Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 66


                                 బంగారుతల్లి
    
    అమ్మా! అలమేలు మంగమ్మా!
    ఆలింపవే మొరల తేలింపవే సిరుల
    పాలింపవే మమ్ము పద్మవతమ్మా!                  ||అమ్మా||

    శ్రీలు విరాజిల్లు పాలవెల్లిని నీవు
    కలుములు వెదజల్లు కల్పవల్లివి నీవు
    కలువరాజు గారాబు చెల్లివి నీవు
    భక్తుల పాలి బంగారు తల్లివి నీవు                 ||అమ్మా||

    వేదములు నీ దివ్య పాదమంజీరాలు
    నక్షత్రములు నీకు నవరత్నహారాలు
    మందహాసము చిందు సౌందర్యలహరీ!
    అందుకో మాపూజ ఆనందలహరి!                ||అమ్మా||

    సంపద లిచ్చేటీ సౌభాగ్యలక్ష్మీ!
    సేవలకు మెచ్చేటి శ్రీవిజయలక్ష్మీ!
    శ్రీలక్ష్మీ! వరాలక్ష్మీ! శ్రీ మన్మహలక్ష్మీ!
    అల శ్రీనివాసుని అర్ధాంగలక్ష్మీ!                    ||అమ్మా||

    జనని! నీ అర్చనలు సర్వోదయశ్రీలు
    తల్లి! నీ దీవనలు ధర్మవిజయశ్రీలు
    మాత! నీ నయనాలు మధుర కరుణశ్రీలు
    జగమంత నీస్వామీ స్వర్ణోత్సవశ్రీలు                ||అమ్మా||


                          మువ్వలగోపాల
    
    మువ్వలగోపాలా! చిరు
    నవ్వుల గోపాలా!
    ముజ్జగములు మురిపించే మురళీ
    మోహన గోపాలా! మురళీ
    మోహన గోపాలా!                      ||మువ్వలు||

    ముద్దుల గోపాలా! వెన్న
    ముద్దలా గోపాలా!
    నిద్దపు నుదుటను నీటుగ కస్తురి
    దిద్దిన గోపాలా! కస్తురి
    దిద్దిన గోపాలా!                            ||మువ్వల||

    చక్కని గోపాలా! చేతికి
    చిక్కని గోపాలా!
    అక్కడ ఇక్కడ చెక్కుల చెలిపలు
    నొక్కుల గోపాలా! చెలిపలు
    నొక్కుల గోపాలా!                           ||మువ్వలు||

    కులుకుల గోపాలా! జిలిబిలి
    పలుకుల గోపాలా!
    తిలకించిన మెయి పులకించే కను
    తళుకుల గోపాలా! కను
    తళుకుల గోపాలా!                           ||మువ్వల||

    వలపుల గోపాలా! తియ్యని
    పిలుపుల గోపాలా!
    తొలి తలపుల కలగలపుల అరమేల్
    కొలువుల గోపాలా! అరమేల్
    కొలువుల గోపాలా!                           ||మువ్వల||

    
                          ప్రభువు వేణువు పలికించేనే

    ప్రభువు వేణువు పలికించేనే! ఈ
    ప్రకృతి సర్వము పులకించెనే! నా           ||ప్రభువు||

    సభమున చంద్రుడు తిలకించేనే! చిరు
    నవ్వుల వెన్నెల లోలికించేనే
    చక్కని తీవలు తరులు సరస్సులు
    చిక్కని మధువులు చిలికించేనే! నా         ||ప్రభువు||

    ఎండిన మ్రోడులు చివురించేనే! పెను
    బండల గుండెలు ద్రవించేనే
    ఆనందముతో రాధా హృదయము
    యమునానదియై ప్రవహించేనే! నా         ||ప్రభువు||

    లేగలు చెవులోగ్గి వినసాగెనే
    లేళ్ళు వింతగా కనసాగెనే
    అణువణువున బృందావన మంతట
    ప్రణవనాదములు మార్మ్రోగెనే! నా            ||పభువు||

    
                                   స్వామిని ఎటు లర్చించినదో

    స్వామిని ఎటు లర్చించినదో!
    భామిని ఏమని ప్రార్ధించినదో!        ||స్వామిని||

    గుడిలో గంటలు ఖంగున మ్రోగగ
    గుండెలలో కోర్కెలు కొనసాగగ         ||స్వామిని||

    విచ్చీవిచ్చని విరిమొగ్గలతో
    సిగ్గులు చిందే చిరుబుగ్గలతో           ||స్వామిని||

