Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 65

 

                                             అనురాగలహరి
                                      (లలితగీతికా కదంబము)

                                          అనుభూతి తారంగం

    ఆత్మీయులు "కరుణశ్రీ' డా|| జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించిన ఈ 'అనురాగలహరి" గేయ సంపుటిని అత్యంత అదరభావంతో చదివి ఆనందించాను; హాయిగా పాడుకుంటూ పరవశించాను.

        "ఆటలతో అందమట్లు పాటలతో చందమట్లు
        తేట తెనుగు మాటలలో తీయని మకరందమట్లు"

    కనిపించే ఈ గేయాల్లో దైవమందిరం లాంటి కరుణశ్రీ గారి హృదయాన్ని నిత్య సుందరమైన అయన జీవితాన్ని చూశాను. చైతన్యం జీవితలక్ష్యంగా స్వాతంత్ర్యం అంతస్సాక్ష్యంగా రూపుదిద్దుకొన్న ఈ గేయాల్లో జాలువారిన భక్తికి, దేశభక్తికి భాష్యం చెప్పవలసిన అవసరం లేదు. కానీ --
    'వేదములు నీదివ్యపాదమంజీరాలు నక్షత్రములు నీకు నవరత్నహారాలు
    మందహాసముచిందు సౌందర్యలహరీ! అందుకో మాపూజ అనందలహరి!"
    అంటూ అలమేలు మంగమ్మకు చేసిన అగ్గింపులో మెరిసిన శంకర భగవత్పాదుల సౌందర్యలహరి, ఆనందలహరి - కావ్యాల్ని గానీ, అదే గీతపుటాఖరుచరణంలోని కరుణశ్రీ గారి ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ - కావ్యాల్ని గానీ గుర్తుకు తెచ్చుకోకుండా ఎలా వుండగలను? మరి, కరుణలేని వట్టి గడ్డిబొమ్మల్లాంటి "మనిషి"ని
    'చక్కని చిలుకల పంజరమున నిడి రెక్కలు దూస్తావెందుకూ?
    'కో'యని నిద్దురలేపే కోళ్ళను గొంతులు కోస్తావెందుకూ?"
    అని ప్రశ్నించిన వారి రసార్ధ్రహృదయాన్ని తలుచుకోకుండా ఎలా వుండగలను?
    కరుణశ్రీ గారి సంస్కృతాంధ్ర హిందీ భాషా పాండిత్యాల్ని ఏకరువు పెట్టటం కాదు గానీ మీరా గీతాల్ని, భజరే సప్తాశ్వమనే సంస్కృత గీతాన్ని ప్రత్యేకంగా పరామృశించటమే కాకుండా -- దినరాజస్తుతిలోని చివరి చరణంలో దాగిన-

    "బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం
    సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిశ్చ దివాకరః"
    అనే శ్లోకాన్ని ధ్యానించకుండా ఎలా వుండగలను?

    ఇంతటి ఆనందాన్నీ ఇలా నాలుగు మాటలు చెప్పుకునే అదృష్టాన్నీ నాకు కలిగించిన "శుభాంగి' సాంస్కృతిక సమితి కార్యదర్శికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ -- ఈ గేయాలకు విన్సృత ప్రచారం రావాలని కోరుకుంటూ -

                                                                                               బుధ విధేయుడు
                                                                                               ఆచార్య తిరుమల

                                                      శ్రీసూక్తం

    సరస్వతీదేవికి సంగీత సాహిత్యాలు రెండూ జంటబాయని చంటిబిడ్డలు. అయితే పద్యంలో సంగీతం కంటే సాహిత్యానికి ప్రాధాన్యం. పాటలో సాహిత్యం కంటే సంగీతానికి అగ్రతాంబూలం.

