Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 68


                               నమ్మనులేవమ్మా
    
    నమ్మనులేవమ్మా! నీ మాటలు
    నమ్మనులేవమ్మా!                            ||నమ్మను||

    నాకు తెలుసు అంతా వట్టిదిలే
    నాజడ ఎప్పటిలా పోట్టిదిలే
    పాలు తాగితే జుట్టు పెరుగునని
    పలికితివే అన్నీ అబద్దాలు                     ||నమ్మను||

    ముచ్చటైన అన్నయ్య జడ చూడు
    మూరెడు పొడుగై సాగును! ఊగును!
    ఎగురును! ఆడును! నిగనిగలాడును!
    నాగుపాములా నాట్యం చేయును!             ||నమ్మను||

    ఎంత వెన్న తినిపించానో
    ఎన్నిపాలు తాగించావో
    ఇంతైనా పొడుగు సాగాలేదే
    ఎప్పటిలా ఉందేమే నాజాడ?                    ||నమ్మను||

    
                           జయ జయ ప్రణవ స్వరూప

    జయ జయ ప్రణయస్వరూప!
    జయ జయ త్రైలోక్యదీప!
    జయ జయ సప్తాశ్వమహా
    స్యందన! త్రిజగద్వందన!                    ||జయ జయ||

    జయము జయము భక్తసులభ!
    జయము పద్మినీవల్లభ!
    జయము జయము భువనబంధు!
    జయము జయము దయాసింధు!          ||జయ జయ||

    జయ జయ మణిమయకిరీట!
    జయ జయ నిర్జితనిశాట!
    జయ జయ జయ ఛాయాప్రియ!
    జయ సాత్వికతేజోమయ!                      ||జయ జయ||

    జయము జయము త్రయీమూర్తి!
    జయము భువనచక్రవర్తి!
    జయము నభోమణి! దినమణి!
    జయము దేవచూడామణి!                      ||జయ జయ||

    
                               అడుగడుగో దినరాజు
    
    ఆడుగడుగో దినరాజు చూడు - పాల
    కడలి తరగల పైన వెడలి వస్తున్నాడు
    పొడుపుకొండమీద కొలువు తీరిచినాడు
    వెలుగుల యేకిమీడు వేయి చేతుల రేడు              ||ఆడుగడుగో||

    అందాల రేవెల్గుజోడు - అర
    విందాల సావాసకాడు
    మందేహులను గెల్చి సిందూరరుచి దాల్చి
    కందోయికిని విందు కావించుచున్నాడు                 ||ఆడుగడుగో||

    బంగారు కిరణాల వేల్పు - చిగురు
    చెంగాని దువ్వల్వ దాల్పు    
    రంగారు తోలిప్రొద్దు సింగార మది ముద్దు
    పొంగారు సుషమా తరంగాల సరిహద్దు                 ||ఆడుగడుగో||

    కంటి కింపగు వెలుగు పంట - కాదు
    కటిక చీకటి గుండెమంట
    ఒంటి చక్రపు రధము - అంటి అంటని పధము
    కుంటి సారధితోడ - మింట పరుగిడునంట                ||ఆడుగడుగో||

    
                                 అందుకో నాపూజ
    
    అందుకో నాపూజ అందాల దినరాజ!    
    ఎందుకో నాగుండె చిందిపోవుచునుండే                   ||అందుకో||

    వెండి గిన్నెల మధువు నిండించుకున్నాను
    పైడిదొన్నెల వలపు పండించుకున్నాను
    నా మనో జలజ మిది స్వామికే అర్పితము
    పద్మీనీ జీవితము ప్రభువుకే అంకితము                  ||అందుకో||

    ఆదిత్యుడవు నీవె ఆదిశక్తివి నీవె
    ద్వాదశాత్ముడ వీవె వేదమూర్తివి నీవే
    ఆదరింపుము స్వామి! ఆలసించెదవేమి
    నీదు సన్నిధి బాసి నిలువలే దీ దాసీ                     ||అందుకో||

    ప్రాభాత సమయాన బ్రహ్మస్వరూపమై
    మధ్యాహ్నవేళ శ్రీమహేశ్వరుడవై
    సాయహ్నమందు సాక్షాన్మహావిష్ణువై
    భువనాలు పాలించేదవు త్రయీమూర్తివై                  ||అందుకో||

    
                                    వందనమో తమోహరణ

 

    వందనమో తమోహరణ!
    వందనమో సహస్రకిరణ!
    వందనమో బృందారక
    వందిత సుందర చరణా!                      ||వందన||

    యుగముల కాధారమీవె
    నిగమమ్ముల సారమీవె
    జగముల మేల్కొల్పు నూత్న
    చైతన్య ద్వార మీవె                            ||వందన||

