Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 69
మహాకవి శ్రీరామచంద్రునకుఁ గరములు మోడ్చి వినయవినమిత శిరస్కుఁడై యిట్లు ప్రార్థించినాఁడు:
క|| నీ పాదకమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయసేయగదే!
ఒకానొకదినము పోతనామాత్యుని గృహప్రాంగణమున నొక పట్టుకుచ్చుల పల్లకియుఁ గొన్ని శకటములును వచ్చి యాఁగినవి. శ్రీనాథ మహాకవి యసంఖ్యాక శిష్యవర్గముతోఁ గుటుంఁబసమేతుఁడై బావమఱఁదిని జూచిపోవుట కరుదెంచినాఁడు. పోతన బావగారి కెదురువచ్చి యర్ఘ్యపాద్యము లందించినాఁడు. పరస్పరకుశలప్రశ్నములతో బావమఱఁదు లిరువురు కొంతసేపు కాలము గడపినారు.
శ్రీనాథుని సోదరియగు లక్ష్మి తలుపుచాటుగ నిలఁబడియన్నగారిని బలుకరించినది. శారద పరుగుపరుగున వచ్చి మామయ్య తెచ్చిన మంచి మంచి బహూకృతులను లోనికిఁగొనిపోయినది. పంచవర్ష ప్రాయుఁడగు మామయ్యకుమారుని ముద్దులాడినది. పోతనామాత్యుఁడు మెల్లఁగా లేచి గృహాభ్యంతరమున కరిగినాఁడు. శూన్యదృక్కులతో మొగము చిన్నపుచ్చుకొని వచ్చుచున్న యర్ధాంగినిఁ గాంచినాఁడు.
ఇంట నొక్కవస్తువుకూడ లేదు. కుండలో బియ్యము నిండుకొన్నవి. భోజనమునకు వందమంది యతిథులు వచ్చి యున్నారు. కవిశిరోమణికిఁ గాలుసేతులాడలేదు. ఇంటిలోని వస్తుసామగ్రియంతయు నీవఱకే యమ్ముడు వోయినది. ఆ పూట కాహారమెట్టులాయని యాలోచించుచున్న నిరుపేద కవి యింతమంది కతిథిసత్కారము చేయుటెట్లు? పోతనామత్యుఁడితి కర్తవ్యతా మూఢుఁడై నిమీలిత నేత్రములతోఁ బరమేశ్వరు నిట్లు ప్రార్థించినాఁడు: "రామభద్రా! దయాసముద్రా! ఈ కష్టసముద్రమునుండి నన్నెట్లు గట్టెక్కింతువో? ఇప్పట్టున నాపరువు నెట్టుల నిలఁబెట్టెదవో! నీ యార్తావనబిరుదము నే విధముగ సార్ధక మొనర్చుకొందువో?"
ఇంతలో మల్లన్న వీథిలోనుండి యింటిలోనికి వచ్చెను. అతనివెంట నిరువురు యవకులు రెండు పెద్ద పెద్ద గంపలనిండ సమస్త వస్తుసామగ్రి మోసికొని వచ్చి లోపలఁబెట్టి సెలవు దీసికొని వెడలిపోయిరి.
పోతనామాత్యుఁడాశ్చర్యముతో నాత్మనందను నవలోకించి "ఈ సామగ్రి యంతయు నిచ్చటి కెటులవచ్చినది? ఇచ్చినవారెవ్వరు? తెచ్చిన వారెవ్వరు?" అని ప్రశ్నించెను. మల్లన్న మందహాసముసేయుచు "ఏమో! నాన్నగారూ! ఎవ్వరో యిరువురు నూతనపురుషులు నేను పొలమునుండి వచ్చుచుండఁగా మధ్యేమార్గమున నెదురుపడి బమ్మెరవారి యిల్లెక్కడ యని ప్రశ్నించినారు. నేను నా వెంటరండని మన యింటికిఁ దీసికొనివచ్చితిని. త్రోవలో వారి యుదంతయును గూర్చి నేనెన్నివిధముల నొక్కియడిగినను ప్రత్యుత్తరమీయక 'మా యజమానుఁడీ వస్తువులను గవిగారియింటికిఁ గొనిపొమ్మన్నారు' అని మాత్రము పలికి చిరునవ్వు నవ్వి యూరకుండిరి" అని చెప్పెను.
