త్రిభువన మోహన గోపాలా
(మీరా గీతం)
త్రిభువన మోహన! గోపాలా!
దేవదేవ! రమణీయ కపోలా! ||త్రిభువన||
ఆదరింపవే యదుకుల స్వామీ!
అదుకొమ్ము అఖిలాంతర్యామీ!
కనికరింపవే కారుణ్యసింధూ!
అభయ మొసంగవే ఆపన్నబంధూ! ||త్రిభువన||
నీ ధ్యానము నిండించెను కాంతిని
నీ గానము పండించెను శాంతిని
నీ నవ్వులు విరజాజులు చల్లెను
నీ లీలలు నవమాలిక లల్లెను ||త్రిభువన||
ఆత్మ వీవె పరమాత్మవు నీవే
బ్రహ్మ వీవె పరబ్రహ్మవు నీవే
శివుడ వీవె కేశవుడవు నీవే
సకల చరాచర శక్తివి నీవే ||త్రిభువన||
చల్లగ మలయ సమీరము వీచెను
కొల్లగ మల్లెలు మొల్లలు పూచెను
వెన్నెలదొరవై విచ్చేయుమయా
వెన్నదొంగ! మీరాప్రభు! సదయా! ||త్రిభువన||
గిరిధర గోపాలా
(మీరా గీతం)
గిరిధర గోపాలా! నా
మొర విన రావేలా!
పరిపరి విధముల ప్రార్ధించితిరా
బ్రతుకంతా నీ కర్పించితిరా ||గిరిధర||
నా దేహం గేహం నీవెరా
నా గానం ధ్యానం నీవెరా
నా అభిసరణం నా సంస్మరణం
నా అంతఃకరణం నేవేరా ||గిరిధర||
కరమున చిరుతలు పట్టుకొంటిరా
కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటిరా
తిరుమణి తిలకం దిద్దుకొంటిరా
పరవశించి నిను పాడుచుంటిరా ||గిరిధర||
కన్నుల పొంగిన కవోష్టధారా
నున్నని చెక్కులపై దిగజారా
బ్రతుకంతా ఒక ఏకతారా
ప్రణయరాగ రాగిణి ఈ మీరా ||గిరిధర||
ఎందు దాగెనో నందకీశోరుడు
(మీరా గీతం)
ఎందు దాగెనో నందకిశోరుడు
కందోయికి కనరాదేమే!
చిందులు త్రొక్కే శ్యామసుందరుడు
బృందావనమున లేడేమే! వా ||ఎందు దాగేనో||
నల్లని మబ్బులు జల్లు కురిసెనే
చల్లని మలయానిలము దరిసెనే
తెల్లని వెన్నెల వెల్లివిరిసెనే
మల్లెల తావికి మనసు మురిసెనే ||ఎందు దాగెనో||
ఎప్పటి నుంచియొ ప్రియుని కోసమై
ఎదురు చూచుచున్నానే
రెప్పలు వాల్పక యమునా తటమున
రేయంతా మేల్కొన్నానే! వా ||ఎందు దాగెనో||
అచ్చమైన రాఠౌర్ వంశమునకు
మచ్చ తెచ్చినా నన్నారే
"పిచ్చిపిల్ల మీరా" అని లోకులు
గ్రుచ్చి గ్రుచ్చి కనుగోన్నారే! వా | |ఎందు దాగెనో||
శ్యామసుందర గోపాల్
(మీరా గీతం)
శ్యామసుందర గోపాల్! హి గోకుల
స్వామీ! గిరిధరలాల్!
హేమాంబర మణికుండలధారీ!
ప్రేమసుధారస రాసలిహారీ! |\శ్యామ||
ఆరాధనలో రాధ నైతిరా
ఆవేదనలో బాధ నైతిరా
అరుణారుణ విరహసల విచలిత
కరుణామయ ప్రియగాధ నైతిరా ||శ్యామ||
మణిపేటికలో ఫణిని పెట్టి బహు
మానముగా ప్రభు పంపెనురా
కాలనాగు నీ కారుణ్యముచే
పూలమాలగా మార్పునందేరా ||శ్యామ||
ప్రాణము తీయగ రాణాజీ విష
పాత్రము నాకై పంపెనురా
ప్రభుదయచే మీరా కా విషమే
పాదామృతముగ పరిణమించెరా ||శ్యామ||
నీవు లేక నేనూ
(మీరా గీతం)
నీవు లేక నేనూ - నిలువలేను స్వామీ!
