Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 64

 

    
                               నవజీవన తరంగాలు

    తరంగాలు! తరంగాలు!
    స్వర్గంగా తరంగాలు!
    ప్రపంచాలు ముంచెత్తే
    ప్రజాశక్తి తరంగాలు!
    పొంగి పొంగి వస్తున్నై
    పొరలి పొరలి వస్తున్నై
    
    విలయ సాంధ్యవేదికపై
    ప్రళయకాల మహానటుడు
    ఘల్ ఘల్ ఘల్లని చరణం
    కదలించా డల్లదిగో!
    విశాల విప్లవ జటాజూటం
    విదలించా డల్లదిగో!

    జ్యోతిర్మయ స్వాతంత్ర్యోజ్జ్వల
    శీతాచల శిఖరాంచలముల
    జాతీయ స్రోతోవాహిని
    మ్రోతలతో దిగివస్తున్నది
    అఖండ భరతఖండ మంతా
    అప్లావిత మొనరిస్తున్నది

    అదిగదిగో మహాప్రవాహం
    అల్లదిగో ప్రజాప్రవాహం
    అదురులేని బెదురులేని
    ఎదురులేని ప్రజాప్రవాహం
    పొంగి పొంగి వస్తున్నది
    పొరలి పొరలి వస్తున్నది.

    రండి రండి తల్లుల్లారా! లెండి లెండి బాబుల్లారా!
    మనమంతా జలకణాలమై
    పయనిద్దా మీ ప్రవాహంలో
    కార్మికజన ఘర్మకణాలై
    కర్షకజన బాష్పకణాలై
    కర్మవీర రక్తకణాలై
    ప్రవాహంలో ప్రవేశించి
    పయనిద్దాం మనమంతా!

    జన్మభూమి అడుగులపై
    ప్రవహిద్దాం మనమంతా

    సువర్ణమాలా సమలంకృత
    త్రివర్ణ మహాధ్వజాగ్రంలో
    నవజ్యోతి సందర్శించే
    నవస్పూర్తి సంపాదించే
    యువభారత తరంగాలు!
    నవజీవన తరంగాలు!

    భుగభుగ రాజే గుండెల్లో
    భగభగ మండే మంటల్లో
    యుగయుగాల చైతన్యం
    జగజగాల వెలిగించే
    తరుణ తరుణ తరంగాలు!
    అరుణారుణ తరంగాలు!
    ఒత్తండయ్యా ! జయశంఖం!
    ఎత్తండమ్మా! జయహారతి!

        
                                    కావాలి

    బీదసాదల నిరుపేద జీవనము
    కార్మిక సంఘాల కష్టజీవనము
    కర్షక జనపద కరుణజీవనము
    బానిసజాతి నిర్భాగ్యజీవనము

    తమ చేతి కలములో తనరారునట్లు
    తమ చేతి కుంచెలో తళుకొత్తునట్లు
    ఉడుకునెత్తురు మేన నుప్పొంగునట్లు
    కటిక గుండెల నైన కరగించునట్లు

    రచియించు కవి కుమారకులు కావాలి
    ప్రకటించు చిత్రకారకులు కావాలి
    భావిభారతదేశ భాగ్యమ్ము కొరకు
    కావాలి! కావాలి! కావాలి! నేడు!

    
                                 కెప్టెన్ లక్ష్మీ
    
    లాల్ భిల్లా ప్రాంతంలో
    లక్ష్మీ సాక్షాత్కారం
    విమానాన్ని దిగుతున్నది
    వీరఝాన్సీ అవతారం
    
    అరిభీకర కరవాలం
    సురపురిలో దాచిపెట్టి
    దిగివచ్చావా క్రిందికి
    దేవీ! ఝాన్సీబాయీ!
    
    నేతాజీ కుడిభుజమై
    స్వాతంత్ర్య క్షేత్రానికి
    జాతిని నడపిన దివ్య
    జ్యోతివి కెప్టెన్ లక్ష్మీ!
    
