Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 68


    ఉ|| బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య'కన్యకన్
    గూళలకిచ్చి యప్పడుపు గూడు భుజించుటకంటె సత్కవుల్
    హాలికులైన నేమి! గహనాంతర సీమల కందమూల కౌ
    ద్దాలికులైన నేమి! నిజదారసుతోదర పోషణార్థమై.


    పోతన యెత్తి పొడుపు వాక్యమునకు శ్రీనాథుఁడు లజ్జా వనతవదనుఁడయ్యెను. ఆయన యేమియు మాటాడలేక "బావా! హాస్యమున కనిన నంతకోపమువచ్చినదా? నీకేమి మగవాఁడవు? కష్టపడి వ్యవసాయము చేయుదువు. కాని మా చెల్లెలిని, బిడ్డలను జూచిన నా కడుపు చెరువగుచున్నది. నీ కీ కర్మమేమి? కమ్మని కవిత్వము వ్రాయఁగలవే! రసము లొలుకు మహాకావ్యములు రచింపగలవే! ఏదైన నొక్క గ్రంథము వ్రాసి యే రాజునకైన గృతియిచ్చితివేని నిన్ను బంగారుపూలతో పూజసేయరా! నీయిండ్లు, వాకిండ్లు మణిమయభూషణములతో నిండిపోవా! బావా! మహానుభావుఁడవు! మహామహిమ సంపన్నుఁడవు! మడి దున్న నేలనయ్యా?"యని సవినయముగ హెచ్చరించెను. అందుకుఁ బోతన "బావగారూ! ఆ భోగభాగ్యము లన్నియు మీరే యనుభవింపుఁడు. నన్నేమి చేయుమందువు? నా కావ్యములను నరాంకితము చేయుటయనిన నాకిష్టములేదు. భగవంతుఁడిచ్చినంతవరకు కలియో గంజియో త్రావి కాలక్షేపముచేయుటయేకాని కడుపు కక్కుర్తికై రాజుల నాశ్రయించుటకు నా హృదయము సమ్మతింప"దని ఖండితముగఁ బలికెను. శ్రీనాథమహాకవి పోతనామాత్యుని పట్టుదలకు వెఱఁగుపడి చేయునదిలేక మరల పల్లకినెక్కి వెడలిపోయెను.
    ఇంతలో పోతన పుత్రిక శారద అన్నకు అన్నమును గొనివచ్చెను. మల్లన యెద్దులను విడిచి మేఁత వేసి చెల్లెలితోసల్లాపించుచు నన్నముమూటగైకొని గుంటగట్టునకుఁబోయెను. పోతనామాత్యుఁడు తన ముద్దుబిడ్డలను, తన క్షేత్రలక్ష్మిని ఒక్కమాటు సందర్శించి రెండు చేతులు పైకెత్తి "ప్రభూ! ఈ మాత్రము చాలును. నా మానసమున ఆశాతరంగములు లేపకుము" అని భగవంతునకు భక్తిపూర్వకముగా ప్రణామముగావించెను.


                             4


    ఆనాఁడు కార్తికశుద్ధ పూర్ణిమ, చంద్రగ్రహణము, ఆ సోమోపరాగపుణ్య పర్వమున పవిత్ర గౌతమీనదీజలములలో స్నానము గావించి భవబంధ విముక్తులగుటకై జనులు తండోపతండములుగ వచ్చుచుండిరి. గోదావరీ తీరమునందెచ్చట చూచినను తీర్థప్రజలే! ఎచ్చట గాంచినను వేదమంత్రధ్వనులే! ఎచ్చట తోలకించినను పుణ్యాంగనా పూజోపహారములే!
    అదిగో! దూరముగా ఆ పండువెన్నెలలో - ఆ వెండియిసుకలో - ఆ యానందపారవశ్యముతో - కించిదున్నీలితలోచనుఁడై మహేశ్వర ధ్యానము గావించుచున్న మన పోతనామాత్యుఁడు! ఆహా! ఏమి యా ముఖవర్చస్సు! ఏమి యా దివ్యతేజస్సు! ఏమి యా మనోనిశ్చలత! ఏమి యా భక్తితన్మయత!
    అవిగో! ఆ పెదవుల నుండి యేవియో మధుర వాక్కులు వినవచ్చుచున్నవి.
    
