Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 66


                         పోతన మహాకవి

                                               1

    అది నయనానందసంధాయకమగు నొక సుందర క్షేత్రము. సస్యశ్యామలమగు నా పొలము భూదేవి ధరించిన యాకుపచ్చనివలువ వలె వెలుఁగొందుచుండెను. అక్కడక్కడ చక్కఁగా విరియఁ బూచియున్న జనుపచెట్లు బంగారుపూవులవలెఁ బ్రకాశించుచుండెను. ముగ్గినదోసపండ్ల సువాసన మార్గమునఁబోవు బాటసారులకు నోరూరఁ జేయుచుండెను. కంటినిండఁగానవచ్చుచున్న నూఁబియ్యపుఁ గంకులు గాలికి నటునిటుగదలాడుచు వచ్చిపోవుపథికులను నాహ్వానించుచుండెను.    
    ఆ పొలమునడుమ పెద్దమంచె యొకటిగలదు. దానిపైఁ బదిపదు నాలుగేండ్ల ప్రాయముగల బాలుఁడొకఁడు నిలుచుండి హస్తమున నొడిసెలను ధరించి పిట్టలను గొట్టుచుండెను. నడుమ నడుమ నేవియో కూనిరాగములు దీయుచు మంచెమీఁ దనుండి గబుక్కున నేలమీఁదికి దుముకుచు కొన్ని మంటిబెడ్డల నొడినిండ నేరుకొని మరల మంచె నెక్కుచుండెను.
    దాదాపు రెండుజాములు గావచ్చినది. సూర్యభగవానుఁడు తన ప్రచండకిరణములతో నాకాశమధ్యమున దేదీప్యమానముగఁ దేజరిల్లుచుండెను. వృక్షచ్చాయలు హ్రస్వములయ్యెను. దూరమునందలి కొండ లాయెండలో వెండి పూఁతలు పూసికొన్నవో యన్నట్లు వెలుఁగొందుచుండెను. మట్టమధ్యాహ్న మగుటచేఁ బక్షులు కొన్ని తలలువంచుకొని పొలములందలి వేఁపచెట్లపైఁ గునికిపాట్లు పడుచుండెను. ఎండ చిటచిటలాడించుచుండెను.
    ఆ సమయమున నాపంటపొలములకుఁ బ్రక్కగానున్న మార్గమున నొక యోగిపుంగవుఁడును గొందఱు శిష్యులును వచ్చుచుండిరి. వారి వదనములవైపు చూచినా చాలదూరము నుండి నడచివచ్చుటచే మిక్కిలి బడలియున్నారని స్ఫురించుచుండెను. అందొకఁడు మెల్లఁగా మంచెవద్ద కరుదెంచి "బాబూ! ఇచ్చట సమీపములో నెందైన పానీయముగలదా? దాహముచే నాలుక లెండిపోవుచున్నవి. ఆకనిపించు గ్రామమునకుఁ బోవలయును. నడువ లేకున్నాము" అని బాలకుని ప్రశ్నించెను.
    బాలకుఁడు చివాలున మంచెమీఁదనుండి నేల కుఱికి "రండు రండు, మా పొలములో మధురజలసంపూర్ణమైన కొలనున్నది. కావలసిన యూచ బియ్యమును దిని కడుపునిండ నీరుత్రావి పోవుదురుగాని" యని వారలనందఱనాహ్వానించెను. ఆ యోగిపుంగవుఁడు శిష్యసమేతుఁడై పొలములోఁ బ్రవేశించెను. బాలుఁడును వారలనందరు వెంటఁబెట్టుకొని క్షేత్రమధ్యమున నున్న జలాశయము చెంతకుఁ గొనిపోయెను. అందఱును గుంటయొడ్డున దట్టమైన వేపచెట్టు నీడలో చల్లగా గూర్చుండిరి. బాలుడు తన దగ్గరనున్న మృణ్మయపాత్రతో జలాశయములోని మధుర జలమును గొనివచ్చి యాభైరాగుల దాహమును బాపెను. కొందఱు మెల్లఁగా కొలనులోనికి దిగి స్వేదబిందు సమ్మిశ్రిత మగు తమ ముఖములను గడుపుకొనుచుండిరి.
    బాలుఁడు పరుగు పరుగునం బోయి పండిన దోసపండ్లను నొడినిండఁ గోసికొనివచ్చి తనవద్దనున్న కొడవలితో ముక్కలు ముక్కలుగా కోసి వారందఱకుఁ బంచిపెట్టెను. అనంతరము గుమ్మటములవంటి జొన్నకంకులను గొనివచ్చి క్షణములో నూఁచబియ్యమునుకొట్టి యతిథులను సంతృప్తులఁగావించెను. దోసిళ్ళకొలఁది తియ్యని యూఁచబియ్యమును మెక్కుచు నా యోగిసముదాయము బాలుని యతిథి సత్కారమును బహుముఖములఁ బ్రశంసించిరి.
    యోగీంద్రుఁడు మిక్కిలి ప్రసన్నుఁడై యర్భకుని యాననము నాలోకించి "నాయనా! మీదేయూరు? నీపేరేమి? జననీ జనకులెవ్వరు? నీ సత్కారమునకుఁ జాలసంతసించితిని; నీకేదైన నుపకారము చేయవలయునని బుద్ధిపొడముచున్నది. నీ ముఖలక్షణములు గాంచిన నీవుగొప్పవాఁడవు కాగలవని తోచుచున్నది" అని ప్రేమ పూర్వకముగా పలికెను.
    బాలుఁడు వినయవినమిత శిరస్కుఁడై హస్తములు జోడించి "స్వామీ! ఆ కనుపించుచున్న ఏకశిలయే మా గ్రామము, నా పేరు పోతన్న యందురు. మా తండ్రి కేసనమంత్రి; తల్లి లక్కమాంబ" యనియెను. యోగీంద్రుఁడు కొంచెమాలోచించి "మంచిది, నీకేమి కావలయునో కోరుకొను" మనియెను. పోతన నవ్వుచు "స్వామీ! నాకు భగవంతుని యనుగ్రహము కావలయును". అని పలికెను యోగిపుంగవుఁడు బాలకుని సదుద్దేశమునకు మిక్కిలి సంతసించుచు "కుమారా! నీవు చదువుకొంటివా" అని మరల ప్రశ్నించెను. పోతన వినయముతో "అయ్యా! మా నాన్నగారే నాకక్షరాభ్యాసముగావించి విద్యాబోధనము సలిపినారు. కాళిదాసత్రయము పూర్తియైనది. ఆంధ్ర భారతముగూడ పఠించితిని" అని పలికెను. పోతన మాటలకు యోగి లలాముఁ డమందానందకందళిత హృదయుఁడై "కవిత్వము కూడ చెప్పెదవా? యనెను. "చిత్తము! తమ దయవలన నిప్పుడిప్పుడే గీతపద్యముల వ్రాయుచున్నా" నని పోతన సమాధాన మిచ్చెను. యోగి కుతూహలముతో "బాబూ! ఏదీ యొక్క పద్యమును చదువుము వింద"మని పలుకుచుండఁగనే పోతన తన మృదుమధుర కంఠమెత్తి ఇట్లు చదివెను:

