అమ్మాయశోధరామ్మా
అమ్మా ! యశోధరమ్మా!
ఏమమ్మా! యశోధరమ్మా! ||అమ్మా||
ఎంత అమాయిక వయినావమ్మా
ఎందుకు నిద్దురపోయినావమ్మా ||అమ్మా||
కలయే నిజమై నిజమే కలయై
కల నిజముల కలగలుపే బ్రతుకై
ప్రణయ భరిత ప్రార్ధనా గీతమై
ప్రభాత వికసిత పారిజాతమై ||అమ్మా||
లోకం కోసం నాధుని పంపీ
శోకాశ్రులతో బ్రతుకుని నింపీ
నీకై నీవే నిలువరించుకొని
ఏకాకినివై పోయితివమ్మా! ||అమ్మా||
యౌవనమంతా ఏకతారగా
జీవనమొక కన్నీటిధారగా
భావనలోనే కరగిపోదువా
శ్రావణమాసపు జలదమాలగా ||అమ్మా||
ఇంతేనమ్మా
ఇంతేనమ్మా జీవిత మింతేనమ్మా ||ఇంతే||
అంతులేని ఆశలు గల్లంతేనమ్మా
చివరకు మిగిలేది మనకు చింతేనమ్మా ||ఇంతే||
జంట విడని క్రౌంచపక్షి వింటిదెబ్బ తిన్నది
అది కనుగొని వాల్మీకుల మది బావురుమన్నది
ఆ చిందిన రుధిరధార ఈ పొంగిన అశ్రుధార
రామాయణ కావ్యంబై రసం నింపుకొన్నది ||ఇంతే||
రాలుతున్న పూలగుత్తి జాలిబాధ జీవితం
కాలుతున్న అగరువత్తి కరుణగాధ జీవితం
అమృతం వెన్నంటియున్న హాలాహలం జీవితం
హాలాహలం దాచుకొన్న హరుని గళం జీవితం ||ఇంతే||
నాన్నకోసం
నాన్న యేడే అమ్మ! నాన్న యేడే? ||నాన్న||
రేపు వస్తాడంటూ మాపు వస్తాడంటు
చూచి చూచీ కళ్ళు వాచిపోతున్నాయి
గోల చేస్తాననీ కోపమొచ్చిందిటే
అల్లరబాయినని అలిగిపోయాడుటే ||నాన్న||
రేపులెన్నో పోయె బాపూజీ రాడాయె
మాయమాటలు చెప్పి మరపించుతున్నావు
నన్నయిన పంపవే నాన్న దగ్గరకెళ్ళి
అమ్మ యేడుస్తున్నదని పిల్చుకొస్తాను ||నాన్న||
నీ కళ్ళలో ఇన్ని నీటిముత్యాలేమె!
గుండె టకటక యిట్లు కొట్టుకుంటుందెమే!
వెక్కెక్కి యేడుస్తూ యేమి లేదంటావు
చేతు లివి చూడవే చిక్కిపోయాయెంతో ||నాన్న||
అందరబ్బాయిలతో ఆడుకోబోతేను
జనమంత నావైపు జాలిగా చూస్తారే
నాన్నలేకేడ్చేటి నావంటి పసివాళ్ళ
కన్నీళ్ళు తుడిచి ఓదార్చి వస్తాడుటే ||నాన్న||
ఆచార్య దేవో భవ
స్వాగతం స్వాగతం స
మాగత గురువర్యులార!