    సీ|| మెఱుఁగు చెంగటనున్న మేఘమ్ముకైవడి
        నువిద చెంగట నుండ నొప్పువాఁడు
    చంద్రమండల సుధాసారమ్ము పోలిక
        ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
    వల్లీయుత తమాల వసుమతీజముభంగి
        బలువిల్లు మూపునఁ బరఁగువాఁడు
    నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి
        ఘనకిరీటము దలఁ గలుగువాఁడు
    పుండరీక యుగముఁబోలు కన్నులవాఁడు
    వెడఁద యురము వాఁడు విపులభద్ర
    మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
    కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
    
    ఓహో! మహాకవికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారమైనది. ప్రభు వేదియో భక్తవర్యున కాజ్ఞయిచ్చినట్లున్నాఁడు. అదిగో! మహాకవినోట మరల నేదియో మధుర కవిత వినిపించుచున్నది.

    క|| పలికెడిది భాగవతమఁట!
    పలికించెడు వాఁడు రామభద్రుండట! నేఁ
    బలికిన భవహరమగునఁట!
    పలికెద వేఱొండు గాథ పలుకఁగ నేలా?

    ఆహా! ఎంత సంతోష వార్త. శ్రీరామభద్రుఁడు భాగవతము వ్రాయుమని యాజ్ఞయిచ్చినాడట మహాకవికి. ఆంధ్రభూమి ధన్యమైనది. తెలుగువారు కృతార్థులైనారు. అదిగో! మహాకవి ప్రభువునాజ్ఞ శిరసావహించి బంధుమిత్రులతో బయలుదేరి నిజపురమున కరుగుచున్నాఁడు.
    మహాకవీ! నమస్సులు!
    భక్తశిఖామణీ! జోహారులు!

                              5


    మహాకవి మహాభాగవతరచన కుపక్రమించినాఁడు. ఆయన ముద్దుల పుత్రిక శారద గంటము చేఁబూని తండ్రి నుడివినదేతడవుగా తాటియాకులపై ముత్యములవంటి యక్షరమాలికను ముద్దు ముద్దుగా దిద్దితీర్చుచున్నది. కవి వరేణ్యునిజిహ్వాంచలమునుండి యమృతలహరి ప్రవహించుచున్నది. భాగవత కల్పవక్షము లలిత స్కంధమై శుకాలాపాభిరామమై మంజులతామోహనమై సువర్ణసుమనస్సుజ్ఞేయమై నానాఁటికిఁ బెంపొందుచున్నది.
    మహాకవి యపారభక్త్యావేశముతో, ననుపమాన ప్రతిభావిశేషముతోఁ గావ్యరచన సాగించుచున్నాఁడు. సహజపాండిత్యుని కవితాకన్యక స్వభావ సిద్ధమగు శయ్యా సౌభాగ్యముతో ననల్పకల్పనా సముల్లాసముతో విశ్వ మోహనముగా విజయనర్తనము సల్పినది.
    భాగవతము పరిపూర్తినందినది. ఆంధ్రుల నోముల పంటయగు భాగవతమహాపురాణము పరిపూర్ణమైనది. అనంతకరుణాసముద్రుఁడగు శ్రీరామభద్రుఁడనుగ్రహించి పలికించినాఁడు; భక్తశిరోమణి పలికినాఁడు.
    తెలుఁగువారి పురాకృతసుకృతఫలము భాగవతము సర్వాంగసుందరముగ సంపూర్ణమైనది. తెలుఁగుతల్లి దివ్య దీప్తులు దిగంతములఁ దేజరిల్లినవి. ఆంధ్రమహాజనుల చిరకాలవాంఛితము నేఁటికి సువర్ణస్వరూప మందుకొనినది. కవిరాజహంస మానందపరవశమై సంతోషసరసిలో నోలలాడినది.

 Previous Page Next Page