    తే|| చేతులారంగ శివుని బూజింపఁడేని
    నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
    దయయు సత్యంబులోనుగాఁ దలపఁడేని
    కలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు

    పద్యమును విని పట్టరాని సంతోషముతో నాయోగీంద్రుఁడు పోతనను గౌఁగిలించుకొని "నాయనా! నీవు మహాకవివి కాఁగలవోయి! నీ సంకల్పము సత్యమగు మానవజీవితమును బ్రకటించుచున్న"దని బాలుని సమీపమునకుఁ బిలిచి యొక మహామంత్రము నుపదేశించి "నీవు దీనిని స్మరించు కొనుచుండుము. నీకుఁ బరమేశ్వరానుగ్రహము గలుగఁగల" దని వచించెను. పోతనయుఁ జేతులుమోడ్చి "ఇదంతయును తమ యవ్వాజానురాగము" అని యోగికి నమస్కరించెను. యోగీంద్రుఁడు తన పవిత్రహస్తముతోఁ బోధన శీర్షమును స్పృశించుచు "చిరంజీవి వగుదువుగాక" యని యాశీర్వదించెను.

                              2

    పోతనకు యుక్తవయస్సు సంప్రాప్తించెను. దూరదూరములనుండి సంబంధములు వచ్చుచుండెను. తల్లియగు లక్కమాంబయును దండ్రియగు కేసనమంత్రియును యోగ్యమగు సంబంధమును వెదకి కుమారునకు వివాహము సేయ సంకల్పించిరి. కాని మొదటినుండియు పోతనకు నైహిక విషయములయందంతగా నాదరబుద్ధిలేకుండెను. తల్లిదండ్రులు పరిణయమును గూర్చి ప్రస్తావించినప్పుడెల్ల నేదియో వంక చెప్పి తప్పించుకొనుచుండెడివాఁడు. ఆయన కాలమంతయును వ్యవసాయము చేయుటయందే గడచిపోవు చుండెను. ప్రొద్దుననే యెద్దులను దోలుకొని పొలము పోవుటయన్న నాయన కెక్కడలేని సంతోషము. అక్కడ కొంతసేపు పొలముదున్ని వృషభములలపు దీర్చుకొనుటకై యరకనాఁపి తాను పొలము గట్టుపైఁ గూర్చుండి ఆకాశమునఁ బరువెత్తు పక్షులను, ఆకాశమంటుచున్న పర్వతములను, సస్యశ్యామలము లయిన క్షేత్రములను, ప్రకృతిమాత ప్రణయాంకమున చిరునవ్వులు చిందించుచున్న గడ్డిపూలను జూచి యానందించుచు భగవానుని మహిమలకు నక్కజపడుచుండెను. ఈ విధముగా పోతన పరాధీన మనస్కుఁడైయుండుట గాంచి జననీజనకులు కుమారుని స్వభావమునకు మిక్కిలి చింతించిరి. వివాహము చేసినఁ గాని పోతన బాగుపడఁడని నిశ్చయించిరి. తగిన సంబంధమును విచారించి ఒకానొక శుభముహూర్తమునందు తమ నందనునకుఁ గల్యాణము గావించిరి.

 Previous Page Next Page