    రక్తారుణ రణకవచం
    రంగూన్ లో ఉతుకవేసి
    వచ్చావా! మాతృచరణ
    వందనార్ధమై నేటికి!


                                   జైహింద్

    "ఆజాద్ హింద్" విజేతలం
    ప్రజారాజ్య విధాతలం
    "నేతాజీ" మా దైవం
    స్వాతంత్ర్యం మా జీవం

    అమ్మా! భారతమాతా!
    'ఆ. హిం. ఫౌజు" సైనికుణ్ణి
    దేశద్రోహినిగా సందేహిస్తావా తల్లీ!
    జపాన్ వాడి బానిసగా శంకిస్తావా తల్లీ!

    ఇంతలోతు కష్టంలో
    ఈది ఈది నీకోసం నడిచామే మేమంతా!
    పిడిచామే బ్రతుకంతా! విదిచామే సుఖశాంతులు!
    
    చిట్టగాంగు నట్టడవులు చుట్టిచుట్టి పట్టుపట్టి
    ఎండల్లో కొండల్లో తిండిలేక నిద్రలేక
    తిరిగి తిరిగి సురిగి సురిగి రాళ్ళల్లో ముళ్ళల్లో
    రాత్రి పగలు నీకోసం
    రక్తం చిందించామే!

    నా కండల్లో వీర్యం నా గుండెల్లో ధైర్యం
    నీకోసం వ్యయం చేసి నీకొరకే సమర్పించి
    'ఆజాద్ హింద్" యజ్ఞంలో ఆహుతి ఐనానమ్మా!
    సర్వస్వం నీకోసం స్వాహా చేశానమ్మా!
    అంత్యనమస్కారమైన ఆచరింపలేనమ్మా!
    అంతిమప్రార్ధనకై నా గొంతు విప్పలేనమ్మా!
    పడిపోయిన నా దేహం తెగిపోయిన నా చేతులు
    బ్రద్దలైన నా వక్షం ప్రవహించే నా రక్తం
    వ్రేలాడే నా ప్రేగులు కొట్టుకొనే నా గుండెలు
    చుట్టుకొనే రాబందులు సాక్ష్యం నా త్యాగానికి
    చెవులల్లో మ్రోగుతుంది "జైహింద్" నినాదం
    కళ్ళల్లో మెరుస్తుంది కన్నతల్లి ప్రాసాదం
    నా స్వతంత్ర జయభారతి నవ్యభవ్య దివ్యాకృతి
    స్వప్నం వలె స్వర్గం వలె
    కనురెప్పల సందుల్లో
    కదలని ఒక బాష్పకణం

    నేతాజీ నా దైవం స్వాతంత్ర్యం నా జీవం
    అల్లదిగో లాల్ ఖిల్లా డిల్లీలో పిలుస్తుంది
    వస్తున్నా వస్తున్నా పరుగెత్తుకు వస్తున్నా
    జైహింద్! డిల్లీ చలో!


                                   ఆశాజ్యోతి

    ఫెళఫెళ మ్రోగె నగారా! దేశం
    పిలిచెను నిన్ను కుమారా!
    తళతళ మెరిసే కరవాలం గొని
    తరలుమురా సంగర రంగానికి         ||ఫెళ ఫెళ||

    ఆలిక ఫలకమున తిలకము దిద్దితి
    వెలిగే హారతి కన్నుల నద్దితి
    అనందాశ్రుల నభిషేకించితి
    నిండుగుండెతో నిను దీవించితి        ||ఫెళ ఫెళ||

    పూర్వపుణ్యములు పులకించెనురా
    మాతృత్వం మైమరపించేనురా
    స్వతంత్రభారత సమర యజ్ఞమున
    బ్రతుకంతా ఆహుతి కావింపర        ||ఫెళ ఫెళ||

    విజయం నీదే విశ్వసింపరా
    స్వజాతి ధర్మము సంరక్షింపర
    అజేయమోయ్ మన భారతజాతీ!
    ప్రజాస్వామ్యమున కాశాజ్యోతీ!        ||ఫెళ ఫెళ||

 Previous Page Next Page