జయం జయం జయం నీకు
ప్రియతమ ఆచార్యులార! ||స్వాగతం||
విశ్వకళాక్షేత్రంలో విజ్ఞానం నిండించిరి
బాలబాలికల గుండెల బంగారం పండించిరి
జగతి ప్రగతి మార్గంలో జైత్రయాత్ర సాగించిరి
ప్రజాహృదయ వీధులలో విజయభేరి మ్రోగించిరి ||స్వాగతం||
నాలందా తక్షశిలా నాగార్జునకొండ కాంచి
అమరావతి విక్రమశిల లేమన్నవి ఏమన్నవి
ఉర్వికెల్ల కాంతిదూత ఉపాధ్యాయుడే నన్నవి
అచ్చమైన శాంతిదూత అధ్యాపకుడే నన్నవి ||స్వాగతం||
వికసించిన అరవిందం విరజిమ్మెను మకరందం
వెలిగించిన కళాజ్యోతి కలిగించెను అనందం
అయ్యవార లన్నమాట వెయ్యారు వరాలమూట
ఆచార్యుల సన్నిధి విద్యార్ధులంధరకు పెన్నిధి ||స్వాగతం||
కన్నెమబ్బు మెరిసింది
కన్నెమబ్బు మెరిసింది
పోన్నమాను విరిసింది
పూలవాన కురిసింది
పుడమితల్లి మురిసింది ||కన్నెమబ్బు||
కోకిలమ్మ పాడింది
కేకి నాట్య మాడింది
మందారం కులికింది
మకరందం చిలికింది ||కన్నెమబ్బు||
పైరగాలి క్రొవ్వింది
పంటచేను నవ్వింది
ప్రకృతి కాంత తన ఓడిలోపలి
ప్రగతికి తల దువ్వింది ||కన్నెమబ్బు||
హృదయం పులకించింది
ఉదయం తిలకించింది
చైతన్యం విశ్వవీణపై
గీతం పలికించింది ||కన్నెమబ్బు||
అందాలు చిందేటి చందమామ
అందాలు చిందేటి చందమామా ఆడు
కుందాము రావోయి చందమామా ||అందాలు||
మల్లెపందిరి కింద బుల్లి బుజ్జాయుంది
బుజ్జినాన్నకు లాలపోసి పొదువుగాని
చల్లంగ రావోయి చందమామా మెల్ల
మెల్లంగ రావోయి చందమామా ||అందాలు||
వెండిగిన్నెలోన వేడిబువ్వెట్టుకొని
బంగారుగిన్నెలో పాయసం పోసుకొని
తిందాము రావోయి చందమామా నవ్వు
కుందాము రావోయి చందమామా ||అందాలు||
చక్కన్ని చుక్కల్తో సయ్యాటలాడుతూ
మబ్బు గుర్రా లెక్కి దబ్బున్న పొయ్యేవు
మాట విని పోవోయి చందమామా ఒక్క
మాటు దిగి రావోయి చందమామా ||అందాలు||
యువజగతికి స్వాగతం
యువ జగతికి స్వాగతం
యువ ప్రగతికి స్వాగతం
నవతను పండించే మా
నవతకు సుస్వాగతం ||యువ జగతికి ||
హర్షం కొనితెచ్చే నవ
వర్షానికి స్వాగతం
కర్షక కార్మిక విజయో
త్కర్షానికి స్వాగతం ||యువ జగతికి||
అరుణారుణ నవదినకర
కిరణాలకు స్వాగతం
నరనారీ పురోగమన
చరణాలకు స్వాగతం ||యువ జగతికి||
అరవిచ్చిన విరజాజికి
చిరునవ్వుల స్వాగతం
మధులక్ష్మీ మాధవులకు
మధుర మధుర స్వాగతం ||యువ జగతికి||
కవికోకిల కంఠాలకు
నవరసాల స్వాగతం
మన తెలుగు ఉగాదికి సిరి
మల్లెపూల స్వాగతం ||యువ జగతికి||
కదలిరావే కృష్ణవేణి
కదలి రావే కృష్ణవేణి!
కదలి రా లోకకల్యాణీ!
కదలి రా కదలి రా కడుపు చల్లని తల్లి
జలజలా పొంగుతూ కిలకిలా నవ్వుతూ ||కదలిరావే||
కోటి తీర్దాలు నీ నీటిలో దాచి - ము
క్కోటి వేలుపుల నీ పైతలో ముడివైచి
కదలి రా కదలి రా కదలిరాయని రాణి
ఎదురు చూచుచు నున్నదీ తెల్గుమాగాణి ||కదలిరావే||
శ్రీశైల మల్లయ్య ఆశీస్సుధలు చిలుక
నాగార్జునులు నీకు స్వాగతమ్మును పలుక
వేదాద్రి నరసింహు పాదాలు స్పర్శించి
అమరేశ్వరస్వామి ఆలయము దర్శించి ||కదలిరావే||
గణగణా మ్రోగేటి మణిమేఖల ధరించి
కనకదుర్గమ్మ గుడిగంటలకు పులకించి
చిరునవ్వు పొరలలో సిరులు నిండించుకొని
అలలలో బంగారు కలలు పండించుకొని ||కదలిరావే||
గురుడు కన్యరాశి కరుదేంచు శుభవేళ
విరబూచునంట పుష్కరము నీ కెరటాల
నీ వారిలో మునుగు మా వారి కరుణింప
దేవతలు నీ మహిమ కైవార మొనరింప ||కదలిరావే||
అంధ్రవిష్ణువు హేతి అరామముల ఖ్యాతి
ఉభయ రామేశ్వరము లుద్భవించిన రీతి
గళమెత్తి పాడుతూ నలుదెసల చాటుతూ
కలహంస గమనవై! కలికలుష దమనవై! ||కదలిరావే||