    నీఉదయంఈజగతికి
    నిత్య యౌవనాభ్యుదయం
    నీహృదయం నిఖిలభువన
    నిర్భర కారుణ్యమయం                       ||వందన||

    ఏకచక్ర రధము నెక్కి
    లోకా లాలోకింతువు
    లోకు లందరికిని నవా
    లోకమును ప్రసాదింతువు                     ||వందన||

    
                                              భజరే సప్తాశ్వం

 

    భజరే సప్తాశ్వం హి మానస                        ||భజరే||

    భజ సప్తాశ్వం పాలిత విశ్వం
    అజ హరి హర పార్శ్వం హర్యశ్వమ్                 ||భజరే||

    నళినీకాంతం కలిత దిగంతం
    దళితభవధ్వాంతం భాస్వంతమ్                       ||భజరే||

    సురనుత చరణం స్పురదవతరణం
    అరుణారుణ కిరణం భయహరణమ్                    ||భజరే||

    తేజోమూర్తిం రాజితకీర్తిం
    పూజిత సంస్పుర్తింగళితార్తిమ్                          ||భజరే||

    కాంచన గాత్రం కశ్యప పుత్రం
    కమలవనీమిత్రం సుపవిత్రమ్                            ||భజరే||

    అపహృత పాశం అసుర వినాశం
    జపాకుసుమ సంకాశం దినేశమ్                         ||భజరే||


                             ఎంత చక్కని పాణి

 

    ఎవరు నను మేల్కొల్పి
    రీ నవోషస్సులో?
    ఈ నవోషస్సులో - ఈ రససరస్సులో                      ||ఎవరు||

    ఎచటివీ ప్రాభాత కిరణ ధరహాసాలు
    ఎచటివీ చైతన్య చరణ విన్యాసాలు
    ఎచటివీ రమణీయ రాగారుణాంగుళులు
    ఎచటివి కమనీయ కరకంకణ ధ్వనులు                    ||ఎవరు||

    ఎదురు తెన్నులు చూచి ఎద తెరచి మైమరచి
    నిరురపోయే నన్ను కదిపి కదిలించారు
    ఎంత చక్కని పాణి! ఎంత చల్లని వాణి!
    పొంగి నా బ్రతుకంత పులకించి పోయ్యేవి                     ||ఎవరు||

    ఈ నవోషస్సులో ఈ రస సరస్సులో
    మంజుల మహాస్సులో మధుమయ తపస్సులో
    కలల తెర తొలగించి మొగముపై మొగముంచి
    చల్లగా మెల్లగా మనసు రంజీల్లగా                              ||ఎవరు||


                                           మహావీర జోహార్

 

    మహావీర! జోహార్!
    మహావీర! జోహార్!
    మహీమండలం స్వర్గం చేసిన
    మహాపురుష ! జోహార్!                           ||మహావీర||

    మానవత్వమే చివురించినదో
    మహాసత్వమే వికసించినదో
    మధుర మధుర గంగాతరంగమై
    మహాకరుణమే ప్రవహించినదో                    ||మహావీర||

    నీ స్పర్శకు శిలలే పులకించెను
    నీ ఒదార్పుకు సాగరమే పొంగెను
    నీ అచంచలంబైన అహింసను
    నింగి నేల ఒకటై తిలకించెను                       ||మహావీర||

    నీ జననం జగతికి ఆరోగ్యం
    నీ సహనం ప్రగతికి సౌభాగ్యం
    దయానిధి! నీ తీయని స్పర్శకు
    త్రాచుపాములే శిరసులు వంచెను                   ||మహావీర||

        
                                 దైవమందిరం


    దయగల హృదయమే దైవమందిరం
    నియమం గల జీవితమే నిత్యసుందరం                      ||దయ||

    కనులు లేని కబోదులను కనికరింపవా
    వెనుకబడిన బ్రతుకులలో వెలుగు నింపరా
    తెంపరివై జీవుల హింసింపబొకురా
    తుంటరివై పూవుల తల త్రుంపబొకురా                       || దయ||

    కరుణామయుడై సూర్యుడు ధరణికి వేలుగిచ్చును
    కరుణామయమై మేఘము కరగి వర్షమిచ్చును
    కరుణామయి తల్లి చిట్టికందుకు పాలిచ్చును
    కరుణ లేని ఈ జగత్తు కసితో పడిచచ్చును                     ||దయ||

    కరుణ లేని నరుడు వట్టి గడ్డిబొమ్మరా
    కరుణ లేని జన్మ తల్లి కడుపుచేటురా
    కరుణ నరుని ఐశ్వర్యం కరుణ నరుని సౌందర్యం
    కరుణ నరుని సర్వస్వం కరుణామయ మీ విశ్వం                ||దయ||
   

 Previous Page Next Page