    పద్యం శబ్ద అర్ధ ఛందస్సుల త్రివేణి అయితే పాట సంగీత సాహిత్య రాగ లయ తాలముల పంచకల్యాణి.
    హృదయంలో నుంచి కదలటం, హృదయాలను కదిలించటం ఈ రెండింటికి సమానధర్మం.
        త్యాగయ్యగారి పాటలను "కృతులు" అన్నారు.
        క్షేత్రయ్యగారి పాటలను "పదాలు" అన్నారు.
        అన్నమయ్య గారి పాటలను "సంకీర్తనలు" అన్నారు.
    పాటలో మాటలు ఉన్నట్లే మాటలలో కూడా పాట ఉంటుంది. కొందరు మాటలాడుతుంటే పాటపాడుతున్నట్లే అనిపించుతుంది. మరి వారు పాడుతుంటే ఇక చెప్పేదేముంది - విపంచి మేళవించినట్లే ఉంటుంది.

    మన తెలుగు తోటలో కోకిలపాటలకు కొదువలేదు. ఎందరో గాయనీమణులు మరెందరో గాయకాగ్రణులు తమ కమ్మని కంఠాలలో గానసుధలు చిందించి వీనులకు విందు చేస్తున్నారు. అటువంటి సంగీతసరస్వతీస్వరూపుల నోటివెంట ఈ పాటలు వెలువడాలనీ ఆబాలగొపాలాన్నీ అలరించాలని అభిలాషిస్తున్నాను.
    ఈ నా 'అనురాగలహరి" ని ప్రధమంగా ప్రచురిస్తున్న 'శుభాంగి" ని, శుభాంగి కార్యదర్శి ఐన శ్రీ పి.వి. సూర్యనారాయణమూర్తి గారిని అభినందిస్తున్నాను.
    ఈ 'అనురాగలహరి " కి "ఒక అనుభూతితరంగం" అందించిన ఆప్తమిత్రులు శ్రీ ఆచార్య తిరుమలగారికి నా సాధువాదాలు.

                                                                                                       -కరుణశ్రీ
    
                                                 ఫోటో

                                    నా కవితా ఖండికలను
                                      ఖండఖండాంతరాల
                                      అశేషప్రజానీకంలో
                                    విశేషప్రచారం చేసిన
                                           ఆత్మీయుడు
                                    అమృతహృదయుడు
                                      అమరగాయకుడు
                               పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు
                                       నా 'అనురాగలహరి" ని
                                         అనురాగపూర్వకంగా
                                                అంకితం    
                                              చేస్తున్నాను

                                                                                                - కరుణశ్రీ

                                జయ శ్రీనివాస

    జయ జయ పద్మావతీ హృదయేశ్వర!
    శేషగిరీశ్వర! శ్రీ వెంకటేశ్వర!        ||జయ జయ||

    ఏడుకొండలమీద వేంచేసినావా!
    ఈరేడు లోకాలు  ఏలుతున్నావా!
    దేవాదిదేవా! వేవేగ రావా!
    శరణాగతుల గావ --- కరుణార్ధ్రభావా!        ||జయ జయ||
    
    పిలిచిన "ఓ" యని పలికేటి స్వామీ!
    అడుగడుగు దండాలు అందుకోవేమీ?
    శుభములు పొంగే విభుడవు నీవే
    అభయ మొసంగే ప్రభుడవు నీవే              ||జయ జయ||

    నీ సుప్రభాతాలు నిత్యకల్యాణాలు
    నీ కాంతి వలయాలు ఆనంద నిలయాలు
    ముగ్ధమోహన మధుర లీలావిలాసా!
    స్నిగ్ధ సుందర హాస! శ్రీ శ్రీనివాసా!             ||జయ జయ||

    స్వర్ణహార కేయూరాభరణా!
    స్వర్ణసూపులంకృత చరణా!
    స్వర్ణోజ్జ్వల వజ్రమకుటమౌళీ!
    స్వర్ణోత్సవ నవవైభవకేళీ!                     ||జయ జయ||

 Previous Page Next Page