    అగరు ధూప సుగంధమ్ములతో
    మధురాక్షర పదబంధమ్ములతో        ||స్వామిని||
    
    చెవిలోపలి చెంగలువ జారగా
    ఎదలో తీయని తలపు లూరగా         ||స్వామిని||

    
                             మహాదేవ శంభో
    
    మహాదేవ శంభో! హర హర
    మహేశా! స్వయంభూ!
    ఉమామనోహర! హిమాంశు శేఖర!
    నమో నమో అభయంకర శంకర!                 ||మహాదేవ||

    ఫణీంద్రభూషణ! మునీంద్రపోషణ!
        అనుగ్రహించవయా!
    ప్రపన్న రక్షణ! వివక్ష శిక్షణ!
        పరిగ్రహించవయా!

    వారణాసిలో విశ్వేశ్వరుడవు
    దక్షవాటిలో భీమేశ్వరుడవు
    శ్రీపర్వతమున మల్లేశ్వరుడవు
    జగాల నేలె సర్వేశ్వరుడవు                         ||మహాదేవ||

    మురారి రంజన! సురారి భంజన!
        మొరలాలించుమయా!
    ప్రపంచకారణ! విపన్నివారణ!
        పరిపాలించుమయా!

    దుండగులను దండింపుమయా!
    దురాగతుల ఖండింపుమయా!
    జయశ్రీలు నిండింపుమయా!
    దయామయా! జయ జయ! మృత్యుంజయ!      ||మహాదేవ||

    
                          అందాల నటరాజ

    అందాల నటరాజ ! అందుకో నా పూజ
    ఎందుకో నాగుండె చిందిపోవుచుండె            ||అందాల||

    కందళించె విరాళి మందాకినీ మౌళి!
    అలసించేదవేమి అఖిలలోకస్వామి!             ||అందాల||

    గంగాతరంగమై పొంగే నా హృదయమ్ము
    అవధరింపుము ప్రభూ! అమృతాభిషేకమ్ము     ||అందాల||

    మనసు అరవిందమై మమత మకరందమై
    విరిసింది నీ ముందు వేగగొను మీ విందు        ||అందాల||

    సర్వస్వమును నీవ శంభో ! మహాదేవ!
    నిముసమును నిను బాసి నిలువలేదీ దాసీ       ||అందాల||


                             మహేశా స్వయంభూ

 

    మహేశా! స్వయంభూ! శివశివ
    మహాదేవ శంభూ! జయ జయ           ||మహేశా||

    జటాజూటమును విడలింపుమయా
    నిటాలేక్షణము కదలింపుమయా
    హుటాహుటిని రిపుపటాలముల ఫేట
    ఫెటార్భటులతో భేధింపుమయా           ||మహేశా||

    కరాళమాలను ధరింపుమయా
    పురాంతకుడవై చరింపుమయ్యా
    పరాక్రమశ్రీ భరించి దూర్తుల
    దురాక్రమణలను హరింపుమయ్యా        ||మహేశా||

    మహానటుడవై నటియింపుమయా
    మహోదయమ్మును ఘటియింపుమయా
    ధర్మద్రోహుల దహింపుమయా
    జయజయ! గౌరీప్రియ! మృత్యుంజయ!    ||మహేశా||

    
                            కన్నయ్యా
                                     (మీరా గీతం)

 

    కన్నయ్యా ! నా
    కన్నుల విందగుమయ్యా!                   ||కన్నయ్యా||

    శిరమున విరిసే శిఖిపింఛముతో
    ఉరమున మెరిసే వైజయంతితో
    సొగసులు కురిసే నయనమ్ములతో
    సిరిసిరి మువ్వల చరణమ్ములతో            ||కన్నయ్యా||

    గజ్జెల మొలత్రాడు గలగల మ్రోగగా
    ముజ్జగములు చిరుబొజ్జలో నూగగా
    మోవిపై పిల్లనగ్రోవి పలుకగా
    మధుర మధుర మధురసము లొలుకగా    ||కన్నయ్యా||

    ముద్దులొలుకు నీ మోహనవదనం
    అందాలు చిందే ఆనంద సదనం
    నీ సన్నిధానమే నా పెన్నిధానం
    దర్శనమీరా దాసీ యీ మీరా                  ||కన్నయ్యా || 
   

 Previous Page Next Page