన లోలుడే
నందగోప బాలుడే
కందోయికి విందోనరించే
అందాల ముకుందుడే ||నల్లనయ్య||
కల్యాణ జానకి
జగము లేలే తల్లి సర్వమంగళ గౌరీ
గగన గంగాధరుని గారాలు దేవేరి ||జగము||
రాజిల్లు శ్రీరాజరాజేశ్వరివి నీవు
తెజరిల్లెడు మహా త్రిపురసుందరి వీవు
జయ కంచి కామాక్షి! జయ మధుర మీనాక్షి!
కయి మోడ్పు లివె నీకు కాశీ విశాలాక్షి! ||జగము||
నీ ప్రేమ మందాకినీ ప్రవాహము గదే
నీ ప్రావు కల్పవల్లీ ప్రరోహము గదే
ఏ ప్రొద్దు నీ సేవలే కటాక్షింపవే
నా ప్రార్ధనమ్ము విని నిన్ను రక్షింపవే ||జగము||
నల్లనల్లని స్వామి విల్లెక్కు పెట్టాలి
ఎల్లలోకాలు చేయెత్తి జయపెట్టాలి
కోదండరాము సిరిగులుకు పేరురము పయి
పూదండనై నేను పులకించిపోవాలి ||జగము||
నమో నమో నటరాజా
నమో నమో నటరాజా జయజయ
నమో జాగ్రత్తయ నాట్యసమాజా ||నమో||
రక్తి ముక్తి అనురక్తియు నీవే
గీతమీవే సంగీతము నీవే
రాగ తాళ లయ రసార్ద్రమూర్తీ
నిత్య సత్య సాహిత్యస్పూర్తీ ||నమో||
ఢమ ఢమ ఢమ ఢమ డమరుకనాదం
భం భం భం భం శంఖారావం
ధిమిం ధిమిత మంగళమృదంగమో
ఘుమం ఘుమిత గంగాతరంగమో ||నమో||
చెదరిపోవునో శేషుని శిరములు
బెదరిపోవునో దిక్కుంజరములు
అదరిపోవునో అవనీతలమే
పదము కదల్చకు కరము విడల్చకు |నమో||
***