Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 67
పోతన భార్య పేరు లక్ష్మి. ఆమె నిజముగ పోతనపాలిటికి భాగ్యలక్ష్మియే. పతికిఁదలలోని నాల్కయై, యత్తమామలమాట కడుగుదాఁటక యా సాధ్వీశిరోమణి తన సుగుణపుంజములచే నెల్లర మెప్పువడయుచుఁ గాఁపురము చేయుచుండెను.
లక్ష్మి భాగ్యవంతులయింటి బిడ్డ. కవిసార్వభౌముఁడని విశ్వవిఖ్యాతి గడించిన శ్రీనాథునికి గారాబు సోదరి. బాల్యమాదిగ నెండక న్నెఱుంగక పువ్వులలోఁ బెరిగినది. నేఁడు బీదవారింటి కోడలయినది. అయినను నాయొప్పుల కుప్ప యొక్కింతయుఁ జింత యనుమాట యెఱుంగక యత్తవారింటి కలంకారమై, యిరుగుపొరుగు వెలందుల కాదర్శమై, శాంతికి నిలయమై, పతిభక్తికిఁ బట్టుకొమ్మయై యలరారు చుండెను. రామచిలుకలవలె నన్యోన్యమైత్రితో మెలఁగుచున్న కొడుకును గోడలిని జూచి వృద్ధదంపతులు మిక్కిలి యానందించిరి.
కొంతకాలమునకు లక్ష్మీపోతనామాత్యుల కొక పుత్రుఁడును బుత్రికయు జన్మించిరి. కుమారునకు మల్లనయనియును, గుమార్తెకు శారద యనియును నామకరణము గావించిరి. దాంపత్యతపఃఫలములగు నాబిడ్డల నిర్వురఁగడుంగడు గారాబమునఁ బెంచుచుఁ బోతనామాత్యుఁడు పరమేశ్వర పాదారవింద ధ్యాన పారవశ్యముతోఁ గాలక్షేపము సేయుచుండెను.
పోతన కుటుంబమువారు మొదటి నుండియు భాగ్యవంతులు గారు. వారల దొక సామాన్యకుటుంబము. చాల దినములనుండియు వ్యవసాయమే వారలకు జీవనాధారమై యుండెను. పోతనామాత్యుఁడును పరంపరాగతమగు కులవృత్తిని విడువలేదు. తన తాతముత్తాతలవలెనే తనతండ్రికేసనామాత్యునివలెనే తానుగూడ కర్షకుఁడై నాగలిఁబట్టి వ్యవసాయమును జేసెను. భూమినిదున్ని సస్యశ్యామలము గావించెను. భూమాత చలువవలనను, శ్రీరామచంద్రమూర్తి కరుణాకటాక్షమువలనను పోతన యన్న పానీయములకుఁ గఱవులేక యున్నంతలోనే తాను దిని యతిథిసత్కారములు గావించుచుండెను. ఆఁకలి గొనివచ్చిన యాభ్యాగతుఁడెవ్వఁడును నా మహాత్ముని యింటికి వచ్చి నిరాశతోఁ దిరిగిపోలేదు. బిచ్చమునకు వచ్చిన బీదసాదలెవ్వరును పోతన యింటిముందు నుండి వట్టిజోలెతో మరలిపోలేదు. ఆయన కలిగినంతలో దానశీలుఁడు. భగవంతుఁడిచ్చినంతలో పరోపకార పరాయణుఁడు.
పోతనామాత్యుఁడు కవియును గర్షకుఁడునేకాక మహాభక్తుఁడు. చిన్నతనమున పొలములోఁ గావలిగాచునప్పుడు చిదానందయోగీంద్రుఁడుపదేశించిన మహామంత్రము నాతఁడు మరవలేదు. నిలుచుండినను, గూర్చుండినను, నిద్రించుచుండినను, భోజనము చేయుచుండినను, నీరుద్రావుచుండినను పోతనామత్యుని చేతము నిరంతర పరమేశ్వర పదకమల సంస్మరణాసక్తమై యుండెను.