భక్త శిరోమణి ప్రహర్షపులకితశరీరుఁడై తల పంకించి "మల్లన్నా! నీ వెంతటి యదృష్టవంతుఁడవోయీ! భక్త రక్షణ పరతంత్రుడగు పరమపురుషుని పరిచయభాగ్యము నీకు లభించినది. వారే - ఆ తేజోమూర్తులే - రామలక్ష్మణులు. నాయనా! ఆ కరుణామయులు నిరంతరము మనలను గంటికిరెప్పవలెఁ గాపాడుచునేయున్నారు" అని పలికెను.
ఆ విచిత్ర సంఘటనమునకు లక్ష్మి ముఖము వికసించినది. ఆమె శారదసాయముతో క్షణములో వంట సిద్ధము చేసినది.
శ్రీనాథమహాకవి శిష్యసమూహముతో స్నానసంధ్యాద్యనుష్ఠానములు నిర్వర్తించుకొనినాఁడు. శిష్యులందఱు బంతులుబంతులుగా నాసీనులైనారు. చకచక వడ్డన జరిగిపోయినది. సంతోషసంభాషణములతో, సరససల్లాపములతో భోజనములు పూర్తియైనవి. స్వాధిష్ఠములగు భక్ష్యభోజ్యపానీయములతో నతిథులందఱు సంతృప్తులైనారు.
భోజనానంతరము మహాకవులిరువురు తాంబూల చర్వణ మొనర్చుచు లోకాభిరామాయణములతోఁ గొంత కాలముబుచ్చినారు.
"బావగారూ! భాగవతము బూర్తి చేసితిరఁట. మీ కవితామృతమును గరవుదీఱఁగ్రోలుట కాంధ్రావని యెంతయు నాతురపడుచున్నది" అని కవిసార్వభౌముఁడనెను.
పోతన మందహాసముతో "నంతయు శ్రీరామభద్రుని కరుణాకటాక్షము. మనము నిమిత్తమాత్రులము" అని పలికెను.
"భాగవతశ్రవణాసక్తితోడనే నేఁడింతమంది మీ గృహమున కరుదెంచి నాము. బావగారు మా వాంఛితము దీర్పవలయును" అని శ్రీనాథమహాకవి వాక్రుచ్చెను. పోతన "శారదా! భాగవతమును దీసికొనిరా తల్లీ!" అని ముద్దుల పుత్రికను బిలిచెను. శారద లేఁత లేఁత చేతులతో భాగవతమును గొనివచ్చి యాత్మజనకుని హస్తములలో నుంచెను.
మధురమనోహర కంఠస్వరముతో మహాకవి భాగవత పారాయణమున కుపక్రమించెను. కవిసార్వభౌముఁడనన్యాయత్తమైన చిత్తముతో భాగవత సుధారసమును గ్రోలి క్రోలి యానందపరవశుఁడగుచుండెను. ఆ మహా గ్రంథమునందలి మందారమకరంద మాధుర్యములకు శ్రీనాథుని మనో మధుపము ప్రముగ్ధ మగుచుండెను. ఆ కావ్యమండలి నిర్మల మందాకినీ వీచికలలో శ్రోతల మానసమరాళము లుయ్యాలలూఁగుచుండెను. హృద్యములగు పద్యములతో, రమణీయములగు నంత్యప్రాసలతో, మనోరంజ కములగు వర్ణనములతో, సరసములగు సంభాషణలతో విరాజిల్లుచున్న పోతన భాగవతము శ్రీనాథమహాకవికి శ్రవణానందమును సమకూర్చెను.
పోతన మహాకవి తన గ్రంథమునందలి రసవద్ఘట్టములను బ్రత్యేకముగ బావగారికి వినిపించెను. ప్రహ్లాదచరిత్రము, గజేంద్రమోక్షణము, బాల గోపాలలీలలు, కాళియ మర్దనము, గోవర్ధనోద్దరణము, రాసక్రీడ, భ్రమరగీతలు, రుక్మిణీ కల్యాణఘట్టము, సత్యభామా నరకాసుర సంగ్రామము మొదలగాఁగల కథాభాగములను విని మరలమరల చదివించుకొని శిష్యబృందమును, శ్రీనాథుఁడును కావ్యరసామృత పానములో మైమఱచి పోయిరి.
ఇట్లు కొంతతడవు భాగవతమువినిపించి పోతనామాత్యుఁడు శ్రీనాథునిఁ జూచి "బావా! భాగవత మెట్లున్నది?" అని ప్రశ్నించెను. కవిసార్వభౌముఁడు గద్గదకంఠముతో నిట్లుపన్యసించెను.
Previous Page
Next Page