సత్యమేవ జయతే
సత్యం శివం సుందరం! ఈ
జగమే దేవుని మందిరం
మనస్సు కలిగిన మమత్వ మెరిగిన
మానవులం మన మందరం ||సత్యం||
సత్యముతో జగమంతా నిండెను
సత్యములో జగదీశ్వరు డుండేను
చంద్రార్కుల నడిపించు నూనృతం
సత్యమేవ జయతే నానృతం | |సత్యం||
అణువణువున శివుడున్నాడు
అందరిలో శివుడున్నాడు
అందుకనే అన్యుల ద్వేషింపకు
అప్రియభాషణములు భాషింపకు ||సత్యం||
భగవంతుని సేవనం సుందరం
పరమాత్ముని భావనం సుందరం
పరమశివుని ఈ సృష్టి సుందరం
ప్రకృతిలోని ప్రత్యణువు సుందరం ||సత్యం||
మనిషి!
భగవంతుడు సృష్టించిన మనిషీ!
పాపం చేస్తా వెందుకూ?
చేతులు త్రిప్పీ నీతులు చెప్పీ
గోతులు తీస్తా వెందుకూ? ||భగవంతుడు||
కల్లా కపటము లెరుగని మొగ్గల
గిల్లి తెంపుతా వెందుకూ ?
నవ్వుతున్న చిన్నారి పువ్వులను
నలిపి తుంపుతా వెందుకూ? ||భగవంతుడు||
చక్కని చిలుకల పంజరమున నిడి
రెక్కలు దూస్తావెందుకూ?
"కో" యని నిద్దుర లేపే కోళ్ళను
గొంతులు కోస్తా వెందుకూ? ||భగవంతుడు||
చిగురాకుల నిరుపేద బ్రదుకులను
చిదిపి చీల్చుతా వెందుకూ?
పచ్చని విచ్చిన కాపురాలలో
చిచ్చు రేపుతా వెందుకూ? ||భగవంతుడు||
ఎల్లరు నడిచే రాదారులలో
ముళ్ళు పరుస్తా వెందుకూ?
చల్లని నీడల నిచ్చే చెట్లను
పెళ్లగించుతా వెందుకూ? ||భగవంతుడు||
మొగము మాడ్చుకొని మూతి ముడుచుకొని
సెగలు గ్రక్కుతా వెందుకూ?
జగమంతా ఒకటే కుటుంబమని
సాగిపొమ్ము మున్ముందుకూ ||భగవంతుడు||
అనామికా!
అనామికా! అనామికా!
ఐక్యం అయినా మిక-
వగజెందకు అనామికా!
దిగులెందుకు అనామికా! ||అనామికా||
అందమైన అనామికా ఇందువదన అనామికా
బృందావన అనామికా నందనవన అనామికా
అంగుష్టకు అనురాగం కనిష్టికకు కారుణ్యం
అందమైన అనామికకు అఖండమగు అనందం ||అనామికా||
అంగుళులవి ఎన్నున్నా ఉంగరాలు నీకేలే
శృంగారం నీకేలే బంగారం నీదేలే
కనిష్టకను అధిష్టించి కాళిదాసు కూర్చుంటే
అనామికను సనామికను ఒనర్చే భవభూతి సుకవి ||అనామికా||
ప్రణవంలోపల సర్వం ప్రతిఫలించి ఉన్నట్లే
కరుణానికి నీ రూపం కళ్యాణీ! ప్రతిరూపం
అఖిలగుణాలకు గమ్యం అన్నిటికంటే రమ్యం
అఖిలసృష్టి పారమ్యం అనందమే అనామికా! ||అనామికా||
పచ్చని ఆమని
పచ్చని ఆమని వచ్చిందిలే - నవ
బహుమతు లెన్నో తెచ్చిందిలే
విచ్చీ విచ్చని విరులను రతి పు
వ్విలుకానికి అందిచ్చిందిలే ||పచ్చని||
విరహిణి కోపం తగ్గిందిలే - తన
విభుని గుండెపై మొగ్గిందిలే
ప్రేమమూర్తియై ప్రకృతికాంత తన
స్వామి ముందు తల వొగ్గిందిలే ||పచ్చని||
మల్లి పకపకా నవ్విందిలే - వన
మెల్ల సుగంధం రివ్విందిలే
చల్లని వెన్నెల కరాలతో జా
బిల్లి వనలతల దువ్విందిలే ||పచ్చని||
అదుగో మధుకర ఝుంకారం - ఆవు
నదే స్మరధనుష్టంకారం
మదకల ఖగకుల మృదుగళ రవ సం
పద వనలక్ష్మీ కలంకారం ||పచ్చని||
బాలబాలికలం
బాల బాలికలం - పసివాడని
పూల మాలికలం
ప్రగతిపధంలో పురోగమించే
భారతభూమికి ఏలికలం ||బాల||
సమ సమాజ సంస్థాపన కోసం
జైత్రయాత్ర సాగిస్తాం
నవసమాజ నిర్మాణం కోసం
నగారాలు ఫెళఫెళ మ్రోగిస్తాం ||బాల||
అనుభవజ్ఞులగు పెద్దల మాటలు
వినయవినమ్రులమై వింటాం
అనాధలగు బీదసాదలకు మే
మండదండగా నిలుచుంటాం ||బాల||
కాంతిని ఆహ్వానిస్తాం! సం
క్రాంతికి స్వాగతమిస్తాం!