పోతన మహాకవియనియు, పరమభక్తాగ్రగణ్యుఁడనియు, పవిత్ర మూర్తియనియు నాయనకీర్తి దేశామంతయు వ్యాపించెను. వివిధ ప్రాంతములనుండి యసంఖ్యాకులగు శిష్యులు వచ్చి యాయనయొద్ద విద్యాభ్యాసము గావించు చుండిరి. అనన్యసామాన్యమగు నాయన నిరాడంబర జీవితమును గాంచి జనులు పెక్కు విధముల నాధన్యమూర్ధన్యునిఁ గొనియాడు చుండిరి. బావగారగు శ్రీనాథ మహాకవియును నప్పుడప్పుడు వచ్చి సోదరిని మేనల్లుని మేనకోడలినిఁ జూచి పోవుచుండెను. వచ్చినప్పుడెల్ల బావగారి సాత్త్వికస్వభావమునకు, నిరాడంబర వేషమునకు, నిరంతర వ్యవసాయ దీక్షకుఁ బోతనామాత్యుని వేళాకోళములు సేయుచుండెను.
శ్రీనాథుఁడు సామాన్యుఁడు కాఁడు, కవి సార్వభౌముఁడు. మహారాజుల మన్ననలు పొందినవాఁడు. కంచుఢక్కలు పగులఁగొట్టి కనకాభిషేకము లందినవాఁడు రాజాస్థానములలో కవితాసుధారసమును జిందించి రత్నహారములను, బంగారు పతకములను బహుమానము లందినవాఁడు. పుట్టుభోగి, అదృష్టవంతుఁడు. అట్టివానికిఁదన ప్రియసోదరి యొకసామాన్య గృహస్థునకు భార్యయై మెడలో నల్లపూసలలోనికిఁ దెల్లపూసలేక కాపురము సేయుచుండుట నచ్చలేదు. పోతన కవితాశక్తి యతఁడెఱుఁగును. ఎట్లయిన బావమరది చేత చక్కని గ్రంథములు వ్రాయింపఁజేసి రాజాస్థానములకు బలవంతముగా నైనఁ గొనిపోయి పోతనను ధనవంతునిఁగావింపవలెనని యాతఁడాలోచించుచుండెను. కాని పోతనా మాత్యుని స్వభావ మందులకు సంపూర్ణముగ వ్యతిరేకమయ్యెను.
శ్రీనాథునకు ధారుణీపతులనిన నెంత గౌరవమో పోతనామాత్యునకు వారనిన నంత చిరాకు. శ్రీనాథునకు రాజభోగములనిన నెంత కుతూహలమో పోతనకు వానిపైనంత యసహనము. ఆయనకు రాజాశ్రయమన్న నెంత యిష్టమో ఈయనకు నంత కష్టము. ఒకరి కాడంబరముపై నాసక్తి; మరొకరికి నిరాడంబరతపై రక్తి. ఒకరికి భోగ భాగ్యములపై బుద్ధి; వేరొకరికి త్యాగమయ జీవనముపై బుద్ధి. భావమఱఁదు లిరువురకును భావములందును స్వభావములందును ఐక్యము సంభవింపలేదు.
3
అది యొకనాఁటి ప్రాతఃకాలము. అప్పుడే సూర్యోదయమయ్యెను, సూర్యభగవానుని సువర్ణకిరణములు భూమాత ప్రేమమయ హృదయముపై ననురాగకాంతులు విరఁజిమ్ముచుండెను. నవయౌవనములో నున్న మల్లన పిల్లరైతువలె మేడిఁబట్టుకొని పొలములో అరక దున్ను చుండెను. తండ్రి పోతనామత్యుఁడు కొంచెముదూరములో చేనిగట్టుపై నాసీనుఁడై కుమారుని వ్యవసాయసామర్థ్యమును రెప్పవాల్పక గమనించుచుండెను.
అరక నాలుగైదుసారులటునిటు తిరిగినది. కొంచెము కొంచెము ప్రొద్దెక్కసాగినది. ఇంతలో దూరమునుండి పల్లకీమ్రోత వినిపించినది. మల్లన చటుక్కున తలయెత్తి చూచెను. వట్టి పల్లకిగాదు; పట్టుకుచ్చులపల్లకి.
