Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 70
"మహాకవీ! నిజముగా మహాకవిశబ్దము నీకేచెల్లును. శ్రోతలను మైమఱపించి యేలోకములకో గొనిపోఁగల యైంద్రజాలికశక్తి నీ కవిత్వమునకే కలదు. నీ భాగవతము తెలుఁగువారి నోములపంట. ప్రతిపద్యము రసార్ద్రమై ముద్దులు మూటగట్టుచున్నది. నీ భావావేశము, రసతన్మయత, శయ్యా సౌభాగ్యము వేనోళ్లఁ గొనియాడఁదగియున్నవి బావా!
ఉ|| ముద్దులు గార భాగవతమున్ రచియించుచు పంచదారలో
అద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్య మధ్య అ
ట్లద్దక వట్టిగంటమున - అట్టియు గీచిన తాటియాకులో
పద్దెములందు - ఆ మధురభావము లెచ్చటనుండి వచ్చురా!
నీవు గంటముఁగొని కావ్యము వ్రాయునపుడు తీయనిరసములు నీలేఖనిలోఁ దమంతఁ బొంగిపొరలెనేమో! నీవలె భక్తిరసప్రవాహముల కేతమెత్తినమహాకవి తెలుఁగుగడ్డపై లేఁడు. గోరువెచ్చని పాలమీగడలను, విచ్చీవిచ్చని గులాబి మొగ్గలను మచ్చరించు నీమధురమంజుల సుకుమారశైలి నీవెచ్చట నేర్చుకొంటివయ్యా! నీచిత్తమేకాదు. నీచేయిసైత మెంత సుతిమెత్తనిదయ్యా! ఎప్పుడు వ్రాసితివయ్యా యింత గ్రంథము! వ్యాసుని గ్రంథముల నెందఱనువాదము చేయలేదు? ఏదీ యీ క్రొత్తసొగసులు మాయందఱకు నలవడలేదే! మూలమునలేనియీ యందచందములు మరెవ్వరి గంటములందు నింతగా రూపొందలేదే! వరాలకు నెత్తుకెత్తుగా నా చక్కఁ దనాల పద్యములు వ్రాయుటకు నీవే తగుదువయ్యా! ఎన్ని పోకడలు పోయితివి! ఎంత చక్కఁగ నూహించితివి! ఎంత రసవత్తరముగఁ జెప్పితివి మహాకవీ!
సీ|| భీష్మునిపైకి కుప్పించి లంఘించు గో
పాలకృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱవెట్ట పరువెత్తు కఱివేల్పు
ముడివీడి మూపుపైఁ బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్యకన్నులనుండి
వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కు గొల్లపిల్లల వ్రేళ్ల
సందు మాఁగాయ పచ్చడిపసందు
ఎటుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
రయ్య! ఏ రాత్రి కలగంటివయ్య! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించి నావు!
సహజపాండితి కిది నిదర్శనమటయ్య!!
ఉ|| ఎండిన మ్రోడులే కిసలయించెనొ! ఏకశిలాపురమ్ములో
బండలు పుల్కరించెనొ! అపారముదమ్మున తెల్గుతల్లికిన్
గుండెలు పొంగిపోయి కనుఁగొల్కులు నిండెనొ! పచ్చిపైరులే
పండెనొ! జాలువాఱిన భవత్కవితామృత భక్తిధారలన్!
సస్యశ్యామలములగు సుందరక్షేత్రములలో విహరించుచు సర్వాంగ సుందరమగు నీభాగవతమహాగ్రంథమును వెలయించినావు. నన్నయతిక్కనాదులు భాగవతమును తెలిఁగింపక విడిచినది నీ కోసమే కాఁబోలు. ఈ మహాకార్యముచే నీవు ధన్యుఁడవైతివి. తెలుఁగుతల్లి ధన్యురాలైనది".