శాంతి దేవతా మందిరమ్ముపై
జయధ్వజం రెపరెపలాడిస్తాం ||బాల||
వచ్చిందమ్మా మధుమాసం
వచ్చిందమ్మా ! వచ్చిందమ్మా!
వచ్చిందమ్మా! మధుమాసం!
తెచ్చిందమ్మా! తెచ్చిందమ్మా!
పచ్చలహారం నీ కోసం! ||వచ్చిందమ్మా||
పలుగాకుల కేకలు మార్మోగే
బలురక్కసి బాకులు చెలరేగే
తెలుగుతోటలో విరిసిందమ్మా
మధుర మధుర మాధవహాసం ||వచ్చిందమ్మా||
నవరసాలములు కనులవిందుగా
చివురించాయమ్మా!
యువకవి కోకిలములు తమగొంతులు
సవరించాయమ్మా!
రాగలహరి ప్రసరించాలమ్మా!
తీగల మొగ్గలు తోదగాలమ్మా!
జీవన సుమాలు విరియబూచి శ్రమ
జీవుల బ్రతుకులు పండాలమ్మా! ||వచ్చిందమ్మా||
చెల్లీ! రావమ్మా! ముద్దుల తల్లీ! రావమ్మా !
మల్లీ! రావమ్మా! పువ్వుల పళ్ళెం తేవమ్మా!
దోసిలి నిండా మల్లెలు మొల్లలు తీసుకురావమ్మా!
జాజిపూలతో వసంతలక్ష్మికి స్వాగతమీవమ్మా! ||వచ్చిందమ్మా||
బుల్లి మరదలు
నిద్రమంచం నుంచి లేవోయి!
పొద్దు పొడిచిం దదుగో బావొయీ! ||నిద్ర||
ఏతాము త్రోక్కేటి రైతన్న గొంతులో
స్వాతంత్ర్యగీతాలు జలజలా పారినవి ||నిద్ర||
కటికచీకటి తెరలు గడచి ఖగబృందాలు
కలకలధ్వనులతో గగనాని కెగసినవి ||నిద్ర||
చంటిపిల్లవాణ్ణి చంకన్న ఎత్తుకొని
బీద బాలెం తోకతే బిచ్చాని కొచ్చింది ||నిద్ర||
నిరుపేద కర్షకుడు అరక కోటేరుసి
బువ్వమూ టేత్తుకొని పొలము పోతున్నాడు ||నిద్ర||
మొలగుడ్డ నసిలేని ముసలిబాల య్యొకడు
వాకిట్లో కూర్చొని కేకలేస్తున్నాడు ||నిద్ర||
ప్రస్థానం
స్వామీ! ఎక్కడికీ ప్రస్థానం
ఏమిటి నీ గమ్యస్థానం ||ఎక్కడికీ||
వన్నెల సింహాసనము త్యజించి
కన్న తల్లిదండ్రుల వంచించి
చిన్న కుమారుని నిద్దురముంచి
శ్రీమతి ప్రేమవల్లికలు ద్రెంచి ||ఎక్కడికీ||
వనవిహారములు త్యజించినావా
నవవిహారములు సృజించుతావా
జనముల మనముల సరసమొనర్చీ
శాంతి సస్యములు పండించుతావా ||ఎక్కడికీ||
క్రూరుల క్రౌర్యం శూరుల శౌర్యం
చోరుల చౌర్యం శిరసు వంఛగా
రాజరాజమణిమకుటరాజినీ
రాజితాంఘ్రివై రావా దేవా ||ఎక్కడికీ||
నా రాజు
కన్నీళ్ళతో వెళ్ళుతున్నాడు నా రాజు
ఎన్నాళ్ళకో తిరిగి ఇల్లు చేరే రోజు
శోకమా! కనులెత్తి చూడనీవమ్మా!
కోకిలా! గొంతెత్తి కూయబోకమ్మా! ||కన్నీళ్ళతో||
పరమ సుకుమారాలు ప్రాణేశు పాదాలు
ఒరుసుకొనునోయేమొ కరకు కంకరరాలు
సరిక్రొత్త పచ్చికలు పరచుకో భూమీ
సైరింపలేడు కష్టాలు నా స్వామి ||కన్నీళ్ళతో||
కనుగందునో ప్రభుని కుసుమకోమలమూర్తి
పసివాడునో విభుని మిసిమి చెక్కుల దీప్తి
కాక చూపించకో లోకబాంధవుడా
కనిపెట్టియుండుమో కమలబాంధవుడా ||కన్నీళ్ళతో||
అడవిలో నా రేడు అగచాట్లపాలౌనొ
వడగాడ్పులో శోషవచ్చి పడిపోయేనో
గగనాన మేఘడా కదలిరావయ్యా
చల్లంగ పన్నీరు చల్లిపోవయ్యా ||కన్నీళ్ళతో||