ముందు నలువురు వెనుక నలువురు బోయీలు మోయుచుండిరి. ఆ యందలమునందు శ్రీనాథకవి సార్వభౌముఁ డాసీనుఁడై యుండెను. పల్లకి చేనికి సమీపముగా నున్న మార్గమునఁ బోవుచుండెను. మల్లన వృషభమూలా నిలిపి మామగారి మహైశ్వర్యమును రెప్పవేయక చూచుచు నిలబడెను.
పట్టుకుచ్చుల పల్లకిలోఁ బ్రయాణమై పోవుచున్న పండితకవిశేఖరుఁడు గట్టుపైఁ గూర్చుండియున్న కర్షకవరుని గాంచినాఁడు. శ్రీనాథుని యరుణాధరములపై చిరునగవు చిందులాడెను. తన మహత్త్వమును బావగారికిఁ జూపింపవలయునని కుతూహల పడినాఁడు. పల్లకిమోయుచున్న ముందువైపు బోయీలను తొలఁగుడని పలికినాఁడు. బోయీలు తప్పుకొనిరి. కాని యాయందలము యథా ప్రకారముగానే ముందునకు సాగిపోవుచుండెను.
ఈయద్భుతదృశ్యమును జూచునప్పటికి మల్లన మహానందపరవశుడయ్యెను. అతడు తండ్రియగు పోతనామాత్యునిబిలిచి "నాన్నగారూ! అటు చూడుఁడు. మామయ్య గొప్పదనము! ఆహా! ఏమి ప్రభావము! ఎంత మంత్రశక్తి! పల్లకి ముందువైపు మోఁతగాండ్రు లేకయే ముందుకు పోవుచున్నది" అని పలికెను. బాలకుని పలుకులు విని భక్తశిఖామణియగు పోతన మందహాసవదనారవిందుఁడై "నాయనా! ఎందుల కంత వింతపడియెదవు? నీవును నీ యెద్దు నొకదానిని విప్పివేయు"మనెను. మల్లన యాశ్చర్యముతో కుడివైపుకాఁడికిఁ గట్టియున్న వృషభమును దొలఁగించెను. అయినను అరక అవ్యాహతముగ ముందుకు నడచిపోవు చుండెను. ఇదియంతయుఁజూచి శ్రీనాథమహాకవి రెండవ వైపు బోయీలను సైతము పల్లకి విడిచి పెట్టుఁడని యాజ్ఞాపించెను. బోయీలు దండెవిడిచి దూరముగాఁ బోయిరి. కవి సార్వభౌముని బ్రాహ్మీదత్త వరప్రభావమువలన పల్లకి పూర్వమువలెనే పోవుచుండెను. ఇది చూచినా వెంటనే మల్లన మరల తండ్రిముఖమువైపు గనుఁగొనెను. పోతనార్యుఁడు "మల్లన్నా! మనముమాత్ర మూరకుందుమా యేమి! రెండవ వైపు గిత్తనుగూడ విప్పు" మనెను. మల్లన యట్లేగావించెను. అరక యథాప్రకారముగా సాగిపోవుచుండెను.
శ్రీనాథుఁడిదియంతయుఁగాంచి పోతనామాత్యుని శక్తి కచ్చెరువందెను. ఆయనకూడఁ దనవలెనే మహిమ సంపన్నుఁడని గ్రహించెను. ఇఁక తన యాట లయనముందర సాగవని తలంచెను. వెంటనే పల్లకి దిగి పోతనామాత్యుని సమీపమునకుఁ జనుదెంచెను. పోతనామాత్యుఁడును గుమారునితో మఱఁదిగారి కెదురువచ్చెను. శ్రీనాథుడు పోతనను సవిలాసముగఁ జూచుచు నొకింత మందస్మితము గావించి "హాలికులకు క్షేమమా" అనెను. వెంటనే పోతనా మాత్యుఁడు బావగారి కిట్లు సమాధానమిచ్చెను.
Previous Page
Next Page