కావు మనుచు వేడా - కనికరింపవేమీ! ||నీవు లేక||
వృక్షరాజ మీవూ - విహంగమును నేనూ
తమ్మికొలను వీవూ -- తళుకు మీను నేనూ ||నీవు లేక||
చందమామ వీవూ -- చకోరమును నేనూ
మహాగిరివి నీవూ - మయూరమును నేనూ ||నీవు లేక||
ఆణిముత్తే మీవూ - లోని దార మేనూ
మధురమురళి వీవూ - ,మనోగీతి నేనూ ||నీవు లేక||
నాదు స్వామీ వీవూ - పాదదాసి నేనూ
భక్తురాలు మీరా -- ప్రభూ! ఏలుకోరా! ||నీవు లేక||
అంతట నీవే స్వామీ
అంతట నీవే స్వామీ! అగు
పింతువేమి? హృదయాంతర్యామీ! ||అంతట||
దివ్వెల వెలుగుల నీవే! చెలి
మువ్వల రవళుల నీవే!
నవతలోన మానవతలోన కవి
కవితలోన దివి సవితలోన జగ ||మంతట||
క్రొన్నెల లోపల నీవే! పండు
వెన్నెల లోపల నీవే!
గిరులయందు నిర్ఘరులయందు వన
తరులయందు క్రొవ్విరులయందు జగ ||మంతట||
ఏరువాకలో నీవే! అల
పూరిపాకలో నీవే!
విందులలో హిమబిందులలో పసి
కందులలో సిరి చిందులలో జగ ||మంతట||
కరగిపోదునా ప్రభూ
కరిగిపోదునా! ప్రభూ
కలిసిపోదునా!
నాలోపల లోలోపల
నవ్వుతున్న నీలోపల ||కరిగి||
ఆటలలో అందమట్లు
పాటలలో చందమట్లు
తేటతెనుగు మాటలలో
తీయని మకరందమట్లు ||కరగి||
చిక్కని సిగ్గులు చిందే
చక్కని చెక్కిళ్ళ చెంత
మేలిముసుగు సవరించే
మెత్తని చిరునవ్వు లాగు ||కరగి||
కార్తిక రాకా సుధాంశు
కొముదీ ప్రవాహములో
మెలమెల్లగ పయనించే
లలిత వేణుగీతికా వలె ||కరగి||
మంద మంద మలయానిల
మధుర పరిష్వంగములో
పరవశించి పరిమళించి
విరిసే విరజాజి లాగు ||కరగి||
స్వామీ నీ కృపాకటాక్షం
స్వామీ! నీ -- కృపాకటాక్షం
మా ముంగిటి - కల్పవృక్షం
ఏ మాత్రం నీ దయ ఉన్నా
ఏమున్నది అసాధ్య మన్నది ? ||స్వామీ||
దృష్టిలేని -- పుట్టుగ్రుడ్డి
సృష్టి నెల్ల -- సందర్శించుచు
నడవలేని -- కుంటివాడు
నగములనే ఉల్లంఘించును ||స్వామీ||
భిక్షమెత్తు బీదవాడు
లక్షగ్రామములు శాసించును
మాటరాని మూగవాడు
మహావక్త యై బాషించును ||స్వామీ||
బండ వధూమణిగా మారును
కొండలు జలములలో తేలును
శాఖామృగ మది శతయోజన
సముద్రమును తరింపజాలును ||స్వామీ||
కారుణ్య సుధావారాశీ!
కనికరింపుమో అవినాశీ!
సూరదాస హృదయనివాసీ!
చారు వేణుగానోల్లాసీ! ||స్వామీ||