కవిసార్వభౌముఁడీ విధముగా తన్ను, తన కవిత్వమును ప్రశంసించుచుండ మహాభక్త శిరోమణియగు పోతనామాత్యుఁడు వినమ్రవదనముతో "బావా! మనదేమున్నది! మనము నిమిత్తమాత్రులము. అంతయు శ్రీరామభద్రుని కరుణాకటాక్షమే!" అని చిరునవ్వుతోఁ జేతులు మోడ్చినాఁడు.
7
సాయంకాలమైనది. బావమఱఁదులిరువురు కూర్చుండి ఫలాహారము చేయుచుండిరి. శారద వలదన్న కొలఁదియు మామగారి పళ్లెరములో లడ్డులు, గారెలు క్రుమ్మరించు చుండెను. "అమ్మో! నేను తినలేను. ఇప్పటికే నా కడుపు నిండిపోయినది." అని శ్రీనాథుఁడెంత బతిమాలినను శారద చెవినిబెట్టక మామగారి పళ్లెములో పిండివంటలు కొసరి కొసరి వడ్డించుచుండెను.
పోతన "ఏమండీ! బావగారూ! మీరు భాగవతమంతయు నచ్చటచ్చట వింటిరికదా! అన్నియును బాగున్నవనే యుంటిరి. కాని లోపములను బ్రకటింపరైతిరి! దయచేసి గ్రంథములో మీకుఁ దోఁచినదోషము లేవేనియున్న మొగమోటము వీడి తెలియఁజేయవలెనని ప్రార్థన". అని పలికెను.
శ్రీనాథుఁడు గారెలువిఱుచుచు "బావగారూ! మీ కవిత్వమున లోపములుగూడ నుండునా? ఒకవేళ నెచ్చట నైన నొండురెండు నెరసులున్న నవి సంపూర్ణపూర్ణిమా చంద్రునిలోని మచ్చవలె లెక్కలోనికి వచ్చునవికావు". అని తలవంచి తనపని కుపక్రమించెను.
ఆ మాటలువిని పోతనార్యుఁడు "బావగారు చెప్పుటకు సందేహించుచున్నారు. భాగవతమున నేవియో యసమంజస భావములు వారి భావమునకు గోచరించినట్లున్నది" అనెను.
శ్రీనాథుఁడు :- ఒక్క ప్రదేశములో మాత్రమే నన్నొక సందేహము బాధించుచున్నది.
పోతన :- ఏ ఘట్టమున?
శ్రీనాథుఁడు :- అష్టమస్కంధమునందలి గజేంద్రమోక్షణ ఘట్టమున-
అని పకపకనవ్వెను. పోతనమహాకవి విస్మయ విస్ఫారిత నేత్రములతో "కవిసార్వభౌముల కసమంజసముగాఁదోచిన సందర్భమేదియో" అని ప్రశ్నార్థకముగ నాయన వంక చూచెను.
శ్రీనాథుఁడు "మరేమియులేదు. భయంకరమకర దంష్ట్రావళిఁజిక్కి ప్రార్థించుచున్న గజేంద్రునిఁ గాపాడుటకు శ్రీమహావిష్ణువు బయలుదేరినాడు గదా! దుష్టశిక్షణమునకై బయలుదేరిన శ్రీమన్నారాయణుడు సిరికిఁ జెప్పకయే - శంఖ చక్రములను ధరింపకయే - పరివారమును పిలువనంపకయే - గరుత్మంతు నధిష్టింపకయే - కాలినడకతో - చేతులూఁపు కొనుచు - పోయినట్లు వ్రాసినారు. మాధవుఁడు మకరమును శిక్షించుటకై పోయెను. కాని నిరాయుధుఁడై గజేంద్రుని ముందు గంతులు వేయుటకుఁ బోలేదుగదా! ఇచ్చటనౌచితీ భంగము వాటిల్లినదేమో! కనుక నారాయణుఁడు శంఖచక్రములు ధరించి, నందకఖడ్గమును జేతఁబట్టి, ఖగేంద్రునధిష్టించి, గజరాజును గాపాడుటకై పోయెనని చెప్పినచో రసవంతముగా నుండునని నా యభిప్రాయము" అని పలికెను.
Previous Page
Next Page